తెలంగాణ యూనివర్సిటీ ఆధ్వ ర్యంలో నేటి నుంచి మూడు రోజులపాటు జరిగే ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి సైంటిస్టులు మొదటి రోజు సదస్సులో పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణలకు ఈ సదస్సు వేదికకానున్నట్లు తెలిపారు వీసీ రవీందర్ గుప్తా. ఈ సదస్సును విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు వీసి. 


తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు తర్వాత మొట్టమొదటిసారిగా ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. దీనిపై విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ సదస్సును తెలంగాణ యూనివర్సిటీలోనే నిర్వహించాలి. కానీ ఓ ప్రైవేట్ హోటల్‌లో నిర్వహిస్తుండటాన్ని తప్పుబడుతున్నారు. విద్యార్ధులు, వర్సిటీ వర్గాల్లో ఆందోళన నెలకొంది.


కరోనాతో వేదిక మార్చామంటున్న యూనివర్శిటీ అధికారులు


కాన్ఫ రెన్స్‌లో పాల్గొనేందుకు ఇప్పటికే అమెరికా నుంచి 9 మంది, సౌత్ ఆఫ్రికా నుంచి ఒకరు నిజామాబాద్‌కు చేరుకున్నారు. ఇంకా మరి కొందరు హాజరయ్యే అవకాశం ఉంది. పెద్ద సంఖ్యలో దేశ, విదేశీ ప్రతినిధులు హాజరువుతున్నారు. కరోనా సాకు చెప్పి వర్సిటీ క్యాంపస్‌లో కాకుండా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ హోటల్లో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయటాన్ని విద్యార్థులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. అయితే యూనివర్సిటీలో కొంత మంది విద్యార్థులు కరోనా సోకటం వల్ల యూనివర్సిటీలో కాకుండా హోటల్‌లో ఏర్పాటు చేశామని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. కరోనాతో క్యాంపస్ విద్యార్థులు ఆస్పత్రిలో, క్యాంపస్ క్వారంటైన్‌లో ఉండడంతో వెంటనే కాన్ఫరెన్స్‌ను వాయిదా వేయాల్సి ఉండగా వీసీ పట్టుదలకుపోయి కాన్ఫరెన్స్ ను జరిపించి తీరాలని చూడడం సమంజసం కాదని పలువురు విమర్శిస్తున్నారు. ఒకవేళ విదేశీ ప్రతినిధులు కరోనా బారిన పడితే ఈ విషయం జాతీయస్థాయి సమస్యగా మారే అవకాశం ఉంటుందని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి. 


తాము వెళ్తే కరోనా సోకదా అంటున్న విద్యార్థులు


తెలంగాణ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఆఫ్ సైన్స్- అల్ట్రాసోనిక్ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో 'అల్ట్రాసో నిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ అడ్వాన్స్డ్ టె క్నాలజీ'(ICUMSAT-2022) అనే అంశంపై జరుగుతున్న కాన్ఫరెన్స్‌కు సోషల్, ఆర్ట్స్, కామ ర్స్, మేనేజ్మెంట్ విభాగాలకు చెందిన అధ్యాపకులు, విద్యార్థులు తప్పని సరిగా ఈ సదస్సుకు హాజరుకావాలని వర్సిటీ అధికారులు సూచించారు. మరోవైపు 1, 2, 3 వ తేదీల్లో సైన్స్‌సహా పలు విభాగాలు ఇంటర్నల్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్నారు విద్యార్థులు. ఈ పరిస్థితుల్లో సదస్సుపై విద్యార్థుల్లో ఒకింత వ్యతిరేకత నెలకొంది. క్యాంపస్‌లో కరోనా వచ్చిందనే సాకుతో కాన్ఫరెన్స్ వేదికను ఒక ప్రైవేట్ హోటల్లోకి మార్చి నట్లు చెప్పుకుంటున్న ఉన్నతాధికారులు ఇక్కడ నుంచి విద్యార్థులను కాన్ఫరెన్స్‌కు తరలిస్తే కరోనా వ్యాపించదా అని భయాందోళనలకు గురవుతున్నారు.


నిధులు పక్కదారి పట్టించేందుకే ప్రైవేటు హోటల్‌లో సమావేశాలు!


తొలి రోజు సదస్సు ప్రారంభమవుతున్న సమయంలో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘం నాయకులు సదస్సు జరుగుతున్న హోటల్‌కి వెళ్లి ఆందోళన చేశారు. తెలంగాణ యూనివర్సిటీలో నిర్వహించకుండా ప్రైవేట్ హోటల్‌లో ఎలా నిర్వహిస్తారంటూ విద్యార్థి నాయకులను ప్రశ్నించారు. అక్కడున్న పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టు చేశారు. యూనివర్సిటీలో కాన్ఫరెన్స్ హాల్ ఉన్నప్పటికీ వీసీ అక్కడ సదస్సును నిర్వహించకపోవటం సరికాదంటున్నారు విద్యార్థులు. యూనివర్సిటీలో నిర్వహించినట్లైతే ఇటు విద్యార్థులందరికీ ఉపయోగపడుతుందన్నారు. విదేశీ ప్రతినిధులు కూడా యూనివర్సిటీ ప్రాంగణంలో ఉండేవారని విద్యార్థులు అభిప్రాయం. ఈ సదస్సుకు వచ్చే నిధులను పక్కదారి పట్టించేందుకు వర్సిటీ యాజమాన్యం ఇలా చేస్తోందంటున్నాయ్ విద్యార్థి సంఘాలు. ఓ వైపు కరోనాతో విద్యార్థులు యూనివర్సిటీలో బాధపడుతుంటే వారికి కనీస సౌకర్యాలు కల్పించకుండా... ఇలా సదస్సులు నిర్వహించటం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు తెలంగాణ యూనివర్సిటీ విద్యార్థులు.