Telangana Rains: తెలంగాణలో మరోసారి జోరుగా వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వానలు పడుతున్నాయి. హైదరాబాద్‌లో మొన్నటి వరకు కుండపోత వాన జనాలను బెదరగొట్టేసింది. ఇప్పుడు మాత్రం తుంపరలు పడుతున్నాయి.  దక్షిణ తెలంగాణలో వానల ప్రభావం ఎక్కువగా ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, భూపాలపల్లిలో కుండపోత వాన పడుతోంది. నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపలి, కరీంనగర్‌, సిరిసిల్లలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే అరవై నుంచి వంద మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. మరికొన్ని ప్రాంతాల్లో వంద మిల్లీ మీటర్‌లకు పైగా వర్షపాతం రిజిస్టర్ అయ్యింది.

ఇలాంటి పరిస్థితి మరో మూడు రోజులు ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డిలో భారీ వర్షాలు కురుస్తాయి. ఇలా భారీ వర్షాలు పడే జిల్లాలకు ప్రభుత్వాధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.  వాటిలో జగిత్యాల, సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్‌, వరంగల్, హనుమకొండ, వికారాబాద్, మెదక్ జిల్లాలు ఉన్నాయి. 

ఇప్పటికే వివిధ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు నదులు పొంగుతున్నాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. రహదారుల పైకి నీరు చేరడంతో చాలా ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు రావడంతో గేట్ల ఎత్తి నీటిని దిగువకు వదలుతున్నారు.  

గత 24 గంటల్లో తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో నమోదు అయిన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. 115MM నుంచి 204mm మధ్య వర్షపాతం నమోదు అయిన ప్రాంతాలు 9 ఉన్నాయి.  64.5 నుంచి 115.5 మధ్య భారీ వర్షం పడిన ప్రాంతాలు తెలంగాణ వ్యాప్తంగా 61 ఉన్నాయి.

మోస్తారు వర్షాలు అంటే 15.4 నుంచి 64.4 మధ్య కురిసిన ప్రాంతాలు 416 ఉన్నాయి. సాధారణ వర్షపాతం నమోదు అయిన ప్రాంతాలు 386 ప్రాంతాలు ఉన్నాయి. ఇక్క 2.5 నుంచి15.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.  సాధారణం కంటే తక్కువ వర్షపాతం 0.3నుంచి 2.4 మధ్య వర్షపాతం నమోదు అయిన ప్రాంతాలు 66 మాత్రమే ఉన్నాయి. అసలు వర్షాలు పడని ప్రాంతాలు తెలంగాణ వ్యాప్తంగా 152 మాత్రమే ఉన్నాయి.  

ములుగు జిల్లా గోవిందరావుపేటలో క్లౌడ్ బరస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. అక్కడ ఏకంగా 151.3MM వర్షపాతం నమోదు అయింది. అదే జిల్లా మేడారంలో కూడా 150.5 MM వర్షం కురిసింది.