టీఎస్ ఆర్టీసీ కార్గో వినూత్నకార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వన దేవతలైన సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లలేని భక్తుల కోసం మొక్కులు చెల్లించుకునే వెసులుబాటు కల్పించింది. కోవిడ్, ఇతరత్రా కారణాలతో జాతరకు వెళ్లలేని భక్తులు సమ్మక్క సారలమ్మ అమ్మవార్లకు ఇష్టమైన బెల్లం అంటే బంగారం మొక్కులు ఆర్టీసీ కార్గోలో పంపించవచ్చు. భక్తులు ఇచ్చే బెల్లాన్ని కార్గో సర్వీస్ ద్వారా జాతరలో అమ్మవార్లకు నైవేద్యంగా పెట్టి తిరిగి జాతర అనంతరం భక్తులకు వారి బెల్లాన్ని, దాంతో పాటు అమ్మవార్ల పసుపు, కుంకుమను భక్తులకు ఇవ్వనున్నారు.
సమ్మక్క సారలమ్మ భక్తులకు సువర్ణావకాశం
బంగారం మొక్కు ప్రతిఫలం దక్కు పేరుతో తెలంగాణ ఆర్టీసీ కార్గో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. కార్గో ద్వారా బెల్లం మొక్కు చెల్లించుకునేందుకు ఛార్జీ రూ.450 పెట్టారు. సమ్మక్క సారలమ్మ జాతర ముగిసే వరకు 24 గంటలపాటు సేవలను అందుబాటులో ఉంచారు. జాతరకు వెళ్లలేని వారి కోసం మొక్కులు చెల్లించుకునే వారి కోసం సదవకాశం కల్పించింది టీఎస్ ఆర్టీసీ.
సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించటంతో జాతరకు వెళ్లలేని భక్తులు ఆర్టీసీ కార్గోను సంప్రదిస్తున్నారు. కార్గో ఫీజు రూ.450 చెల్లిస్తే... ఆర్టీసీ కార్గొ వారికి బిల్లు ఇస్తుంది. భక్తుల పూర్తి వివరాలు సేకరించి... జాతర ముసిన తర్వాత మొక్కులు చెల్లించిన బెల్లంతోపాటు పసుపు కుంకుమను వారికి ఫోన్ చేసి తిరిగి ఇచ్చేస్తుంది. రుసుము కూడా తక్కువ ఉండటంతో చాలా మంది భక్తులు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకునేందుకు ఆర్టీసీ కార్గోను ఆశ్రయిస్తున్నారు.
బెల్లం దొరకకుంటే ఆర్టీసీ వారే బెల్లాన్ని అందుబాటులో ఉంచారు. కేజీ నుంచి 5 కేజీల వరకు బెల్లం తీసుకుంటుంది ఆర్టీసీ కార్గో. నిజామాబాద్ నగరంలోని బస్టాండ్‌లో ఏర్పాటు చేసిన బంగారం మొక్కు ప్రతిఫలం దక్కు సేవలకు స్థానికులు అభినందనలు తెలుపుతున్నారు.
బస్సుల సమాచారం కూడా
మరోవైపు మేడారం జాతర యాప్‌ను కూడా తీసుకొచ్చింది ఆర్టీసీ. మేడారం జాతర వెళ్లేందుకు బస్సులు ఏ టైంలో ఉన్నాయో ఇందులో తెలుసుకోవచ్చు.