Adilabad Tribal Man Padayatra: గ్రామ సమస్యలు తీర్చాలని, గ్రామానికి కనీస రోడ్డు సౌకర్యం కల్పించాలని కలెక్టర్ ముందు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు పెందూర్ ధర్ము అనే ఆదివాసి నాయకుడు. ఇది గత నెల 6న కుమ్రం భీం జిల్లా కలెక్టర్ వన మహోత్సవం కార్యక్రమానికి తిర్యాణి వెళ్ళినప్పుడు జరిగిన ఘటన. సమస్య తీరుస్తామని కలెక్టర్ చెప్పడంతో ధర్నా విరమించారు. కానీ సమస్య నేటికీ పరిష్కారం కాలేదని మరోసారి రోడ్డెక్కాడు ఆ నేత.
ఆగస్టు 15 యాత్ర ప్రారంభం
తిర్యాణి మండలంలోని మారుమూల గ్రామాల అభివృద్ధి కోసం ఎంతోమంది అధికారులను, ప్రజా ప్రతినిధులను కలిసి వేడుకున్నా చింత తీరడం లేదని విసుగు చెందారు పెందూర్ ధర్ము. ఇక నేరుగా సీఎంనే కలిసి సమస్యలు చెప్పాలని భావించి పోరు తలపెట్టారు. ఆగస్టు 15న గాంధీ వేషధారణ చేపట్టి తిర్యాణి నుంచి హైదరాబాద్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయానికి పాదయాత్రగా బయలుదేరాడు.
పెద్దపల్లి జిల్లాలో యాత్ర
ఆగస్టు 15 నాడు మొదలుపెట్టిన ధర్ము పాదయాత్రకు గ్రామస్తులు మద్దతు తెలిపారు. స్వాతంత్య్ర వేడుకల్లో పాల్గొని గ్రామంలోని దేవాలయాల్లో పూజలు నిర్వహించి కుమ్రం భీం విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రగా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆ పాదయాత్ర మంచిర్యాల జిల్లా దాటి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది.
శాంతియుత మార్గంలో నడిచేందుకు గాంధీ వేషధారణలో చేతిలో జాతీయ జెండా పట్టుకొని పాదయాత్ర చేస్తున్నారు. దారిపొడవునా ఆయనను ప్రజలు పలకరిస్తూ ఆదరిస్తూ సహాయం చేస్తున్నారు. లక్ష్యం నెరవేరాలని కోరుతున్నారు. రెండో రోజు ధర్ము పాదయాత్ర మంచిర్యాల జిల్లాలో కొనసాగింది. మూడవరోజు మంచిర్యాల నుంచి పెద్దపల్లి జిల్లాలోకి ప్రవేశించింది. తర్వాత కరీంనగర్ అనంతరం సిద్దిపేట మీదుగా వారం రోజుల్లో హైదరాబాద్‌కు చేరుకుంటారు.
ఏబీపీ దేశం పలకరిస్తే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పిన ధర్ము
ఏబీపీ దేశంతో మాట్లాడిన ధర్ము.. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని తిర్యాణి మండలం చాలా వెనుకబడి ఉందని, గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేక గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రోడ్డు మార్గాలు లేక గర్భిణీలు, బాలింతలు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్య్రం వచ్చి 78 ఏళ్లు గడిచినా తమ గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదన్నారు. ఇప్పటి వరకు ఎన్నో విధాలుగా ఉద్యమాలు చేశామన్నారు. ఎన్నోసార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ తిరిగినా పట్టించుకోలేదన్నారు. ఇక వేరే మార్గం లేక ముఖ్యమంత్రినే కలిసి సమస్యలు
సీఎంను గ్రామానికి ఆహ్వానిస్తానంటున్న ధర్ము
విన్నవించాలని నిర్ణయించుకున్నట్టు వివరించారు. తిర్యాణి నుంచి హైదారాబాద్‌కు పాదయాత్ర చేయాలనీ నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు.
హైదారాబాద్ చేరుకున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డిని కలిసి తిర్యాణి మండల సమస్యలు తెలియజేస్తానన్నారు ధర్ము. మారుమూలగ్రామాల్లో రహదారులు, వ్యవసాయ రైతుల బాగు కోసం ప్రాజెక్టు, ఇతర సమస్యలు సీఎంకి వివరిస్తామన్నారు. ఓసారి సీఎం సైతం తమ గ్రామానికి రావాలని ఆహ్వానించబోతున్నట్టు ధర్ము ఏబిపి దేశంతో అన్నారు.
Also Read: స్నేహితులనే సైన్యంగా చేసుకొని ఢిల్లీ సింహాసనాన్ని వణికించిన బెబ్బులి- తెలంగాణ శివాజీ గురించిన మీకు తెలుసా?