Indiramma Indlu Scheme in Telangana: తెలంగాణలో నిరుపేదలకు ఇల్లు కట్టించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టింది. మొదట భూమి కలిగి ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు సిద్ధంగా ఉన్నవారికే అవకాశం కల్పించింది. ఇలా మొదటి విడతలో కేటాయించిన ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయి. అయితే పనులు సాగుతున్నప్పటికీ ప్రభుత్వం విడతలవారీగా రావాల్సిన డబ్బులు రావడం లేదు. దీనిపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ డబ్బులు ఎందుకు రావడం లేదని ప్రశ్నిస్తున్నారు. 

చిన్న చిన్న పొరపాట్లు కారణంగానే డబ్బులు జమ కావడం లేదని వాటిని సవరించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్క లబ్ధిదారులకు ఆధార్‌ను ఆధారంగా చేసుకొని చెల్లింపులు చేస్తున్నామని అప్లికేషన్ నింపడంలో పొరపాట్లు ఉంటే కానీ నిధులు జమ ఆగే పరిస్థితి లేదని అంటున్నారు. అందుకే స్థానికంగా ఉండే అధికారులను సంప్రదించి లోపాలు సరి చేసుకుంటే డబ్బులు జమ అవుతాయన్నారు. 

సమస్యలేంటీ

కొందరు యాక్టివ్‌గా లేని బ్యాంకు ఖాతాలు ఇవ్వడం వల్ల వారికి నిధులు జమ కావని అన్నారు. అందుకే వెంటనే అలాంటి వాళ్లంటా బ్యాంకుకు వెళ్లి ఈకేవైసీ చేయాలని అధికారులు సూచిస్తున్నారు. బ్యాంకు ఖాతాను ఆధార్‌, ఫోన్ నెంబర్‌తో అనుసంధానం చేస్తే అకౌంట్‌ యాక్టివ్ అవుతుందని చెబుతున్నారు. 

మరికొందరు ఖాతా యాక్టివ్‌గా ఉన్నప్పటికీ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ తప్పుగా నమోదు చేసి ఉన్నారని వివరిస్తున్నారు. చాలా మంది దీన్ని పెద్ద విషయంగా పట్టించుకోరని కానీ నగదు జమ కావడంలో ఈ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌ చాలా యూజ్ అవుతుందని అందుకే ఆ కోడ్‌ నింపేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకోవాలని చెబుతున్నారు. నిధులు రాకపోవడానికి ఇది కూడా రీజన్ కావచ్చని అనుమానిస్తున్నారు. 

మరికొందరు ఆధార్‌లో ఉన్న పేరు ఒకటి అయితే బ్యాంకు అప్లికేషన్‌లో వేరొక పేరు ఇస్తున్నారని ఇది కూడా సమస్యగా మారుతుందన్నారు. ఆధార్ కార్డులో కన్నవారింటి పేరు ఉంటే ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్‌లో భర్త ఇంటిపేరు ఉంటుందని దీని వల్ల కూడా సమస్య వస్తోందని తెలిపారు. ఇలాంటివి చాలా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు అధికారుల వివరిస్తున్నారు. ఆధార్‌లో ఉన్న పేరుతోనే ప్రక్రియ పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ దరఖాస్తులు దాని ఆధారంగా నింపాలని హితవు చెబుతున్నారు. ఇలాంటి దరఖాస్తులు ఉంటే ఎంపీడీవో, కార్యదర్శులు సరి చేయాలని ఆదేశిస్తున్నారు. 

ఈ కారణాలను సరి చేసుకుంటే ఆ తర్వాత సోమవారం వారి ఖాతాల్లో నగదు పడుతుందని అధికారులు వెల్లడిస్తున్నారు.