చదువుల తల్లి ఒడిలో ఏర్పాటైన బాసర ట్రిపుల్ ఐటీ ప్రస్తుతం వివాదాలకు నిలయంగా మారింది. విద్యార్థులు సరైన వసతులు లేక నిత్యం నిరసనల బాట పడుతున్నారు. కనీస మౌలిక వసతుల కోసం పోరాటం చేస్తున్నారు. జులైలో ఏడు రోజుల పాటు శాంతి యుత నిరసన కార్యక్రమాలు చేపట్టారు. విద్యార్థుల ఆందోళనలకు విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల మద్దతు లభించింది. దీంతో ప్రభుత్వం దిగివచ్చింది. 


డిమాండ్లు ఒప్పుకున్న ప్రభుత్వం


మంత్రి సబితా ఇంద్రారెడ్డి ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో స్వయంగా మాట్లాడి సర్ది చెప్పారు. విద్యార్థులు పెట్టిన 12 డిమాండ్లను ఒప్పుకున్నారు. కానీ రోజులు గడుస్తున్నా తమ సమస్యలు మాత్రం పరిష్కారం కావడం లేదని విద్యార్థులు మరోసారి ఆందోళన బాట పట్టారు. 


మౌలిక సదుపాయలు సున్న


నిరసనలు విరమించిన కొద్ది రోజులకే ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్‌తో 300 మందికిపైగా అనారోగ్యానికి గురయ్యారు. మొన్నటికి మొన్న ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థి చనిపోయాడని వివిధ రాజకీయ పార్టీలు సైతం ఆందోళనలు చేశాయి. అయినా ట్రిపుల్ ఐటీలో ఎలాంటి మార్పు రావటం లేదన్నది ప్రధాన ఆరోపణ. నిత్యం మెస్‌లో సరైన భోజనం లేక విద్యార్థులు ఆందోళనకు దిగుతున్నారు. రెండ్రోజుల క్రితం కూడా ఇదే పరిస్థితి నెలకొంది. 


ప్రశ్నిస్తే షోకాజ్ నోటీసులు


ఇన్ని జరుగుతున్నా సరే విద్యార్థుల సమస్యలను ట్రిపుల్ ఐటీ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. అందుకే విద్యార్థులు మరో ఉద్యమానికి సిద్ధమయ్యారు. దీంతో రంగ ప్రవేశం చేసిన అధికారులు విద్యార్థుల నిరసనలు అణచివేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆందోళన చేసే విద్యార్థులు, చదువుకునే విద్యార్థులను అడ్డుకుంటే షోకాజ్ నోటీసులు అందిస్తామన్నారు. షోకాజ్ నోటీసుల తర్వాత విద్యార్థుల తీరు మారకుంటే మాత్రం బర్తరఫ్ చేసే ఆలోచనలో ఉన్నారు ట్రిపుల్ ఐటీ అధికారులు. 


తల్లిదండ్రులు ఆందోళనల


అధికారుల తీరు ఇలా ఉంటే... బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన తీవ్రమవుతోంది. దీనిపై చర్చించేందుకు విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ హైదరాబాద్‌లో భేటీ అయింది. ఎల్బీనగర్‌లోని ఓ కమిటీ హాల్‌లో తల్లిదండ్రులు సమావేశమయ్యారు. చలో బాసరకు పిలుపునిచ్చే యోచనలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటికి ర్యాలీగా వెళ్లాలని తల్లిదండ్రుల కమిటీ నిర్ణయం తీసుకుంది. సబిత ఇంటి ముందు మౌనదీక్ష చేస్తామని పేరెంట్స్ కమిటీ వెల్లడించింది. 


విద్యార్థుల తల్లిదండ్రులు కూడా తమ పిల్లల భవిష్యత్‌పై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న బాగోతంపై పేరెంట్స్ ఆందోళన చేశారు. అయినా ప్రభుత్వంలో చలనం రావటం లేదని వారు వాపోతున్నారు. అందుకే తల్లిదండ్రులు తమ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామంటున్నారు.