నిర్మల్ జిల్లా బాసరలోని ఆర్జీయూకేటీ ట్రిపుల్ ఐటీ (Basara IIIT) వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతున్న వేళ ప్రభుత్వం విద్యాసంస్థకు కొత్త డైరెక్టర్‌ను నియమించింది. ప్రొఫెసర్ సతీష్ కుమార్ ను ఆర్జీయూకేటీకి నియమించింది. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, డైరెక్టర్ నియామకంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. అయితే, వీసీతో సమస్యలు పరిష్కారం కానప్పుడు డైరెక్టర్ వల్ల ఉపయోగం ఏముంటుందని ప్రశ్నించారు. కానీ, మిగతా డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదని అంటున్నారు. సీఎం కేసీఆర్ ఆర్జీయూకేటీకి వచ్చి స్పష్టమైన హామీ ఇస్తేనే ఆందోళన విరమించబోమని విద్యార్థులు తెగేసి చెప్పారు.
తాగునీరు ఆపలేదు - జిల్లా ఏఎస్పీ
ఆందోళన చేస్తున్న విద్యార్థులకు తాగునీటి సరఫరాను ఆపేశామనే సంగతి నిజం కాదని జిల్లా ఏఎస్పీ కిరణ్ కారే తెలిపారు. తాగునీటి సరఫరాను నిలిపివేశారనే వార్తలు వస్తున్న వేళ ఏఎస్పీ స్పందించారు. అయితే అంతకుముందు ‘‘మా క్యాంపస్ ఎస్పీ కంట్రోల్‌లో ఉంది. తాగునీరు, విద్యుత్ సౌకర్యం పునరుద్దరించాలి’’ అని విద్యార్థులు ట్వీట్ చేశారు.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆందోళన మూడోరోజుకు చేరింది. సమస్యలు పరిష్కరించే వరకు తగ్గేదేలేదంటున్నారు. అప్పటి వరకు దీక్షలు విరమించేదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. విద్యార్థుల ధర్నాలపై మంత్రి సబిత చేసిన వ్యాఖ్యలపై ట్రిపుల్ ఐటీ విద్యార్థులు మండిపడ్డారు. తమ డిమాండ్లు సిల్లీగా ఉన్నాయని మంత్రి సబిత వ్యాఖ్యలు సరికావంటున్నారు. సీఎం కేసీఆర్ వచ్చేదాకా తాము నిరసన కొనసాగిస్తామని విద్యార్థులు చెబుతున్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సరికాదని అన్నారు అన్నారు టీజేఎఫఱ్ నాయకులు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు కేసులు నమోదు చేస్తామని బెదిరించడం ప్రభుత్వ చేతకానితనానికి నిదర్శనమని టిజేఎస్ ముధోల్ నియోజకవర్గ ఇంచార్జీ సర్దార్ వినోద్ కుమార్ విమర్శించారు. విద్యార్థుల డిమాండ్లు పరిష్కరించకుండా కాలయాపన చేస్తూ... విద్యార్థులు పెట్టిన డిమాండ్లు సిల్లీవని మంత్రి కామెంట్ చేయడాన్ని తప్పుపట్టారు. తక్షణమే ఆ మాటలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ప్రభుత్వం బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఆందోళన చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.