వేల మంది భక్తులు సమక్షంలో నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం సీహెచ్‌ కొండూర్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దంపతులు నిర్మించిన రాజ్యలక్ష్మి సమేత లక్ష్మి నరసింహ స్వామి ఆలయ ప్రారంభోత్సవం వైభవంగా జరిగింది. ఐదు రోజుల పాటు ధార్మిక క్రతువులు నిర్వహించనున్నారు. 


ఆలయం అంటే ఎన్నటికీ లయం కానిదని, అవి తరతరాలకు తరగని సంపదనిస్తూ జ్ఞానాన్ని అందిస్తూ మానవజాతికి జీవనాడిగా ఉంటున్నాయన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలం చౌడమ్మ కొండూర్‌లో శ్రీ రాజ్యలక్ష్మి సమేత శ్రీ లక్ష్మి నరసింహ స్వామి నూతన ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. కోటి కొత్త ఆలయాలు నిర్మించడం కన్నా ప్రాచీన ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం ధార్మికమైన కార్యమని శ్రీ రాజ్యలక్ష్మి సమేత నరసింహ స్వామి ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయడం పూర్వజన్మ సుకృతమన్నారు. 


కన్నుల పండువగా ధ్వజస్తంభం ప్రతిష్ఠాపన


ఆలయ ప్రతిష్ఠాపన సందర్భంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉపాసకులు వేదాల భార్గవ నరసింహస్వామి మార్గదర్శకంలో శిలామయ, లోహమయమూర్తి, ధ్వజస్తంభ, యంత్ర ప్రతిష్ఠాపన, మహా కుంభాభిషేకం వంటి అనేక మహాధార్మిక క్రతువులను నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం శ్రీ రాజ్యలక్ష్మీ సమేత లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్టాపనలో  భాగంగా ఆగమ శాస్త్ర ప్రకారం ధ్వజస్తంభ స్థాపన జరిగింది. శాస్త్రోక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో క్రతువులు నిర్వహిస్తున్నారు ప్రధానార్చకులు నరసింహ స్వామి బృందం. 


ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన ద్వారా స్వామివారికి ఆహ్వానం పలకడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. సకల దేవతలకు స్వామివారి వేడుకకు సాదరంగా ఆహ్వానించడం కోసం ఈ క్రతువులు నిర్వహిస్తారు. ధ్వజస్తంభానికి చందనాది లేపనములతో అభిషేకించి భక్త జనుల మధ్య అంగరంగ వైభవంగా స్థాపన కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో కవిత కుటుంబ సభ్యులతోపాటు జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలు పాల్గొన్నారు. 


సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో విష్ణు సహస్ర నామ పారాయణం కన్నుల పండువగా జరిగింది. శాస్త్రోక్తంగా పుణ్యాహవాచనం, విశ్వక్సేన ఆరాధన, రక్షాబంధనం దీక్షాధారణ అంకురార్పణ తదితర కార్యక్రమాలు భక్తజన రంజకంగా జరిగాయి. తీర్థ ప్రసాద గోష్టితో మొదటి రోజు కార్యక్రమాలు వేడుకగా ముగిశాయి. జూన్‌ 4 నుంచి 9వ తేదీ వరకు లోక కల్యాణార్థం, విశ్వశాంతి, ప్రజల ఆయురారోగ్య, ఐశ్వర్య సిద్ధి కోసం ఆరు రోజులపాటు విశిష్ట పూజలను నిర్వహించనున్నారు. 


చారిత్రాత్మకం..ఆధ్యాత్మికం..


నూతన ఆలయ ప్రారంభోత్సవ క్రతువులో తొలిరోజు దాదాపు 15 వేలకుపైగా భక్త జనం ప్రత్యక్షంగా తిలకించారు. అయితే ఆలయ నిర్మాణం వెనుక ఆసక్తికర చరిత్ర ఉన్నది. సీహెచ్‌ కొండూర్‌ ఒకప్పుడు గోదావరి నదికి ఆనుకొని ఉన్న కుగ్రామం. దశాబ్దాల క్రితమే శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ కారణంగా ముంపు బారిన పడింది. దీంతో వందల కుటుంబాలు అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల దూరం తరలివెళ్లి, సీహెచ్‌ కొండూర్‌ పేరుతోనే స్థిరపడ్డాయి. నాడు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలంతా కొంగుబంగారంగా కొలిచే శ్రీరాజ్యలక్ష్మి సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం సైతం ముంపుబారిన పడింది. దీంతో లక్ష్మీనరసింహుడి విగ్రహాలను సైతం తమ వెంటే నూతన గ్రామానికి తీసుకొచ్చారు. చిన్నపాటి గూడు ఏర్పాటు చేసి, ఐదున్నర దశాబ్దాలుగా పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.