కుమ్రం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. తుంపెల్లి మొరం వాగులో కాళ్ళు కడుక్కోవడానికి వెళ్లిన బాలుడు గల్లంతయ్యాడు. ఆ బాలుడిని కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తి కూడా కనిపించుకుండా పోయాడు. 


తుంపెల్లి మొరం వాగులో ప్రమాదవశాత్తు రేకుల కౌశిక్ (9) అనే బాలుడు జారి పడిపోయాడు. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులో బాలుడు పడిపోవడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా కంగారు పడ్డారు. కౌశిక్‌ను కాపాడేందుకు వాగులోకి ముగ్గురు వ్యక్తులు దూకారు. వారిలో గాదే మోహన్ అనే వ్యక్తి (35) కూడా గల్లంతు అయ్యాడు. 


ఇలా నిమిషాల వ్యవధిలోనే ఇద్దరు గల్లంతు కావడంతో మిగతా వారు అలర్ట్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన పోలీసులు ఆ ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి వాగులో జల్లెడ పట్టారు. 


ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆసిఫాబాద్ మండలంలోని తుంపెల్లి వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో దాదాపుగా 15 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పోలీసులు అధికారులు వాగు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రామప్రజలు వాగు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. 


తుంపల్లి వాగులో ఇద్దరు గల్లంతైన విషయం తెలియగానే రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ సంచాలకులు, ప్రత్యేక అధికారి హనుమంతరావు, జిల్లా కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎస్పీ సురేష్ కుమార్, జడ్పీ ఛైర్పర్సన్ కోవ లక్ష్మి, తరలివచ్చి తుంపల్లి వాగును పరిశీలించారు. వాగులో గల్లంతైన కౌశిక్‌తో ఉన్న బాలుడితో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.


ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసిన కలెక్టర్


కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా ఏర్పడిన వరద పరిస్థితులలో ప్రత్యేక విధులు కేటాయించిన ముగ్గురు అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉప్పొంగుతున్న వాగులు, నదుల వద్ద ప్రజారక్షణ కోసం నియమించిన తుంపెల్లి పంచాయితీ కార్యదర్శి, వి.ఆర్.ఏ. అలసత్వం కారణంగా 9 సంవత్సరాల బాలుడు గల్లంతయ్యాడని అన్నారు. ఈ కారణంగా వీరితో పాటు కేటాయించిన విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు జనకాపూర్ వి.ఆర్.ఏ.ను ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ చట్టం-2005 కింద సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.