Telangana News: రాష్ట్రంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ధరణి పోర్టల్ లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారం పై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని చీఫ్ కమిషనర్ ల్యాండ్ ఫర్ రెవెన్యూ నవీన్ మిట్టల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి రెవెన్యూ ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలోనే జీవో నెంబర్ 58, 59, ధరణి పోర్టల్ నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా ల్యాండ్ ఫర్ రెవెన్యూ చీఫ్ కమిషనర్ నవీన్ మిట్టల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో నివాసం ఏర్పాటు చేసుకుని కొన్ని సంవత్సరాలుగా నివసిస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ జీవో నెంబర్ 58, 59 నిబంధనల మేరకు పట్టాలు మంజూరు చేయాలని తెలిపారు. ధరణి పోర్టల్ లో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 


సమీక్షా సమావేశంలో పాల్గొన్న కలెక్టర్ బొర్కడే హేమంత్


కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు, జిల్లా అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి ఈ సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ జీవో నెంబర్ 59 ప్రకారం ఇంటి నిర్మాణం చేసుకొని భూమి క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు చేసుకొని ప్రభుత్వ రుసుము చెల్లించిన వారికి పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే జీవో నెంబర్ 58 క్రింద అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పట్టాలు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ధరణి పోర్టల్ లో వచ్చిన దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారుల సమన్వయంతో కృషి చేస్తున్నామని, జూన్ మాసంలో తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో అన్ని శాఖల అధికారులు నిమగ్నమై ఉన్నందున కొన్ని దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని వెల్లడించారు.


అన్ని రికార్డులు పరిశీలించాకే నివేదిక తయారు


ధరణిలో మిస్సింగ్, వాస్తవ విస్తీర్ణం కాకుండా ఎక్కువ, తక్కువ ఉన్నవాటిపై వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రికార్డుల ఆధారంగా సవరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కోర్టులో కేసులు కొనసాగుతున్న భూముల సంబంధిత రికార్డులను పరిశీలించి నివేదిక తయారు చేస్తున్నామని కలెక్టర్ బొర్కడే హేమంత్ వివరించారు. టీఎం. 33 లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి స్లాట్ బుక్ అయిన కేసులను వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రామ్ మోహన్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.