కామారెడ్డి పట్టణ మాస్టర్ ప్లాన్ తెలంగాణలో హాట్ టాపిక్ అయింది. కామారెడ్డి మాస్టార్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ గత నెల రోజులుగా రైతులు ఆందోళన బాట పట్టారు. తమకు న్యాయం చేయాలంటూ హైకోర్టు మెట్లెక్కారు. అయితే బుధవారానికి విచారణ వాయిదా పడింది. ఇప్పటికే కామారెడ్డి మున్సిపల్ కౌన్సిలర్లను కలిసి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తీర్మానం చేయాలని రైతులు కోరారు. ఈనెల 11న మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరాల స్వీకరణ గడువు కూడా ముగుస్తోంది. 12న మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం తీర్మానం చేయాలని అన్నదాతలు కౌన్సిలర్ల ఇళ్లకు వెళ్లి వినతి పత్రం కూడా ఇచ్చారు. అయితే బీజేపీ కౌన్సిలర్లు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ... బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ ను కలిశారు. ఈ నెల 12 మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మాస్టర్ ప్లాన్ రద్దు చేసేలా తీర్మానం చేయాలని బీజేపీ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కు వినతిపత్రం ఇచ్చారు.
మాస్టర్ ప్లాన్ వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తున్నారు. వీరికి కాంగ్రెస్, బీజేపీ మద్దతిస్తున్నాయి. కానీ బీజేపీ మాత్రం ఈ సమస్యపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ధర్నాలు, నిరసనలలో పాల్గొనడంతో మద్దతు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఇష్యూను తారా స్థాయికి తీసుకురావటంలో అన్నదాతల వెనుక కమలం పార్టీ పూర్తి మద్దతునిచ్చిందంటున్నారు. ఈ ఇష్యూపై బీజేపీ నేతలు బండి సంజయ్, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎంపీ అరవింద్ ఇలా ఆ పార్టీ ముఖ్య నేతలంతా స్పందించారు. బండి సంజయ్ కామారెడ్డికి వెళ్లి రైతులను సైతం కలిసి వారికి మద్దతు నిలిచారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఒక రోజంతా రైతులు చేపట్టిన ర్యాలీలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు. రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాంగ్రెస్ కూడా మద్దతు ప్రకటించినా... అలా ఓ రోజు హడావుడి చేసి వెళ్లిపోయిందంటున్నారు అన్నదాతలు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ఇష్యూ ఈ స్థాయిలో రావటానికి బీజేపీ రైతులకు వెన్నుదన్నుగా నిలిచినట్లు కనిపిస్తోంది. పొలిటికల్ మైలేజీ రాబట్టుకునేందుకు కామారెడ్డిలో కమలం పార్టీ మాస్టర్ ప్లాన్ ఇష్యూను వదలడం లేదు. ఓ వైపు రైతులకు న్యాయం జరిగితే, అది పోరాటం ఫలితమేనని కమలనాథులు ప్రచారం చేసుకునే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫుల్ స్టాఫ్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ ఏంటీ!
కామారెడ్డి జిల్లా కేంద్రంను ఇండస్ట్రియల్ జోన్గా మార్చేందుకు రూపొందించిన మాస్టర్ ప్లాన్ రగడకు తెరదించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్ ఏర్పాటుతో 8 గ్రామాల్లో తీవ్రంగా నష్టపోతామనే అభిప్రాయం రైతుల్లో బలంగా నాటుకుపోయింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, భూస్వాములకు, అధికార పార్టీకి చెందిన నేతలకు అనుకూలంగా మాస్టర్ ప్లాన్ మూసాయిద సిద్ధమైనట్లేననే ప్రచారం జరగడంతో ఇండస్ట్రియల్ జోన్ ప్రభావిత గ్రామాల రైతులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. మాస్టర్ ప్లాన్ మూసాయిదా పూర్తి కాలేదని మార్పులు చేర్పులకు అవకాశం ఉందని, ప్రజలకు అనుకూలంగానే మూసాయిదా తయారు ఉంటుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసినప్పటికీ... కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే లు చేసిన ప్రయత్నాలు అన్నదాతలు నమ్మలేక పోతున్నారు.
గ్రామాల్లో ప్రత్యేక సభలు ఏర్పాటు చేసి రైతులకు మాస్టర్ ప్లాన్ పై అవగాహన చేయాలని నిర్ణయించారు. ప్రజాభిప్రాయం మేరకే మార్పులు చేర్పులతో మాస్టర్ ప్లాన్ మళ్లీ రూపకల్పన జరుగుతుందని భరోసా కల్పించేందుకు ప్రత్యేకంగా బృందం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రజాభిప్రాయం పూర్తయిన తర్వాతనే ఇండస్ట్రీయల్ జోన్ ఏర్పాటు ప్రక్రియ మొదలు పెట్టాలని ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
మాస్టర్ ప్లాన్ ఇండస్ట్రియల్ జోన్ వల్ల 2100 కు పైగా ఎకరాల్లో వందలాది మంది రైతులకు తీరని నష్టం జరుగుతుందన్నది వారి వాదన. ఈ విషయంలో జిల్లా అధికార యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలున్నాయి. జిల్లా కలెక్టర్ మొండి వైఖరి వల్లనే పరిస్థితి హద్దు దాటి సమస్యగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. మూసాయిదా పూర్తి కాలేదని, అభ్యంతరాల స్వీకరణ, కౌన్సిల్ తీర్మాణంపై రైతుల్లో అవగాహన కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయ్. ప్రభుత్వం అనుకున్న మాస్టర్ ప్లాన్ గెజిట్ ప్రకటన విడుదల కాకముందే రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదే. ఢీల్లీ కి చెందిన ఓ సంస్థతో మాస్టర్ ప్లాన్ ను రూపోందించారు.
ఢిల్లీ సంస్థ రైతుల ప్రయోజనాలను పరిగణలోకి తీసుకోకుండా ఇండస్ట్రియల్ జోన్ గా మాస్టర్ ప్లాన్ ను రూపొందించిందనే అపోహలు రైతుల్లో ఉన్నాయి. రెండు సీజన్లలో పంటలు పండే పొలాలను కోల్పోతామనే ఆందోళన తీవ్రమైంది. దాదాపుగా 2800 ఎకరాల విస్తీర్ణంలో మూసాయిద తయారు చేశారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో చుట్టూ 100 ఫీట్ల రోడ్లును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్లను ఏర్పాటు చేయడానికి 8 గ్రామాల రైతులు తీవ్రంగా వ్యతిరేఖించారు.
వీటికి సంబంధించి అభ్యంతరాలను ఇవ్వడానికి కలెక్టరేట్ కు తరలివచ్చిన రైతుల పట్ల అధికారులు సరిగా స్పందించపోడం, జిల్లా కలెక్టర్ ఈ విషయంలో సరైన నిర్ణయం తీసుకోని బాధిత గ్రామాల ప్రజలకు అవగాహన కల్పించడంలో నిర్లక్ష్యం చేశారనే ఆరోపణలున్నాయి. ఫలితంగా రైతుల ఉద్యమం మరింత తీవ్రమైంది. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదంటూ అన్నదాతలు స్పష్టం చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారం మాత్రం కమలం పార్టీకి కలిసొచ్చే అంశంగా చెుప్పుకుంటున్నాయ్ రాజకీయ వర్గాలు. ప్రభుత్వం రైతుల పట్ల సానుకూల నిర్ణయం తీసుకుంటే తప్ప మాస్టర్ ప్లాన్ రగడకు చెక్ పెట్టే అవకాశం లేదంటున్నారు.