Mobile Hospital: మొబైల్ టాయిలెట్స్, మొబైల్ క్యాంటీన్, మొబైల్ గ్రంథాలయాలు.. ఇలా మనం చాలానే చూశాం. కానీ మొబైల్ ఆస్పత్రిని మాత్రం ఇప్పటి వరకు చూడలేదు. కానీ ఇక ముందు చూడబోతున్నాం. తెలంగాణలోని గిరిజన ప్రాంతాల ప్రజల కోసం హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎర్పాటు చేసిందీ మొబైల్ ఆస్పత్రి. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటి మొబైల్ ఆస్పత్రి కూడా ఇదే. ఇందులో 120 రకాల వైద్య పరీక్షలతో పాటు 80 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోనే మొదటి సారిగా ఈ మొబైల్ ఆస్పత్రి వైద్య సేవలను ఆదిలాబాద్ జిల్లాలోని ఏజెన్సీ గ్రామాల్లో ప్రారంభించారు.


120 రకాల పరీక్షలతో పాటు 80 రకాల మందులు..


ఆదిలాబాద్ జిల్లా ఏజెన్సీలోని మారుమూల గ్రామాల ఆదివాసీలకు మెరుగైన వైద్యం అందించేందుకు  జిల్లా ఎస్పీ డి.ఉదయ కుమార్ రెడ్డి నేతృత్వంలో అఫిరొన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకు సంబంధించిన హాస్పిటల్ ఆన్ వీల్స్ "స్వస్తీయ రత్" ద్వారా మొబైల్ ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొచ్చారు. నార్నూర్‌ మండలంలోని ఖైర్ దాట్వా గ్రామంలో సుమారు 500 మంది ఆదివాసీ గిరిజనులకు వైద్య సేవలు అందించారు. ఈ మొబైల్ ఆస్పత్రిలో 120 రకాల పరీక్షలు, 80 రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. 


డప్పు, వాయిద్యాల మధ్య ఘనస్వాగతం..


మారుమూల ఆదివాసీ, గిరిజన ప్రజలకు వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో జిల్లా పోలీసు యంత్రాంగం నార్నూరు మండలం ఖైర్ దాట్వ గ్రామంలో అఫిరొన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మరియు జిల్లా వైద్యశాఖ సహకారంతో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డికి గ్రామస్థులు ఆదివాసీ సాంప్రదాయాలతో డప్పు వాయిద్యాల మద్య స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న కుమురం భీం విగ్రహనికి ఎస్పీతో పాటు స్థానిక ఎంపీపీ పూల మాలలు వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం మొబైల్ మెగా వైద్య శిబిరాన్ని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. 


మరో మూడ్రోజుల పాటు ఈ సేవలు అందుబాటులో..


మొబైల్ ఆస్పత్రిలో నిష్ణాతులైన వైద్య సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉన్నారని.. ఈ సేవలను గిరిజనులంతా ఉపయోగించుకోవాలని ఎస్పీ తెలిపారు. సీజనల్ జ్వరాలతో బాధపడే వారు ఈ వైద్య శిబిరానికి వచ్చి వైద్యులకు చూపించుకోవాలని చెబుతున్నారు. ఈ మొబైల్ ఆస్పత్రి ద్వారా మొబైల్ ట్రామా కేర్, మొబైల్ X-ray, వెంటిలేటర్, మొబైల్ అల్ట్రా సౌండ్, డయాగ్నస్టిక్స్, స్క్రీనింగ్, ప్రొసీజర్, డయాలసిస్, ఫార్మసీ, వాక్సినేషన్, టెలి మెడిసిన్ మల్టీ స్పెషాలిటీ కన్సల్టేషన్ లాంటి సేవలను అందించబోతునట్లు ఆయన వివరించారు. మరో మూడురోజుల పాటు ఉట్నూర్ మండలం దొంగచింత, ఇంద్రవెల్లి మండలంలోని వాల్గొండ గ్రామాల్లో ఆదివాసీ గిరిజనులకు వైద్య సేవలను అందించనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు సహకరించిన వైద్య బృందానికి.. జిల్లా పోలీస్ యంత్రాంగం తరపున ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.