Demand to cancel Go 49 in Asifabad | ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ, అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో సోమవారం నాడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కొనసాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో టైగర్ కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన జీఓ.49ను. వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసి సంఘాలు బంద్ ను కొనసాగిస్తున్నాయి. జిల్లాలో మార్కెట్ సముదాయాలు, వ్యాపారులు సైతం స్వచ్ఛందంగా బంద్ చేపట్టారు.
ఉదయం 5 గంటల నుంచే బంద్ఆర్టీసీ డిపోలో నుండి బస్సులు బయటకి రాకుండా ఉదయం ఐదు గంటలకే ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ముందు ఆదివాసీ నాయకులు బైఠాయించి రాస్తారోకో చేపట్టారు. తమ జీవన మనుగడకు భంగం కల్గించే జీఓ 49 ను రద్దు చేసి, తమ హక్కులను రక్షించుకునేందుకు ప్రభుత్వాలపై తెస్తున్న ఒత్తిడి కోసం అందరూ సహకరించాలని, ఆదివాసి నాయకులు విజ్ఞప్తి చేశారు.
ఆదిలాబాద్ తో పాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాలోను అన్ని మండలాల్లో నాయకులు.. వాణిజ్య వర్తక వ్యాపారులకు, అందరికి బంద్ కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు ఐదవ షెడ్యూల్ ప్రాంతంలోని భారత రాజ్యాంగంలో పొందుపరిచిన 1/70, పేసా, ఆదివాసి చట్టాలను, ఆదివాసీల అస్తిత్వాన్ని, ఆదివాసీల మనుగడను ఆదివాసిల హక్కులను జీవోలను ఉల్లంఘిస్తూ ఏటువంటి గ్రామసభ తీర్మానాలు లేకుండానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్రం భీం కన్జర్వేషన్ కారిడార్ పేరిట తీసుకువచ్చిన జీఓ 49 ను వెంటనే రద్దు చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బంద్ కు ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ, ఆదివాసి సంఘాలు పిలుపునిచ్చాయి.
ఈ బంద్ కు అన్ని వర్గాల ప్రజలు, వ్యాపార వర్తక, చిరు వ్యాపారులు ప్రైవేట్ స్కూల్ కాలేజీల యాజమాన్యాలు, సినిమా ధియేటర్లు, బ్యాంకులు, పెట్రోల్ బంకులు పూర్తిస్థాయిలో బంద్ పాటించారు. అదేవిధంగా ఈ యొక్క బందులో అన్ని వర్గాల ప్రజలు ప్రజాస్వామిక వాదులు యువజన, విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు వామపక్ష పార్టీల నాయకులు ఆయా రాజకీయ పార్టీల ప్రజలు, మేధావులు బుద్ధి జీవులు, కార్మిక కర్షక వర్గాల ప్రజలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బంద్ కొనసాగిస్తున్నారు.