Nagoba Jathara 2023: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లో కొలువైన నాగోబా దేవాలయం మరికొద్ది రోజుల్లో భక్తులతో రద్దీగా మారనుంది. ఈనెల 21న నాగోబాకు మహాపూజ చేసిన అనంతరం జాతర ప్రారంభం కానుంది. పుష్యమాసంలో ప్రతియేటా నాగోబాకు నిర్వహించే మహాపూజ కోసం మేస్రం వంశీయులు సిద్దమయ్యారు. పూర్వం నుండి కొనసాగిస్తున్న ఆచారం ప్రకారం గత నెల 25న (చంద్ర దర్శనం) నేలవంక చూసిన అనంతరం వారం రోజులపాటు ఎడ్లబండిలో నాగోబా జాతర గురించి ప్రచారం నిర్వహించారు. సిరికొండలో పుట్ట తయారి కోసం మహిళలకు కావల్సిన నీటి కుండల కోసం ఆర్డర్ చేశారు. అనంతరం జనవరి 1 వ తేదిన కేస్లాపూర్ లో 22 తెగల మెస్రం వంశీయులు నాగోబా ఇంటి వద్ద (మురాడి పేన్) సమావేశమై గంగాజలం పాదయాత్ర గురించి చర్చించి నాగోబా ఇంటి వద్ద ఉన్న కలిశం (ఝరి) కి పూజలు చేసి కేస్లాపూర్ నుంచి కాలినడకన పాదయాత్రగా బయలుదేరారు. 




గంగాస్నానం ఆచరించి మరీ గోదారమ్మకు ప్రత్యేక పూజలు


జనవరి 1 న కేస్లాపూర్ నుంచి బయల‌్దేరిన  పాదయాత్ర 7,8, తేదిల్లో కుమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలోని ఆయా గ్రామాల ద్వారా 10వ తేదిన మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగు సమీపంలోని గోదావరి నది వద్దకు చేరుకుంది. గోదావరి నదిలోని హస్తలమడుగు వద్దకు చేరుకున్న మెస్రం వంశీయులు గంగ స్నానాలు ఆచరించి సాంప్రదాయబద్దంగా గోదారమ్మకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యం సమర్పించారు. అక్కడే దంపుడు బియ్యంతో ప్రత్యేక వంటకాలు చేసుకొని భోజనాలు చేసి పవిత్ర జలం కోసం కళశ పూజ చేశారు. అనంతరం హస్తలమడుగులో గోదారమ్మకు పూజలు చేసి కళశం (ఝరి)లో పవిత్ర జలాన్ని సేకరించి కటోడ నాగోబా పూజారి భుజంపై ఒక వెదురు కర్రకు ఝరి ని అమర్చి ఈ పవిత్ర గంగాజల కళిశంతో కేస్లాపూర్ కు తిరుగు పయనం అయ్యారు. 


నవధాన్యాలతో వంటలు చేసి ఇంద్రాదేవికి నైవేద్యం


తెల్లని దుస్తులు ధరించి కాలినడనకన చేపట్టిన మెస్రం వంశీయుల పాదయాత్ర రహదారిలో చెట్టు గుట్టల మద్యలో నడుస్తు ఒక వరుస క్రమంలో చీమల ధారలా కనిపిస్తుంది. దారిలో చూసే వారందరినీ ఎంతో ఆకట్టుకుంటుంది. పవిత్ర గంగాజలంతో బయలుదేరిన పాదయాత్ర ఈనెల 17న మిగతా వారంతా కుటుంబ సమేతంగా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లికి చేరుకొని ఇంద్రాదేవి ఆలయంలో నవ ధాన్యాలతో వంటకాలు చేసి నైవేద్యం సమర్పించి ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం అదేరోజు కేస్లాపూర్ లోని మర్రిచెట్ల వద్దకు చేరుకుంటారు. ఈనెల 21వ తేదీన అర్థరాత్రి పవిత్ర గంగాజలంతో నాగోబాను అభిషేకించి మహాపూజ చేయనున్నారు. మహాపూజ అనంతరం నాగోబా జాతర ప్రారంభం కానుంది. అప్పటి నుండి సాంప్రదాయ పూజల మద్య వారం రోజుల పాటు నాగోబా జాతర భక్తులతో కిటకిటలాడనుందని మెస్రం వంశీయులు ఏబీపీతో తెలిపారు. ఈ నాగోబా జాతరకు రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల నుంచి ఆదివాసీలు వస్తారు.