Telangana Minister Vemula Prashanth Reddy: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అద్భుతాలు చేస్తోందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. రైతులు,  పేదలు రెండు కండ్లుగా రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలన కొనసాగిస్తోందని చెప్పారు. ఎవరెన్ని కుట్రలు చేసినా, గిమ్మిక్కులు చేసినా లాభం లేదన్నారు. కేసీఆర్ నాయకత్వంలో మరోసారి తెలంగాణలో గూలాబీ దళం విజయకేతనం ఎగురవేస్తుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ దార్శనిక పాలనలో రాష్ట్రంలో అంతా సుభిక్షంగా ఉందని, తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కొనియాడారు మంత్రి ప్రశాంత్ రెడ్డి.


రాష్ట్రంలో రైతు ప్రభుత్వం, సామాన్యుల ప్రభుత్వం పాలన ఉందన్నారు. రైతులకు పంట సాయం రైతు బంధు నగదు పంపిణీ దేశంలో మరెక్కడా లేదని పేర్కొన్నారు. రైతు బంధు ఖరీష్, రబీ సీజన్లలో రెండు దఫాలుగా పంట పెట్టుబడి సాయాన్ని రూ.5 వేల చొప్పున సీఎం కేసీఆర్ అందిస్తున్నారని చెప్పారు. దళారీ వ్యవస్థను లేకుండా చేసేందుకు ధరణి పోర్టల్ ను తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ సొంతమన్నారు. ఎకరాలను బట్టి రైతులకు బ్యాంకు ఖాతాల్లో రైతు బంధు సాయం జమ అవుతుందని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం పోడు భూముల పంపిణీ చేసిన గొప్ప నేత కేసీఆర్ అని కొనియాడారు. వారికి సైతం రైతు బంధు అందించి రైతు బాంధవుడుగా నిలిచారని చెప్పారు.


ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని.. ప్రజలు ఈ విషయం గమనించాలన్నారు. మహారాష్ట్ర, కర్ణాటకతో పాటు ఇతర రాష్ట్రాలు సైతం తెలంగాణ మోడల్ ను కోరుకుంటున్నారని, దేశ వ్యాప్తంగా రాష్ట్ర మోడల్ కు డిమాండ్ పెరుగుతోందన్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ధరణి పోర్టల్ అంశంపై ప్రతిపక్ష కాంగ్రెస్‌, బీజేపీలకు అవగాహనా లేకనే పోర్టల్ ను రద్దు చేస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు రైతు బంధు అందాలంటే ధరణి పోర్టల్ ఉండాలని, లేకపోతే మళ్లీ దళారీ వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ కుట్రలు చేసినా, బీజేపీ గిమ్ముక్కులు చేసినా లాభం లేదని, వారి సర్కస్ ఫీట్లను ప్రజలు గమనిస్తున్నారని.. బీఆర్‌ఎస్‌ పార్టీ హ్యాట్రిక్‌ కొడుతుందని  ధీమా వ్యక్తం చేశారు. 
Join Us on Telegram: https://t.me/abpdesamofficial