Telangana University : తెలంగాణ యూనివర్సిటీ ప్రారంభం నుంచి ఎప్పుడూ వివాదాల్లోనే ఉంటూ వస్తోంది. ఉన్నత విద్యను అందించి విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన విశ్వవిద్యాలయం వివాదాలకు నిలయంగా మారింది. వర్సిటీలో సిబ్బంది వర్గాలుగా చీలి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వచ్చారు. అక్రమ నియామకాలు, వర్సిటీలో సమస్యలు పట్టించుకోక పోవటం, నిత్యం రిజిస్ట్రార్ల మార్పులు అనేక సమస్యలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
అధికారుల మధ్య సమన్వయం లోపించి ఏడాదిన్నర కాలంగా సమావేశాలు లేక వర్సిటీలో ఏం జరిగిందో తెలియని పరిస్థితి. వారం కింద జరిగిన భేటీలో అనూహ్య నిర్ణయాలతో అందరిని ఆశ్చర్య పరిచింది పాలక మండలి. తాజాగా మరోమారు జరిపిన సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. వీసీపైనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరాలని తీర్మానించడం, ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ గా ఉన్న ప్రొఫెసర్ విద్యా వర్ధినిని సస్పెండ్ చేశారు. వీసీపై ఏసీబీ విచారించాలని నిర్ణయించడం సంచలన నిర్ణయమే. అకడమిక్ కన్సల్టెంట్ విధుల్లో నుంచి తొలగింపు నిర్ణయంతో పాటు వారం రోజుల్లోనే పదోన్నతుల రద్దు, అడ్వాన్సులు తీసుకున్న వారికి రికవరీ నోటీసుల జారీ వంటి నిర్ణయాలు జరిగిపోయాయి.
2022-23 ఆర్థిక సంవత్సరం ముగిసినా ఇంకా బడ్జెట్ ఆమోదం పొందలేదు. రెండు సమావేశాల్లో దీనిపై చర్చించినా చేసిన ఖర్చులకు సరైన లెక్కలు లేవని అధికారులు సమాధానం ఇచ్చారు. గడిచిన 8 నెలల కాలంలో వివిధ కార్యక్రమాల పేరిట పెద్ద మొత్తంలో వ్యయాలు చేసినట్లు వివరించారు. ఎక్కువ మొత్తం నోట్ ఫైల్ లేకుండా డబ్బులు డ్రా చేయటం జరిగిందని చెప్పారు. వీటిని ఏ ప్రాతిపదికన చేశారు? ఇప్పుడెలా లెక్క చూపాలి? అన్నది తేలాల్సి ఉందన్నారు. చెల్లింపుల విషయంలో నిబంధనలు పాటించలేదని వివరించారు. దీంతో మళ్లీ బడ్జెట్ పక్కకు పెట్టారు. దీనికి ఆమోదం లభిస్తేనే.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 పద్దు ప్రతిపాదనల ఆమోదంపై ముందుకెళ్లాల్సి ఉంటుంది. దీంతో రెండు బడ్జెట్లపై పీటముడి వీడలేదు. సమస్యను అధిగమించేందుకు నిధుల దుర్వినియోగం అంశంపై విచారణ పూర్తిచేయాలని నిర్ణయించింది.
నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఖర్చులపై విచారించేందుకు ఐదుగురి సభ్యుల కమిటీ వర్సిటీకి రానుంది. బడ్జెట్ ఆమోదం లేకుండా ఎంత ఆర్థిక వ్యయాలు చేశారు? అందులో నోట్ ఫైల్ లేకుండా ఎన్ని ఉన్నాయి? వాటిని ఎందుకు చేశారో? పరిశీలించనున్నారు. ఆర్థిక శాఖ డిప్యూటీ కార్యదర్శి చంద్రకళ నేతృత్వంలో కమిటీ ఆయా అంశాలు పరిశీలించనుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఫైళ్ల ఆధారంగా సిద్ధం చేయాలని ఇప్పటికే రిజిస్ట్రార్ కు సూచించింది. సిబ్బంది ద్వారా కొంత సమాచారం సిద్ధం చేసినట్లు సమాచారం. వీటిల్లో కీలకంగా ఉత్తర్వులు లేకుండా జరిపిన చెల్లింపులు, వర్సిటీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలకు చేసిన ఖర్చులున్నాయి. వీటిపై వివరాలు సేకరించి చెక్కులు తయారు చేయటానికి ఉన్న నిబంధనలు పాటించారా? ఆ చెక్కును అనుమతిస్తూ సంతకాలు చేసేప్పుడు సరి చూశారా? అనే విషయాలు కీలకం కానున్నాయి. పాలక మండలిలో వీసీకి మిగతా సభ్యులకు పోసగకపోవటం... ఇష్టారీతిలో జరిగిన అక్రమ నియామకాల బాగోతం వర్సిటీ పరువు దిగజారుతోంది. వర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి వాటిని ఇకనైనా సమస్యల పరిష్కారం పై దృష్టి సారించాలని విద్యార్థులు కోరుతున్నారు.