TRS MLA Jogu Ramanna Mother Is No More: ఆదిలాబాద్ :  తెలంగాణ మాజీ మంత్రి, ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగు రామన్నకు మాతృవియోగం కలిగింది. టీఆర్ఎస్ నేత జోగు రామన్న తల్లి భోజమ్మ(98) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి భోజమ్మ అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నారు. వయసురీత్యా అనారోగ్యంతో సతమతమవుతున్న భోజమ్మ నేటి ఉదయం తుదిశ్వాస విడిచారు. ఎమ్మెల్యే జోగు రామన్న తల్లి భోజమ్మ మృతి పట్ల రాష్ట్ర మంత్రులు కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్‌ రెడ్డి, శ్రీనివాస్‌ గౌడ్‌, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, తదితర నేతలు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థించారు.


భోజమ్మ మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగురామన్న మాతృమూర్తి జోగు బోజమ్మ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. శోకతప్తులైన జోగు రామన్న కుటుంబ సభ్యులకు, సీఎం కేసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.






ప్రముఖ కవి నిజాం వెంకటేశం కన్నుమూత
ప్రముఖ కవి, అనువాదకుడు నిజాం వెంకటేశం (74) గుండెపోటుతో మరణించారు. సిరిసిల్లకు చెందిన వెంకటేశం ఐదు దశాబ్దాలుగా తెలంగాణ సాహిత్యం కోసం పాటుపడ్డారు. దిక్సూచి అనే కవితా పత్రికను ప్రారంభించి, కొత్త తరం వారితో పాటు పాత తరం కవులకు వేదికగా నిలిచారు. వెంకటేశం విద్యుత్ శాఖలో ఏడీఈగా రిటైరయ్యారు. అనంతరం హైదరాబాద్ లోని పద్మారావు నగర్ లో స్థిరపడ్డారు. అలిశెట్టి ప్రభాకర్, సుద్దాల అశోక్ తేజ లాంటి ఎంతో మంది కవులకు స్ఫూర్తిగా నిలిచారు వెంకటేశం. అల్లం రాజయ్య రాసిన కథల సంకలనం భూమి నవలతో పాటు పలువురు కవులు, రచయితల రచలనలను ఆయన ప్రచురితం చేశారు.


నిజాం వెంకటేశం మరణం పట్ల సంతాపం
సాహితీ సృజనకారుల ఆత్మ బంధువు, సాహితీవేత్త, నిజాం వెంకటేశం మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. పేదరికంలో వున్న తెలంగాణ రచయితలు కవుల బాగోగులను కనిపెట్టుకుంటూ, వారికి చేదోడువాదోడుగా వుంటూ, తెలంగాణ సాహిత్యం పట్ల నిజాం వెంకటేశం కనబరిచిన ఆత్మీయతానుబంధం గొప్పదని సీఎం అన్నారు. వారి మరణం సాహిత్య రంగానికి తీరని లోటని, వారి కుటుంబ సభ్యులకు సిఎం కెసిఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.