Viral News:
1995లో ఇదే అకాడమీలో..
కుటుంబంలో ఒకరు ఆర్మీలోకి వెళ్తే, మిగతా వాళ్లు కూడా సైన్యంలో చేరేందుకు ఎంతో కొంత ఆసక్తి చూపిస్తారు. ఆ డ్యూటీలో ఉన్న ఎమోషన్ అలాంటిది. విధులు నిర్వర్తిస్తూనే తండ్రి చనిపోయినా...తానూ ఆర్మీలో చేరాలని ఆరాటపడే కొడుకులు ఎంతో మంది ఉన్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోబోయేది ఓ తల్లి, కొడుకుల కథ. 27 ఏళ్ల క్రితం ఆర్మీ ట్రైనింగ్ అకాడమీలో పాస్ అయ్యి సైన్యంలో ఓ మహిళ పని చేయగా, ఇప్పుడామె కొడుకు కూడా అదే ట్రైనింగ్ అకాడమీలో ఉత్తీర్ణత సాధించాడు. అంటే తల్లి బాటలోనూ కొడుకూ నడిచాడన్నమాట. ఆర్మీలో ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతుంటాయి. అందుకే చెన్నై డిఫెన్స్ పీఆర్‌వో ఈ విషయాన్ని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. అలా పోస్ట్ పెట్టారో లేదో, వెంటనే కామెంట్ల వర్షం కురిసింది. రిటైర్డ్ మేజర్ స్మిత చతుర్వేది ఆ అకాడమీలో తన కొడుకుతో కలిసి ఫోటో దిగారు. ఈ ఫోటోను జత చేసి..."ఇలాంటివి జరగటం చాలా అరుదు. 27 ఏళ్లక్రితం 1995లో చెన్నైలోని ట్రైనింగ్ అకాడమీలో పాస్ అయ్యారు రిటైర్డ్ మేజర్ స్మిత చతుర్వేది. ఇప్పుడు ఇదే ట్రైనింగ్ అకాడమీలో వాళ్ల అబ్బాయి కూడా ఉత్తీర్ణత సాధించాడు" అని ట్వీట్ చేశారు. ఆ తరవాత 1995లో చతుర్వేది పాస్ అయినప్పుడు దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశారు చెన్నై డిఫెన్స్ పీఆర్‌వో. ఈ అరుదైన ఘనతపై స్మిత చతుర్వేది ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లలో అకాడమీలో జరిగిన మార్పులను వివరించారు. అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు ట్విటర్‌లో వైరల్ అవుతోంది. చాలా మంది "సూపర్" అంటూ కామెంట్ చేస్తున్నారు.