Highcourt On Kamareddy Master Plan :   కామారెడ్డి టౌన్ మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు స్టే కు నిరాకరించింది . కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలంటూ 40 మంది రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. తెలంగాణ ప్రభుత్వం, టౌన్  ప్లానింగ్ డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్ ను ప్రతివాదులుగా తేల్చారు. పిటిషన్ ను విచారించిన హైకోర్ట్.. కామారెడ్డి టౌన్ ప్లానింగ్ విషయంలో ఇప్పటికిప్పుడు ఏమీ కాదని తెలిపింది. హైదరాబాద్, వరంగల్ మాస్టర్ ప్లాన్ విషయంలో ఏళ్లతరబడి ఊగిసలాట కొనసాగుతుందని.. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే దేశం ఎప్పుడో బాగుపడేదని అభిప్రాయపడింది. ఈ సందర్భంగా  రైతుల నుంచి  అభ్యంతరాలు తీసుకుంటున్నామని అడ్వొకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. 


అభ్యంతరాల స్వీకరణకు బుధవారం చివరి తేదీ కావడంతో రైతుల ధర్నా


మరో వైపు మాస్టర్​ ప్లాన్‌కు   వ్యతిరేకంగా బుధవారం మున్సిపల్​ ఆఫీసు ఎదుట రైతు ఐక్య కార్యచరణ కమిటీ ధర్నాకు దిగింది . అభ్యంతరాల స్వీకరణకు  బుధవారం చివరి రోజు ఉన్న దృష్ట్యా రైతులు ధర్నా చేస్తున్నారు.  ఇప్పటికే వెయ్యికిపైగా అభ్యంతరాలు వచ్చినట్లుగా తెలు్సతోంది.  ప్లాన్​లో ప్రతిపాదించిన ఇండస్ర్టియల్ జోన్​, గ్రీన్ ​జోన్​, 100 ఫీట్ల పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కామారెడ్డి కొత్త టౌన్ ప్లానింగ్ పై  గత కొన్ని రోజులు రైతులు ఆందోళన చేస్తున్నారు. ప్లాన్​కు వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో అభ్యంతరాలు రావడంతో పాటు, ప్లాన్​ మార్చాలని డిమాండ్​ చేస్తూ  రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. 


ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూములు సేకరించడం కాదన్న కలెక్టర్ 
 
మాస్టర్ ప్లాన్‌ ముసాయిదా దశలో ఉందని.. ఇంకా ఫైనల్‌ కాలేదని తెలిపారు. అనవసరంగా రైతులు ఆందోళన చెందొద్దని కలెక్టర్, ప్రభుత్వం రైతులను సముదాయిస్తున్నారు.  మార్పులు చేర్పులు ఉంటాయని చెప్పారు. భూములు పోతాయని కొందరు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఇప్పటికీ  ఎవరి భూములు వారికే ఉన్నాయన్నారు.   61.55 కి.మీ కవర్ చేస్తూ ఓ ప్రతిపాదన ఉంది. 191 జీవోను గతేడాది నవంబర్ 30న విడుదల చేశాం.   ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే. ఇందులో మార్పులు చేర్పులు ఉంటాయి. డ్రాప్ట్ మాస్టర్ ప్లాన్‌పై వచ్చిన అభ్యంతరాలపై పరిశీలన చేస్తున్నామని కలెక్టర్ చెబుతున్నారు.  


పొలాలను లాక్కుంటారని రైతులు ఆందోళన చెందవద్దంటున్న ప్రభుత్వం


మాస్టర్ ప్లాన్ లో ఎవరి భూములు తీసుకోవడం లేదని ప్రభుత్వం చెబుతోంది. 2000 సంవత్సరంలో పాత మాస్టర్ ప్లాన్  లో ఉన్న వారి  భూములు పోలేదని  ఇప్పటికీ  రైతుల పేరు మీదే భూములు ఉన్నాయి. ఇప్పటికి వారు రైతుబంధు తీసుకుంటున్నారు. ఇండస్ట్రీయల్ జోన్ అంటే భూ సేకరణ కాదని ప్రభుత్వం చెబుతోంది.  ఇండస్ట్రియల్ జోన్ ప్రకటించిన మాత్రన పంట పొలాలను లాక్కోరు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కామారెడ్డి కలెక్టర్ చెబుతున్నారు. అయితే రైతులు మాత్రం తమ భూములు పోతాయనే ఆందోళన చెందుతున్నారు.