Cheddi Gang: నిజామాబాద్ నగరంలో చెడ్డీ గ్యాంగ్ మళ్లీ హల్ చల్ చేసింది. కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న ఈ గ్యాంగ్.. మళ్లీ ప్రత్యక్షం కావడంతో నగర ప్రజలకు భయాందోళనకు గురవుతున్నారు. గతంలో కత్తులతో కలకలం రేపిన వీళ్లు.. పట్టణఁలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడ్డారు. తాజాగా శనివారం రాత్రి కంటేశ్వర్, హోసింగ్ బోర్డ్ తదితర ప్రాంతాల్లో చడ్డీ గ్యాంగ్ సంచరిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయిన దృశ్యాల్లో చెడ్డీ గ్యాంగ్ కు సంబంధించిన దుండగుడు కనిపించాడు. మళ్ళీ చడ్డీ గ్యాంగ్ నగరంలో తిరుగుతుండటంతో నగర వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.


గతంలోనూ చెడ్డీ దొంగల బీభత్సం..


అర్ధరాత్రి వేళ చేతిలో రాడ్లు, ఒంటిపై నిక్కర్లు, ముఖాలకు ముసుగులు ధరించిన ఓ ముథా.. నగర శివార్లలో సంచరించినన దృశ్యాలు చూసిన బాధితులతో పాటు స్థనికులు గజగజా వణికిపోతున్నారు. సమిసిపోయిందనుకున్న చెడ్డీ గ్యాంగ్ సమస్య మల్లీ మొదలైందని కలవర పడుతున్నారు. గతంలో కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. ముబారక్ నగర్ లో ఓ ఇంట్లో చొరబడేందుకు యత్నించింది. ఓ ఇంటి తలుపులు తీయాలంటూ కేటుగాళ్లు బెదిరింపులకు పాల్పడి.. రెండు గంటలకు పైగా బీభత్సం సృష్టించారు. ఇంట్లోని వారందరినీ భయభ్రాంతులకు గురి చేశారు. ఇంటి తలుపులు, కిటీకి అద్దాలు ధ్వంసం చేశారు. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఓ వ్యక్తికి గాయాలు అయ్యాయి. మరో ఇంట్లో భార్యాభర్తలను బెదిరించి మంచానికి కట్టేసి పుస్తెల తాడు ఎత్తుకెళ్లారు. 


చెడ్డీ దొంగల ప్రత్యేకతేంటి..?


శివారు ప్రాంతాల్లో చోరీలు చేయడంలో చెడ్డీ గ్యాంగ్ దొంగలు సిద్ధహస్తులు. ఆరేడ ముంది దాకా కలిసి వచ్చి ఎంచుకున్న ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్లను భయభ్రాంతులకు గురి చేసి ఆభరణాలు, నగదును దోచుకెళ్తారు. మాట వినకపోతే భౌతిక దాడులకు కూడా వెనకాడరు. చోరీ చేస్తున్నప్పుడు చెడ్డీలు వేస్కొని.. చెప్పులు భుజాన వేస్కొని, ఒంటిపై నూనె పూసుకొని. చేతిలో రాడ్లు, ఇతర మారణాయుధాలు పట్టుకోవడం చెడ్డీ గ్యాంగ్ ప్రత్యేకత. చోరీ చేసి పారిపోయే సమయంలో ఎవరైనా వెంబడించడానికి ప్రయత్నిస్తే రాళ్లు రువ్వడం, మారణాయుధాలతో దాడులు చేయడానికి చెడ్డీ గ్యాంగ్ దొంగలు వెనుకాడరు. 


అసలీ చెడ్డీ దొంగలు ఎక్కడి నుంచి వస్తున్నారు..?


గుజరాత్ లోని దాహోడ్ జిల్లాలోని ఆదివాసి తెగకు చెందిన కొంత మంది ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వర్షాకాలం సీజన్ లో వ్యవసాయ పనులు చేసుకొని మిగతా సమయాల్లో చోరీలకు పాల్పడుతుంటారు. చెడ్డీ గ్యాంగ్ లో నాయకులతో పాటు దొంగలను అరెస్ట్ చేయడం వల్ల కొన్ని నెలలుగా వాళ్ల అలికిడి లేకుండా పోయింది. మరోసారి చెడ్డీ గ్యాంగ్ తరహాలోనే చోరీలు జరగడం పోలీసులు ప్రధానంగా దృష్టి సారించి దొంగలను పట్టుకునే పనిలో ఉన్నారు.