బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల క్లస్టర్ -2 గ్రామాల బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. ఉద్యమ కాలం నుండి వెన్నంటి ఉండి, నేడు అబివృద్దిలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను రాజకీయాల్లోకి వచ్చే ముందు తన తండ్రి చెప్పిన మూడు సూత్రాలకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. అవి పాటిస్తున్నాను కాబట్టే అధినేత కేసీఆర్ దగ్గర చనువుగా నమ్మకంగా మెదిలే అవకాశం, కార్యకర్తలకు కుటుంబ సభ్యునిగా మెదిలే అవకాశం సాధ్యమయ్యిందని అన్నారు మంత్రి వేముల. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆదరాభిమానాలు ఎన్నటికీ మర్చిపోనన్నారు. బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలమని, పార్టీ కోసం పని చేసిన వారికి కచ్చితంగా సముచిత గౌరవం దక్కుతుందని అన్నారు.
2001 ఉద్యమం నుండి పని చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ అయిన విఠల్ రావుకి దక్కిన పదవులే అందుకు ఉదాహరణ అన్నారు. రెండో సారి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వారికి అవకాశం లభించిందని, వెనుకో ముందో కష్టపడే వారికి పదవులు తప్పక లభిస్తాయని అన్నారు. పార్టీ జెండా మోసే వారిని, పార్టీ కోసం పని చేసేవారిని అధినేత కేసిఆర్ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారన్నారు. ఏ మూలన ఉన్న పార్టీ కోసం పని చేసిన వారికి పదవి కచ్చితంగా వరిస్తుంది అన్నారు. కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో నెంబర్ వన్ అయ్యిందని ఈ సందర్బంగా గుర్తు చేశారు.
ఒకప్పుడు కరువు ప్రాంతంగా ఉండే... నేడు దేశానికే అన్నం పెడుతున్న రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు మంత్రి. రైతులు, పేదలు ఎక్కడ సంతోషంగా ఉన్నరంటే.. తెలంగాణ రాష్ట్రం, సీఎం కేసిఆర్ వైపు దేశం మొత్తం ఆసక్తిగా చూస్తున్నారన్నారు. కుల వృత్తులకు ప్రోత్సాహకాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ది పథకాలు, వ్యవసాయ రంగంలో వచ్చిన మార్పులు యావత్ దేశాన్ని ఆకర్షిస్తున్నాయని అన్నారు మంత్రి. కేసిఆర్ సంపద సృష్టిస్తున్నారు..ఆ సంపద నేరుగా లబ్దిదారులు, పేదల బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తున్నారని, అట్లా లక్షల కోట్లు నేరుగా ప్రజలకు చేరాయని మంత్రి చెప్పారు. తెలంగాణ సాధించిన ప్రగతి విజయాలపై రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని నిర్ణయించిందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమంలో లేని బండి సంజయ్ దశాబ్ది ఉత్సవాలను కేసీఆర్ కుటుంబ ఉత్సవాలు అనడం ఆయన అవివేకమని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ది ఫలాలు,కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి తెలంగాణ బిడ్డ దశాబ్ది ఉత్సవాలు జరుపుకుంటారని అన్నారు. ఏదో రకంగా బీజేపీ బండి సంజయ్ కూడా సీఎం కేసీఆర్ ప్రభుత్వ లబ్దిదారుడే అని అన్నారు. ఈ ప్రాంత ఎంపీ వల్ల అభివృద్ది ఏమీ జరగలేదని పైగా పసుపు బోర్డు పేరుతో రైతులను నిండా ముంచిన బీజేపీని నమ్మే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కేసీఆర్ సహకారంతో వేల కోట్లతో బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకున్నామని, ఎండా కాలంలో కూడా చెరువులు అలుగులు పారుతున్నాయి. రైతులు సంబురంగా ఉన్నరని గుర్తు చేశారు. ప్రతి గ్రామంలో కోట్లల్లో అభివృద్ది కండ్లకు కనిపిస్తుందని, అభివృద్ది పై గ్రామాల్లో చర్చ జరిగేలా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులు చొరవ తీసుకోవాలన్నారు.
వెల్పూర్ క్లస్టర్ గ్రామాల్లో జరిగిన అభివృద్దిని మంత్రి ఈ సంధర్బంగా లెక్కలతో సహా వివరించారు. పడగల్, రామన్నపేట, అంక్సపూర్, పోచంపల్లి, కుకునుర్, కోమన్ పల్లి, వెంకటాపూర్,అమీన్ పూర్, లక్కొరా గ్రామాల్లో నేరుగా జరిగిన లబ్ది దారులకు చేరిన డబ్బులు, అభివృద్ది లెక్కలతో సహా వివరించారు. బి. టి రోడ్లు, సి సి రోడ్లు, బ్రిడ్జిలు,చెక్ డ్యాంలు, చెరువులు, కాలువలు బాగు చేసుకోవడం, నవాబ్ లిఫ్ట్ ద్వారా చెరువులు నింపుకోవడం లాంటి కార్యక్రమాలు ఆయా గ్రామాల బిఆర్ఎస్ శ్రేణులకు వివరించారు. బాల్కొండ నియోజకవర్గ ప్రజలు రెండు సార్లు జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించారని వారి నమ్మకాన్ని నిలబెడుతూ బాల్కొండ నియోజకవర్గంలో వేల కోట్ల నిధులు తెచ్చి అభివృద్ది చేసుకున్నామని తెలిపారు. బాల్కొండ బిఆర్ఎస్ కుటుంబ సభ్యులకు ఏ ఆపదా వచ్చిన నేను తోడుగా నిలబడతా అని బిఆర్ఎస్ శ్రేణులకు భరోసా కల్పించారు.