Telangana News | ఆసిఫాబాద్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మరో హాస్టల్ విద్యార్థిని మృతి చెంద. నెల రోజుల వ్యవధిలో జిల్లాలో ఇద్దరు ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినులు చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. స్థానిక ప్రైవేట్ డీఈడీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్న తొర్రం వెంకటలక్ష్మి (19) అనే విద్యార్థిని ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని బీసీ వసతి గృహంలో ఉంటోంది. అయితే ఆమె  అనారోగ్యంతో మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
వివరాలిలా ఉన్నాయి..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం అందుగులపల్లికి గ్రామానికి చెందిన తొర్రం వెంకటలక్ష్మి అసిఫాబాద్ లోని శ్రీనిధి కళాశాలలో డీఈడీ చదువుతోంది. స్థానిక బీసీ పోస్ట్ మెట్రిక్ వసతిగృహంలో అడ్మిషన్ తీసుకుంది. డీఈడీ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు ఉండటంతో వారం క్రితమే హాస్టల్ కు వచ్చింది. అక్కడి భోజనం నచ్చకపోవడంతో ఎక్కువగా బయటి నుంచి పండ్లు తెచ్చుకుంటుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తలనొప్పిగా ఉందని ఒక్కసారిగా కింద పడిపోయింది. సిబ్బంది 108 వాహనంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందింది. 
వారం కిందటే హాస్టల్‌కు వచ్చింది
అయితే వెంకటలక్ష్మి అనారోగ్యంతో ఉన్న విషయం తమకు తెలియజేయలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నా కూతురు వారం క్రితమే ఇక్కడికి వచ్చింది. సిబ్బంది మాకు ఏం చెప్పలేదు.. తెలిస్తే మా బిడ్డను కాపాడుకునేవాళ్లమని విద్యార్థిని వెంకటలక్ష్మి తల్లి రోదించిన తీరు అక్కడి వారిని కన్నీళ్లు పెట్టించింది. అయితే ఆ విద్యార్థిని మృతి చెందిన సమయంలో హాస్టల్ వార్డెన్ కూడా అందుబాటులో లేరు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినా.. సకాలంలో ఆసుపత్రికి తీసుకెళ్లినా విద్యార్ధిని ప్రాణాలు దక్కేవని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. 


విద్యార్థిని వెంకటలక్ష్మి గత కొద్ది రోజులుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండేది. శ్వాస సంబంధిత సమస్యతోనే ఆమె మృతి చెంది ఉండవచ్చని తోటి విద్యార్థులు సైతం భావిస్తున్నారు. అనారోగ్యంతోనే వెంకటలక్ష్మి మృతి చెందిందని జిల్లా బీసీ సంక్షేమశాఖ అధికారి సీజవన్ ఒక ప్రకటనలో తెలిపారు..
ఇటీవల విద్యార్థిని శైలజ మృతి
గత నెల నవంబర్ 25న వాంకిడి మండల కేంద్రంలోని గిరిజన బాలికల వసతిగృహంలో తొమ్మిదో తరగతి విద్యార్థిని చౌదరి శైలజ(14) అస్వస్థతకు గురై నిమ్స్ లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. తాజాగా వెంకటలక్ష్మి మృత్యువాత పడటంతో విద్యార్థి సంఘాల నేతలు మండి పడుతున్నారు. అటూ హాస్టల్లో ఉన్న విద్యార్థుల తల్లిదండ్రులు సైతం ఎప్పుడు ఏం జరుగుతుందో నంటూ భయపడిపోతున్నారు. 


Also Read: Acid Attack: హనీమూన్ చోటుపై వివాదం - కొత్త అల్లుడిపై యాసిడ్ పోసేసిన మామ, మహారాష్ట్రలో షాకింగ్ ఘటన 


ఉన్నత చదువుల కోసం, లేక అందుబాటులో విద్యా సంస్థలు లేవని సమీప ప్రాంతాలకు విద్యార్థులు వెళ్లడం సర్వసాధారణం. కానీ ఓ వైపు ప్రభుత్వ హాస్టల్స్‌ లో తరుచుగా ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు ఆస్పత్రి పాలవుతున్నారు. మరోవైపు ప్రైవేట్ హాస్టల్స్ లో ఉండి చదువుతున్నా తమ పిల్లల ప్రాణాలకు రక్షణ లేదని, ఏ క్షణంలో ఏ వార్త విన్నాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 



Also Read: Costly Weddings: పెళ్లైన తర్వాత హనీమూన్‌కు వెళ్తారా, ఇన్‌కమ్‌ టాక్స్‌ ఆఫీస్‌కు వెళ్తారా? నిర్ణయం మీ చేతుల్లోనే