టిఎస్ ఆర్టీసీలో మరిన్ని సంస్కరణలు చేపట్టనున్నట్లు తెలిపారు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ సహాయంతో 2022- 2023 ఆర్థిక సంవత్సరంలో అన్ని డిపోలను లాభాల బాటల్లోకి తీసుకొచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు. ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఏడాదిలో చేపట్టిన సంస్కరణలతోపాటు భవిష్యత్‌లో అమలు చేయబోతున్న నిర్ణయాలు వెల్లడించారు.
రాష్ట్రంలో ప్రగతి చక్రం పరుగులు పెడుతోందని అన్నారు బాజిరెడ్డి. సంస్కరణలు అమలుతో ఆదాయం పెంపుతోపాటు నష్ట నివారణ చర్యలు తీసుకొని ఆర్టీసీని గాడిన పెడుతున్నట్లు చెప్పారు. త్వరలోనే 300ఎలక్ట్రికల్ బస్సులు ప్రారంభించనున్నామని వెల్లడించారు. హైదరాబాద్‌లోని హకీంపేట్‌లో ఒకటి, వరంగల్‌లో రెండు ఐటీఐ కాలేజీలు తరగతులను ప్రారంభించబోతున్నట్టు పేర్కొన్నారు. త్వరలోనే 1200 ఉద్యోగాలు విడతలవారీగా కారుణ్య నియామకాలు చేయబోతున్నామన్నారు.
ఇప్పటికే పార్సిల్ సర్వీస్ ద్వారా మంచి లాభాలు ఆర్జిస్తున్న ఆర్టీసీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతుందన్నారు బాజిరెడ్డి. ఆర్టీసీ ప్రత్యేక బ్రాండ్‌పేరుతో జీవ వాటర్ బాటిళ్లను త్వరలోనే ప్రారంభించనుంది. సంస్థలో పనిచేస్తున్న సిబ్బందికి అక్టోబర్ నెల జీతంతోపాటు ఒక డీఏను అందిస్తామన్నారు. అతి త్వరలోనే ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో సూపర్ లగ్జరీ, డీలక్స్ స్వీపర్ క్లాసెస్ బస్సులు ప్రవేశపెట్టనున్నామని తెలిపారు బాజిరెడ్డి గోవర్ధన్.
టీఎస్ ఆర్టిసిలో ఆదాయం పెంచుకొవటానికి 30 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని బాజిరెడ్డి చెప్పారు. ఇటు ప్రయాణికులకు మరోవైపు సంస్థ సిబ్బందికి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సిబ్బంది, ప్రయాణికుల మన్ననలను పొందామని అన్నారు. సంస్థ సిబ్బందికి రావాల్సిన బకాయిలను పూర్తిస్థాయిలో చెల్లిస్తామన్నారు. సిబ్బందికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని. సిబ్బంది పూర్తి విశ్వాసంతో సైనికుడిలా పనిచేసి సంస్థ నష్ట నివారణకు కృషి చేయాలని బాజిరెడ్డి గోవర్ధన్ కోరారు.
టిఎస్ ఆర్టీసి తార్నాక ఆసుపత్రిలో సిబ్బంది కోసం మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు బాజిరెడ్డి గోవర్దన్. సంస్థ కోసం కృషి చేస్తున్న మేనేజింగ్ డైరెక్టర్ వి సి సజ్జానార్, ఇతర సిబ్బంది, ఆర్టీసీ ఉద్యోగులకు అబినందనలు తెలిపారు. తాను ఛైర్మన్‌గా పదవి బాధ్యతలు చేపట్టిన నుంచి అనేక సంస్కరణలు అమల్లోకి తెచ్చామన్నారు. సంస్థ నష్టాల్లో ఉన్నందున జీతభత్యాలు కూడా వదులుకున్నట్టు తెలిపారు.
టిఎస్ ఆర్టిసి ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ప్రయాణికుల అభిరుచులకు అనుగుణంగా కొత్త కొత్త పథకాలను అమలు చేస్తున్నామని అన్నారు బాజిరెడ్డి. ఫాదర్స్ డే, మదర్స్ డే, చిల్డ్రన్స్ డే, జాతీయ పండగలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక రాయితీలతో, ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తున్నామన్నారు. తిరుపతి వెంకన్న దర్శనం కోసం ఆర్టీసీ బస్సులోనే 9.7.2022 నుంచి తిరుపతికి బస్‌టికెట్‌తోపాటు దర్శన టిక్కెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించామన్నారు. ప్రతిరోజు తిరుపతికి 1,000 మంది ప్రయాణికులను చేర్చుతున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రయాణికులు ఫిర్యాదులు తెలుసుకొని తక్షణ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.