Telangana BJP Chief Bandi Sanjay: కర్ణాటక ఫలితాలకు, తెలంగాణకు సంబంధం ఏముంది? దేశంలో 15 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో గెలిచింది.. మరి ఇక్కడ రాలేదు కదా?... అట్లాగే కర్ణాటకలో ఓడిపోతే.. తెలంగాణకు సంబంధం ఏంది? రాష్ట్రంలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీయేనని తేలిపోయిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. గతంలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. అందుకే బీజేపీని అడ్డుకోవడానికే గుంట నక్కల పార్టీలన్నీ ఒక్కటవుతున్నాయి. బీజేపీ సింహం.. సింగిల్ గానే పోటీ చేసి పూర్తి మెజారిటీతోనే అధికారంలోకి రాబోతోంది. సీఎంసహా అన్ని సర్వే సంస్థల నివేదికలు ఇవే చెబుతున్నాయి అన్నారు.
బీజేపీ ఎంపీ సోయం బాపూరావు కుమారుడి పెళ్లికి హాజరయ్యేందుకు ఆదివారం ఆదిలాబాద్ వచ్చిన బండి సంజయ్ వీడియాతో మాట్లాడుతూ.. తాము ఓడిపోతామని తెలిసి బీఆర్ఎస్, కాంగ్రెస్, ఓ సెక్షన్ మీడియా కొత్త నాటకాలు షూరూ చేసినయ్. కర్ణాటకలో బీజేపీ ఓడిపోయింది కాబట్టి తెలంగాణలోని బీజేపీ నేతలంతా కాంగ్రెస్ లోకి పోతారని ప్రచారం చేస్తున్నయ్. తెలంగాణలో కాంగ్రెస్ పనైపోయిందని తెలిసీ ఆ పార్టీని లేపేందుకు డ్రామాలాడుతున్నయ్. కాంగ్రెస్ నుండి గెలిచిన వాళ్లలో 12 మంది బీఆర్ఎస్ లోకి పోయారు. ఉన్న ఐదుగురిలో నలుగురు నాలుగు స్థంభాలాట ఆడుతున్నరు. ఒకాయన మాత్రం చౌరస్తాలో నిలబడి ఏం చేయాలో తెల్వక చూస్తున్నడు...
రేపు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసే ఎన్నికల్లో పనిచేయబోతున్నాయి అన్నారు. ఎన్నికలు గుర్తొచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు పేదలు గుర్తుకొస్తారు.. ఎన్నికలైపోంగనే పేదల భూములను గుంజుకుంటున్నారు. పేదల స్థలాల్లోనే కలెక్టరేట్లు, ఫైర్ స్టేషన్లు, కాలేజీలు కడతామంటున్నరు. ధరణి పేరుతో ఎట్లా రైతులను మోసం చేస్తున్నారో.. బీఆర్ఎస్ నాయకులు ఎట్లా లాభపడ్డారో జగమెరిగిన సత్యమే అన్నారు బండి సంజయ్.
Also Read: Telangana Cabinet scraps GO 111: ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత వెనుక లక్షల కోట్ల మహా స్కాం దాగి ఉంది - బండి సంజయ్
కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదు
అయినా కర్ణాటకకు, తెలంగాణకు ఏం సంబంధం? కర్ణాటకలో అధికారం పోయినా ఓట్ల శాతం మాత్రం తగ్గనేలేదు. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా బీజేపీకి 36 శాతం ఓట్లు వచ్చాయి. బీజేపీ కంటే కాంగ్రెస్ గ్రాఫ్ ఎక్కడ పెరిగిందో సమాధానం చెప్పాలి. దుబ్బాక నుండి మొన్న జరిగిన మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల వరకు ఏ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కు డిపాజిట్ రాలేదు. బీఆర్ఎస్ కు బీజేపీ ప్రత్యామ్నాయమని తేల్చాయి. అయినా ఈ ప్రచారం జరుగుతుంటే ఇదంతా కేసీఆర్, కాంగ్రెస్, ఒక సెక్షన్ మీడియా కలిసి ఆడుతున్న నాటకమిది. రాజకీయ విశ్లేషకులకు కూడా ఈ విషయం తెలిసి మౌనంగా ఉంటూ కేసీఆర్ అడుగులకు మడుగులు ఒత్తడం బాధాకరం.
బీజేపీ అంటే భగభగ మండే సూరీడు. అప్పుడప్పుడు మబ్బులొస్తుంటయ్. అవి రాగానే సూరీడు పనైపోయింది, కాంతి తగ్గిందనుకోవడం భ్రమ. అవి కొన్ని క్షణాలు మాత్రమే ఉంటాయి. ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేత లక్షల కోట్ల విలువైన మహా స్కాం. ఈ భూముల్లో 90 శాతం కేసీఆర్ కుటుంబానివి, బీఆర్ఎస్ కుటుంబానివే. ఎంత దుర్మార్గమంటే... ఆ ప్రాంతంలోని పేదల దగ్గర అత్యంత తక్కువ ధరకు ఎకరాల చొప్పున కొని ఇప్పుడు ఈ జీవోను ఎత్తివేసి గజాల చొప్పున అమ్ముకుంటూ భూ దందా చేస్తున్నారని కేసీఆర్ ఫ్యామిలీపై ఆరోపణలు చేశారు.