Adilabad Latest News: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులు ఆగ్రహానికి గురి అవుతున్న జీవో నెంబర్‌ 49పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి జీవోను నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. దీనిపై ఆదివాసీలు, నాయకులు ప్రభుత్వానికి కృతజ్ఞత తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బంద్‌కు పిలుపునిచ్చిన రోజునే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల అటవీ భూమిని కొమ్రంభీమ్‌ కన్జెర్వేషన్ కారిడార్‌గా మార్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్ 49ను విడుదల చేసింది. తమ ప్రాంతాన్ని ఇలా మార్చడంపై గిరిజనం ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము అంగీకరించేది లేదని చాలా కాలం నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు.  ఆ ప్రాంతానికి వచ్చిన ప్రతి నాయకుడికి తమ సమస్యను చెబుతున్నారు. ప్రతి నేతను కలిసి జరిగే నష్టాన్ని వివరించారు. ఎన్ని చేసిన ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చివరకు ఉద్యమ పంథాను అందుకున్నారు. 

చాలా రోజుల నుంచి గిరిజనులు రిలే దీక్షలు చేస్తున్నారు. యువకులు, మధ్యవయసు వ్యక్తులు మహిళలు అంతా కలిసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డు ఎక్కారు. అధికారులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో ఉద్యమాన్ని మరో దశకు తీసుకెళ్లారు. అందులో భాగంగా నేడు(సోమవారం) ఉమ్మడి జిల్లా బంద్‌కు పిలుపునిచ్చారు. 

జీవో నెంబర్‌ 49కు వ్యతిరేకంగా గిరిజన నాయకులు చేస్తున్న ఉద్యమానికి ఉమ్మడి జిల్లా బాసటగా నిలిచింది. ఉదయం నుంచి బంద్‌కు వ్యాపారస్థులు, రవాణా అధికారులు, ప్రజలు సహకరించారు. అందరి సహకారంతో బంద్ ప్రశాంతంగా సాగింది. 

వివిధ దశల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజనుల ఆక్రందనను ప్రభుత్వం ఆలకించింది. ముఖ్యమంత్రి దీనిపై స్పదించి జీవో 49ను నిలిపివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గిరిజన ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు.

ప్రస్తుతనికి జీవో 49ను నిలిపేస్తున్నట్టు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గిరిజన ఉద్యమ నాయకులు కృతజ్ఞత తెలిపారు. ఈ నిలుపుదలలో ప్రధాన పాత్ర పోషించిన సీతక్కకు కూడా వారు ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈజీవో నిలుపుదల కాకుండా రద్దు చేయాలని వాళ్లు డిమాండ్ చేస్తున్నారు. అప్పుడే ప్రజల్లో నమ్మకం కలుగుతుందని అంటున్నారు. నిలుపుదల చేసిన జీవోను ఎవరైనా ఎప్పుడైనా మళ్లీ అమలు చేసేందుకు యత్నించవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.