బీజేపీలో చేరకపోతే ఈడీ, ఐటీల‌తో కేసులు పెట్టి బెదిరిస్తున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీజేపీ చేస్తున్న ప‌ని రామ్ రామ్ జ‌ప్నా.. ప‌రాయి లీడ‌ర్ అప్నా అనే తీరుగా ఉందని ఎద్దేవా చేశారు. బయటి లీడర్లను తీసుకువచ్చి రాజకీయం చేస్తున్నారంటూ మండిపడ్డారు. నెల రోజుల నుండి తెలంగాణ మంత్రుల‌ను, ఎమ్మెల్యేల‌ను వ‌ద‌ల‌కుండా ఈడీ, ఐటీ రైడ్స్ చేస్తున్నారని... మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, తెలంగాణ వాళ్లు బ‌య‌ప‌డే వాళ్లు కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 


కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం తాండూరులో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ కవిత బీజేపీపై ఫైర్ అయ్యారు. వ్యాపారం లీగ‌ల్ చేసుకుంటారు.. అధికారులు అడిగితే స‌మాదానం చెబుతారు. మ‌న ద‌గ్గర ఎమ్మెల్యేల కోనుగోలు కేసులో బీజేపీ జాతీయ నేత బిఎల్ సంతోష్ పేరు వ‌చ్చింది, అందుకే సిట్ అధికారులు విచార‌ణ‌కు పిలుస్తూ నోటీసులు ఇచ్చారని కవిత అన్నారు. ఒక్క బీజేపీ నేతలను విచారణకు పిలిస్తేనే ఎంత భ‌యం.. ప‌ది కేసులు వేశారు. ఇక్కడ దొరికిన దొంగ‌ల మీద విచార‌ణ చేయొద్దు అని కోర్డు నుండి సైతం స్టే తెచ్చుకున్నారు. అయినా మనం న్యాయం కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లి విచారణపై ఆర్డర్ తెచ్చుకున్నామని గుర్తు చేశారు. 


బండి సంజయ్ దొంగ ప్రమాణాలు.. 
మాకు సవాల్ విసిరిన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ యాద‌గిరి గుట్టకు వెళ్లి దొంగ ప్రమాణాలు చేశారని విమర్శించారు. నిన్న కూడా ఎందుకు ఏడ్చాడో ఎవరికీ తెలియ‌దు. అడ్డంగా దొరికిన బిఎల్ సంతోష్ ను అరెస్ట్ చేయవద్దు అని బీజేపీ నేతలు కోర్టుకు వెళ్లారు. విచార‌ణ‌కు హ‌జ‌రు అవ్వాలని కోర్టు స్పష్టం చేసింది. కానీ బీఎస్ సంతోష్ విచార‌ణకు హాజరుకాకుండా మ‌ళ్లీ కోర్టుకు వెళ్లారు. మ‌న మంత్రులు, ఏ ఏజెన్సీకైనా స‌హ‌కరిస్తున్నారు, రాష్ట్ర ప్రజలతో పాటు కేంద్రానికి ఈ విషయం తెలుసునన్నారు. 


రాముని పేరు చేప్పి రౌడీయిజం చేస్తున్నారు 
ఈడీ, ఐటీ లాంటి ఏ ఏజెన్సీతో విచారణ వేసినా తమకు ఏ స‌మ‌స్య లేదు అన్నారు. రాముడి పేరు చెప్పి, మతం పేరుతో రౌడీయిజం చేస్తున్నారని ఆరోపించారు. ఓ సమయంలో బాబు తానే చక్రం తిప్పుతాననుకుంటున్న సమయంలో కేసీఆర్ పిడికిలి బిగించారు. రాజకీయంగా ఆగం కావల్సిన అవసరం లేదు. ప్రెసిడెన్షియల్ ఆర్డర్  పంపిస్తే నాలుగేళ్లు రాలేదు, కానీ సాధించుకున్నాం.. ఇవాళ స్థానికంగానే ఉద్యోగాలు ఇచ్చుకోగలిగే వెసులుబాటు ఉందన్నారు కవిత. ప్రధాని నరేంద్ర మోదీ ఇవ్వకున్నా సరే, గిరిజన రిజర్వేషన్లు పదిశాతం ఇచ్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు కవిత. రైతు బంధును కాపీ కొట్టి పీఎం కిసాన్ యోజన పెట్టారు. రాజకీయ లబ్ధి కోసం మొదలుపెట్టిన పథకం కావడంతో ఒకప్పుడు 13 కోట్ల మందికి ఇస్తే, పీఎం కిసాన్ లబ్ధిదారుల సంఖ్య ఇప్పుడు 3 కోట్లకు తగ్గించారని కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోదీపై విమర్శలు చేశారు.


ఓవైపు మునుగోడులో ఉప ఎన్నికలైతే.. రాహుల్ గాంధీ దక్షిణ తెలంగాణ బదులు ఉత్తర తెలంగాణ నుంచి ఎందుకొచ్చిండో తెల్వదన్నట్టు వెళ్లిపోయారని సెటైర్ వేశారు. తాండూరు త్రిలింగేశ్వర ఆలయ అభివృద్ధికి, ఏడుపాయలు, పోచారం వంటి ప్రాంతాలతో పాటు ఈ ప్రాంతాన్ని టూరిజం సర్క్యూట్ గా అభివృద్ధి చేసేందుకు తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు.