• స్వ‌రాష్ట్రంలో మ‌న బ‌తుకులు బాగుప‌డ్డాయి

  • పల్లె, పట్టణమనే తేడా లేకుండా అభివృద్ధి పరుగులు పెడుతుంది

  • కండ్ల ముందు కనిపిస్తున్న ప్రగతిని దూరం చేసుకోవ‌ద్దు

  • ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌ల మాట‌లు విని బ‌తుకులు ఆగం చేసుకోవ‌ద్దు

  • అందరి బాగు కోరే కేసీఆర్ తోనే స‌మ‌గ్రాభివృద్ధి సాధ్యం

  • బీజేపీ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ తరహా పథకాలేవి

  • మాజీ ఎమ్మెల్యే మ‌హేశ్వ‌ర్ రెడ్డి పార్టీ మార‌డం ఖాయం

  • ఆత్మీయ సమ్మేళ‌నంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి


తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ( Telangana Minister Indrakaran Reddy) అన్నారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌, రైతుబంధు, రైతుబీమా, ఇంటింటికీ రక్షిత మంచినీరు, ఆసరా పెన్షన్లు, కేసీఆర్‌ కిట్‌, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా అమలవుతుంటే చూపాలని బీజేపీ నేత‌ల‌ను ప్ర‌శ్నించారు. సీఎం కేసీఆర్ దిశానిర్దేశంతో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నేతలు వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో తాము చేసిన పనులు, తీసుకొచ్చిన పథకాలను వాటి ద్వారా కలిగిన ప్రయోజనాలను ప్రజలకు వివరిస్తున్నారు.


బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నంలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్


నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్ష‌న్ హాల్ లో నిర్వ‌హించిన నిర్మ‌ల్ మండ‌ల బీఆర్ఎస్ ఆత్మీయ స‌మ్మేళ‌నం ( BRS Atmiya Sammelanam in Nirmal)లో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి మాట్లాడారు. గ‌త తొమ్మిదేండ్ల‌లో సీఎం కేసీఆర్ ప్ర‌భుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను వివ‌రించారు. అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌ను విస్తృతంగా ప్ర‌జ‌ల్లోకి తీసుకు వెళ్ళాల‌ని పార్టీ శ్రేణుల‌కు దిశానిర్ధేశం చేశారు. 


ఉమ్మడి రాష్ట్రంలో వర్షాధార పంటలు.. ఇప్పుడు అన్ని పంటలు 
ఉమ్మ‌డి పాల‌న‌లో సాగునీటి కొరత కారణంగా రైతులు వర్షాధార పంటలు సాగు చేసేవారని, అయితే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం సాగునీటి రంగానికి పెద్దపీట వేసిందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు మరమ్మతులు, కాలువల ఆధునీకీకరణ, మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా చెరువులను బాగు చేసింది. దీంతో రైతులకు రెండు పంటలకూ సరిపడా సాగునీరు అందుతున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో నిర్మల్‌ జిల్లాల్లో ఏటా సాగు విస్తీర్ణం పెరిగింద‌ని తెలిపారు. 
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన పథకాలు..
రైతుబంధు, రైతు బీమా, ఆస‌రా పించ‌న్లు,  క‌ళ్యాణల‌క్ష్మి, షాదీ ముబార‌క్, డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం, మిష‌న్ భ‌గీర‌థ ప‌థ‌కం ద్వారా ఇంటింటికి  మంచినీళ్ళు,  24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ స‌ర‌ఫ‌రా, ఊరు వాడ‌లా ర‌హ‌దారుల నిర్మాణం ఇలాంటి ఎన్నో అభివృద్ధి సంక్షేమ ప‌థ‌కాల అమ‌లుతో తెలంగాణ ప్ర‌జ‌ల బ‌తుకులు బాగుప‌డ్డాయ‌ని,  ప్ర‌తిపక్ష పార్టీ నేత‌ల క‌ళ్ళ‌బొల్లి మాట‌లు న‌మ్మి బతుకులు ఆగం చేసుకోవ‌ద్ద‌ని కోరారు.


గ‌తంలో మ‌హేశ్వ‌ర్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మ‌య్యాయి


మాజీ ఎమ్మెల్యే మ‌హేశ్వ‌ర్ రెడ్డి ఎక్క‌డ ఉన్నాడో తెలిసిందా ? పండ్లు, పూలు పెట్టుకున్నారు, పుస్తె క‌ట్ట‌డం మాత్ర‌మే మిగిలి ఉంద‌ని గ‌తంలో మ‌హేశ్వ‌ర్ రెడ్డి గురించి తాను చేసిన వ్యాఖ్య‌లు నిజ‌మ‌య్యాయ‌ని , ఆయ‌న నేడో రేపు బీజేపీ పార్టీలో చేర‌టం ఖాయ‌మ‌ని స్ప‌ష్టం చేశారు.