Telangana High Court on MLA Kova Laxmi | హైదరాబాద్: ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి తెలంగాణ హైకోర్టులో ఊరట దక్కింది. ఆమెకి వ్యతిరేకంగా ఎన్నికల సందర్భంగా దాఖలైన పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టులో కొట్టివేసింది. కోవలక్ష్మి ఎన్నికల అఫిడవిట్లో ఆదాయపన్ను (Income Tax) లెక్కలు తప్పులు ఉన్నాయంటూ ఆసిఫాబాద్ (Asifabad) కాంగ్రెస్ అభ్యర్థి అజ్మీర శ్యామ్ నాయక్ కోర్టుకు ఎక్కారు. 2023 ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని తన ఎన్నిక చెల్లదని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన కోవలక్ష్మి 2023లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరితంగా గెలిచిందని పిటిషన్ వేశారు. ఈ కేసు గత 9 నెలలుగా కొనసాగుతోంది. అయితే ఎట్టకేలకు శుక్రవారం నాడు కేసు విచారించిన హైకోర్టు పిటిషన్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. కోవలక్ష్మి ఎన్నికల అఫిడవిట్ లో income-tax లెక్కలు తప్పులు లేవని తేల్చేసింది. దీంతో ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి భారీ ఊరట లభించింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోవలక్ష్మి, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. కోర్టు ఇచ్చిన తీర్పును ఎమ్మెల్యే కోవలక్ష్మీ స్వాగతించారు.