Vemula Prashanth Reddy On Bandi Sanjay: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రైతుల అభీష్టం మేరకే ఉంటుందని తెలంగాణ రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు రైతులను అనవసరంగా రెచ్చ గొడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ కామారెడ్డిలో నోటికొచ్చినట్లు మాట్లాతున్నారని, నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతుల కోసం ఏం చేయాలో నీతో చెప్పించు కోవాల్సిన గత్యంతరం మాకు పట్టలేదని అన్నారు. దేశం మొత్తంలో అత్యంత గొప్పగా గౌరవం పొందుతున్న రైతు తెలంగాణ రైతు అని మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. రైతులకు ఏమీ చేయాలో తమకు తెలుసునని, కావాలంటే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి నీ సలహాలు ఇవ్వు అని చురకులు అంటించారు. రైతు ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పిన కేంద్రం మద్దతు ధర ఇవ్వక పోగా.. ఎరువుల ధరలు మూడు రెట్లు పెంచి రైతుల నడ్డి విరుస్తోందని, ప్రశ్నించిన రైతులను వాహనాలతో తొక్కించిన చరిత్ర బీజేపీ పార్టీదని మండిపడ్డారు. రైతుల కోసం రైతు బంధు, రైతు భీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలుసుకోవాలని బండి సంజయ్ కి సూచించారు. వ్యవసాయ రంగాన్ని నిర్వీర్యం చేస్తూ రైతులను అరిగోసా పెడుతూ నిండా ముంచుతున్నారని ధ్వజమెత్తారు. అట్లాంటి వారు రైతు కోసం మొసలి కన్నీరు కారిస్తే ఎవరు నమ్మరన్నారు.
కేవలం రాజకీయ లబ్దికోసమే తన హైకమాండ్ ఆదేశాల మేరకే కామారెడ్డి లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ డ్రామాకు తెరలేపాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బండి సంజయ్ కి చేతనైతే కేంద్రంతో మాట్లాడి సిలిండర్ ధర తగ్గించాలి.. వ్యవసాయ రంగం మీద వేసే పన్నులు తగ్గించాలి.. ప్రతి ఒక్కరి అకౌంట్లో 15 లక్షలు వేస్తమన్న ప్రధాని నరేంద్ర మోదీకి చెప్పి హామీ ఇచ్చిన లక్షలు రూపాయలు అకౌంట్లలో జమ చేయించాలన్నారు. తెలంగాణ అభివృధ్ధి ని అన్ని విధాల అడ్డుకుంటున్న కేంద్రంలోని బీజేపీ మోదీ ప్రభుత్వాన్ని ఒప్పించి, దమ్ముంటే మెడికల్ కాలేజీలు తీసుకురా..! కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సినవి, ఇతర రాష్ట్రాలకు తరలిస్తుందని వాటి గురించి కేంద్రంతో మాట్లాడి తీసుకురా అని బండి సంజయ్‌కు మంత్రి ప్రశాంత్ రెడ్డి సవాల్ చేశారు.
రైతుల రక్తాన్ని పీల్చుకుని తింటున్న రాకాసి బీజేపీ మాయ మాటలు దయచేసి రైతులు ఎవ్వరూ నమ్మొద్దని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఉన్నది రైతు ప్రభుత్వమని, రైతులను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటదని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సంయమనం పాటించాలని సమయం ఇదంటూ రైతులకు మరోమారు మంత్రి విజ్ఞప్తి చేశారు.
కామారెడ్డి మాస్టార్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ గత నెల రోజులుగా రైతులు ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టు మెట్లెక్కారు. అయితే బుధవారానికి విచారణ వాయిదా పడింది. ఇప్పటికే కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లను కలిసి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తీర్మానం చేయాలని రైతులు కోరారు. ఈనెల 11న మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాల స్వీకరణ గడువు కూడా ముగుస్తోంది. 12న మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తీర్మానం చేయాలని అన్నదాతలు కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి వినతి పత్రం కూడా ఇచ్చారు.