మొదట్లో తెలంగాణ యూనివర్సిటీ ఇక్కడి విద్యార్థులకు ఓ వరం అనుకున్నారు. కానీ నిత్యం వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. ఓ వైపు యూనివర్సిటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం గత మూడు రోజులుగా యూనివర్సిటీ ప్రధాన గేటు ఎదుట బైఠాయించి తమ నిరసనలు తెలుపుతున్నారు. యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్న వీసీ ఏ మాత్రం పట్టించుకోవటం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైఫై సౌకర్యం కూడా లేని దుస్థితి నెలకొందని... యూనివర్సిటీలో కనీస వసతులు కరవయ్యాయని స్టూడెంట్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవేవీ పట్టించుకోకుండా వీసీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
ఏడాది కాలంలో నలుగురు రిజిస్ట్రార్ల మార్పు
తెలంగాణ యూనివర్సిటీ వీసీ ఇష్టారాజ్యాంగా వ్యవహరిస్తున్నారనటానికి ఏడాది కాలంలో నలుగురు రిజిస్ట్రార్లను మార్చటమే ఇందుకు ఉదాహరణ అని చెబుతున్నాయ్ విద్యార్థి సంఘాలు. ప్రస్తుత రిజిస్ట్రార్ ఆచార్య శివశంకర్ స్థానంలో టెంపరరీగా ప్రొఫెసర్ విద్యావర్ధిణిని అపాయింట్ చేస్తూ... వీసీ ఉత్తర్వులు ఇచ్చారు. ప్రొఫెసర్ రవీందర్ గతేడాది మేలో వీసీగా తెలంగాణ యూనివర్సిటీలో ఛార్జ్ తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన నలుగురు రిజిస్ట్రార్లను మార్చారు. యూనివర్సిటీ ప్రారంభమైన నాటి నుంచి ముగ్గురు రెగ్యులర్ వీసీలు పనిచేసినా.... ఇంత మందిని ఎప్పుడు మార్చలేదు. ప్రస్తుతం వీసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వాస్తవానికి తనకు నచ్చిన వారిని రిజిస్ట్రార్‌గా అపాయింట్ చేసుకునే రైట్స్ వీసీకి ఉంటాయ్. కానీ, స్వల్ప కాలంలోనే నలుగురిని మార్చడం వెనుక కారణాలు ఏమిటనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తరచూ రిజిస్ట్రార్లను మార్చటం వల్ల తెలంగాణ యూనివర్సిటీకి బ్యాడ్ నేమ్ వస్తోందని విద్యార్థి నాయకులు అంటున్నారు.
2021 మేలో వీసీ రవీందర్ బాధ్యతలు తీసుకున్న సందర్భంలో నసీం రిజిస్ట్రార్‌గా ఉన్నారు. సెప్టెంబరు 13 ఆమెను తప్పించారు. ప్రొఫెసర్ కనకయ్యను నియమిస్తూ... ఉత్తర్వులిచ్చారు. గతేడాది అక్టోబరు 30న జరిగిన పాలకమండలి సమావేశంలో ఆయన నియామకం తిరస్కరణకు గురైంది. వెంటనే ఆచార్య యాదగిరికి బాధ్యతలు ఇచ్చారు. 40 రోజులకే ఆయణ్ని తప్పించి.. డిసెంబరు 9న శివశంకర్ ను అపాయింట్ చేశారు. పాలకమండలి సమావేశంలో కాలేజీ విద్య కమిషనర్ నవీన్ మిట్లల్... ప్రొఫెసర్ యాదగిరిని స్వయంగా నియమించారు. అయన నియామకాన్ని కాదని శివశంకర్ ను వీసీ తీసుకొచ్చారు. దీంతో వీరిద్దరి మధ్య సయోధ్య ఉంటుందని అంతా భావించారు. కానీ, పలు అంశాల్లో వీసీకి, రిజిస్ట్రార్‌కు మధ్య పొసగట్లేదని సమాచారం. అయితే శివశంకర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఈసీ మీటింగ్ జరగలేదు. ఇంతలోనే విద్యావర్ధిణికి బాధ్యతలు అప్పగించారు.
రిజిస్ట్రార్ శివశంకర్ వ్యక్తిగత పనుల్లో భాగంగా సెలవుల్లో ఉన్నారు. ఈలోగానే ఆయన్ని మార్చటంపై విమర్శలు వస్తున్నాయ్. టెంపరెరీగా రిజిస్ట్రార్‌ను ఎవరినైనా నియమించుకొనే అధికారం వీసీకి ఉన్నప్పటికీ.. దాన్ని ఈసీ మీటింగ్ పెట్టి సభ్యుల ఆమోదం పొందితే ఏడాది కాలం పొడిగించుకునే వీలుంటుంది. శివశంకర్ సెలవులు ముగించుకుని రాగానే విద్యావర్ధిణి నుంచి బాధ్యతలు తీసుకునే అవకాశం ఉండొచ్చని తెలుస్తోంది. మరోవైపు విద్యార్థుల సమస్యలు పరిష్కరించటంలో వీసీ ఏ మాత్రం స్పందించటం లేదని విద్యార్థులు మండిపడుతున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు నిరసనలు కొనసాగిస్తామని చెబుతున్నారు స్టూడెంట్స్.