Prostitution in Tirupati: పరమ పవిత్ర క్షేత్రమైన తిరుపతి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది శ్రీ వేంకటేశ్వర స్వామి వారు కొలువైయున్న తిరుమల పుణ్యక్షేత్రం. శ్రీవారి పాదాల చెంత ఉన్న తిరుపతికి ప్రతి నిత్యం లక్షల‌ సంఖ్యలో భక్తులు దేశ విదేశాల నుంచి వస్తుంటారు. బతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తూ జీవనం సాగించేవాళ్లు కొందరైతే... తమ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం యూనివర్సిటీలో చదివించే వాళ్ళు మరి‌కొందరు. ఇలా ఉద్యోగస్తులతో, వ్యాపారస్తులతో, స్కూల్, కాలేజీ స్టూడెంట్స్ తో బిజీ బిజీగా ఉండే తిరుపతి ఇప్పుడు ఇప్పడు వ్యభిచారం కూపంగా మారుతోంది.


అమ్మవారి ఆలయ సమీపంలోనే... 
ఇక్కడికి వచ్చే భక్తులు, వ్యాపారం కోసం వచ్చే వాళ్ళనే టార్గెట్ గా చేసుకుని వ్యభిచారం సాగిస్తున్నారు కొందరు వ్యక్తులు. పుణ్యక్షేత్రం అనే కనీస జ్ఞానం లేకుండా వ్యభిచార గృహాలను నడుపుతున్నారు. అమ్మాయిలను సప్లై చేస్తూ... అమాయకులను మోసం చేసి, ఈ ఊబిలోకి మరీ సొమ్మ చేసుకుంటున్నారు. సాక్షాత్తు శ్రీనివాసుడి అర్ధాంగి అయిన పద్మావతి అమ్మవారు కొలువైయున్న తిరుచానూరులో వ్యభిచార కూపం వెలుగు చూడడంతో భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. ఆధ్యాత్మికతకు ఇలాకా అయిన పద్మావతి అమ్మవారి సన్నిధికి సమీపంలో ఇలాంటి పనులు చేస్తున్నారా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..


తిరుచానూరుకి అతి సమీపంలోని పద్మావతి పురంలో ఓ ప్రైవేట్ లాడ్జిలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ప్రైవేటు లాడ్జ్  ఓనర్ వెంకట సుబ్బా రెడ్డిని, క్యాషియర్ విజయ్ తో పాటు మరో ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ముందస్తుగానే పోలీసుల రాకను గుర్తించిన దీని నిర్వాహకుడు ఎల్లారెడ్డి అక్కడి నుంచి మాయమయ్యాడు. ఈ ఏడాది మార్చి నెలలో తన ఇంట్లోనే వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు ఎల్లారెడ్డిని పోలీసులు గుర్తించారు. అప్పట్లో దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. తాజాగా మరోసారి ఎల్లారెడ్డి ఇలాంటి నీచ పనులు చేయిస్తున్నాడనే సమాచారంతో పోలీసులు లాడ్జీలో మెరుపు దాడి చేశారు.


ఎల్లారెడ్డి కోసం గాలింపు చర్యలు..


అదుపులోకి తీసుకున్న వారిలో బెంగళూరు, భద్రాచలానికి చెందిన మహిళలున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల దాడుల్లో పట్టుబడిన లాడ్జ్ నిర్వాహకుడు వెంకట సుబ్బారెడ్డి, క్యాషియర్ విజయ్, ఎల్లారెడ్డిలతో పాటుగా ఐదుగురు యువతులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు సాగిస్తున్నారు.. పరారీలో ఉన్న ఎల్లారెడ్డి కోసం పోలీసులు గాలిస్తున్నారు. త్వరలోనే అతడిని కూడా అదుపులోకి తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. అలాగే పరమ పవిత్ర పుణ్యక్షేత్రం అయిన తిరుమలలో అలాంటివి జరగకుండా చూసుకుంటామని అన్నారు. 


విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు, భక్తులు తీవ్ర ఆగ్రహానికి గురవుతున్నారు. స్వామి వారి చెంత ఇలాంటి చేయడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకెప్పుడు అక్కడ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని పోలీసులు, అధికారులను కోరుతున్నారు. తిరుమలకు వచ్చే భక్తులకు.. అమ్మాయిలను ఆశగా చూపి వ్యభిచారం చేయడం మహా పాపమని అంటున్నారు. భక్తి, ముక్తి కోసం వచ్చే వాళ్లను వ్యభిచారం దిశగా ప్రోత్సహించడం అస్సలు మంచిది కాదంటూ చెబుతున్నారు.