నిజామాబాద్ జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో పెరిగిపోతున్న సీజేరియన్లపై జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి సీరియస్ గా తీసుకుంటున్నారు. ఇప్పటికే సిజేరియన్లను ప్రోత్సహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలకు ఆదేశించారు. సిజేరియన్లను అరికట్టేందుకు ఇప్పటికే నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో గర్భిణులకు అవగాహన కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. అయినా ప్రైవేట్ ఆస్పత్రులు మాత్రం సిజేరియన్లను ప్రోత్సహించటాన్ని తీవ్రంగా తప్పుప్టారు కలెక్టర్ నారాయణ రెడ్డి.
  

 

ప్రభుత్వ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు.. 

సుఖ ప్రసవాల కోసం ప్రభుత్వాసుపత్రుల్లో చేరిన గర్భిణీలు ఎవరైనా కాన్పు జరుగకముందే ప్రైవేట్ ఆసుపత్రులకు తరలివెళ్తే, ఈ తరహా ఘటనలపై అన్ని కోణాల్లో సమగ్ర విచారణ జరిపించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ప్రభుత్వ ఆసుపత్రుల సూపరింటెండెంట్లను ఆదేశించారు. వైద్యారోగ్య శాఖ పనితీరును కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా పలువురు ఏ.ఎన్.ఎంలు మాట్లాడుతూ, తాము గర్భిణీలను ప్రసవాల కోసం ఫ్రభుత్వ ఆసుపత్రిలో చేర్పిస్తే, వారికి సరిగా వైద్యసేవలందించని కారణంగా గర్భిణీలు అసంతృప్తితో కాన్పు జరగకముందే ప్రైవేట్ నర్సింగ్ హోమ్ లకు వెళ్తున్నారని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ, ప్రభుత్వాసుపత్రిలో చేరిన గర్భిణీలు అర్ధాంతరంగా ప్రైవేట్ హాస్పిటల్ కు వెళ్ళిపోతే అందుకు గల కారణాలను సమగ్ర విచారణ ద్వారా నిగ్గు తేల్చాలన్నారు.

ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. ఇందుకు బాధ్యులైన వైద్యులకు రూ. ఐదు వేల చొప్పున పెనాల్టీ వేయాలని సూపరింటెండెంట్లకు సూచించారు. స్టాఫ్ నర్సులు, ఇతర సిబ్బంది నిర్లక్ష్యం వెల్లడైతే వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. నిజామాబాద్, బోధన్, ఆర్మూర్ ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు సంతృప్తికరంగా వైద్యసేవలు అందాల్సిందేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా గర్భిణీల పట్ల ప్రత్యేక దృష్టిని కేంద్రీకరిస్తూ వారికి మరింత మెరుగైన సేవలందేలా చూడాలన్నారు. దీనివల్ల అనవసర సిజేరియన్ బారి నుండి వారిని కాపాడినట్లు అవుతుందని, ఫ్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజల్లోనూ నమ్మకం పెంపొందించిన వారవుతారని చెప్పారు.

 

ప్రభుత్వాస్పిత్రికి వస్తే అన్ని సదుపాయాలు కల్పించాలి 

ఫ్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెంచేందుకు క్షేత్ర స్థాయిలో ఆశ వర్కర్లు, ఏ ఎన్ ఎంలు, పీహెచ్ సి వైద్యులు, సిబ్బంది సమిష్టిగా కృషి చేయాలని హితవు పలికారు. అదే సమయంలో వారి ద్వారా ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల కోసం చేరిన గర్బిణీలకు సంతృప్తికరంగా సేవలందించే బాధ్యత గైనిక్ వైద్యాధికారులు, ఆసుపత్రికి చెందిన సిబ్బందిపై ఎంతైనా ఉందన్నారు. అన్ని సదుపాయాలు, నిపుణులైన వైద్యులు, సరిపడా సిబ్బంది అందుబాటులో ఉన్నందున ప్రైవేట్ కంటే మరింత మెరుగైన వైద్య సేవలందించేందుకు చొరవ చూపాలన్నారు. ఈ విషయమై పూర్తి పర్యవేక్షణ జరుపుతూ సంపూర్ణమైన అజమాయిషీ కలిగి ఉండాలని కలెక్టర్ సూపెరింటెండెంట్లకు సూచించారు. నిర్దేశిత లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించేందుకు కృషి చేయాలని అన్నారు. గర్భిణీలకు సంబంధించిన వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి హితవు పలికారు.

 

ప్రసవాల కోసం గర్భిణీలను ఆశాలు, ఏ.ఎన్.ఎంలు ఆసుపత్రికి తీసుకువచ్చినప్పుడు వారిని లేబర్ రూమ్ వద్దకు అనుమతించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో జూలై, ఆగస్టు నెలల్లో జరిగిన ప్రసవాలపై  ప్రత్యేక బృందాలచే సమగ్ర పరిశీలన జరిపిస్తున్నామని, ఈ సందర్భంగా ఎవరైనా అనవసర సిజీరియన్లు చేసినట్లు, ఇతరాత్ర తప్పిదాలకు పాల్పడినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు.