Thunderstorm Alert to AP Rain News: భానుడి భగభగలకు తల్లడిల్లుతున్న తెలుగు రాష్ట్రాలకు తీపి కబురు చెప్పింది వాతావరణ శాఖ. రెండు నుంచి మూడు రోజులపాటు ఏపీ, తెలంగాణలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. అల్పపీడన ద్రోణి ఈరోజు పశ్చిమ బిహార్ నుండి చత్తీస్ గఢ్ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తులో విస్తరించి ఉంది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్ష సూచన ఉండగా, ఏపీలో మాత్రం పిడుగులతో కూడిన వర్షాలు పడతాయిని హెచ్చరించారు.
ఏపీలో అక్కడ పిడుగుల వార్నింగ్
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రానున్న మూడు రోజులు ఏపీలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఉధృతంగా పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది. పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు వర్షం కురిసే సమయంలో చెట్ల క్రింద ఉండరాదు అని హెచ్చరించారు. సురక్షితమైన భవనాల్లో ఆశ్రయం పొందాలని, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బిఆర్ అంబేద్కర్ సూచించారు.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేడ్కర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న మూడు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అనకాపల్లి, అల్లూరి, కాకినాడ, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడతాయి. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, సత్యసాయి,అనంతపురం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
తెలంగాణలో వర్ష సూచన..
ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉష్ణోగ్రతలు యథాతథంగా ఉండనున్నాయి. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో కూడా వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుందని అధికారులు తెలిపారు. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు ఉష్ణోగ్రత కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకూ ఎక్కువగా ఒకటి లేదా రెండు చోట్ల నమోదయ్యే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఆకాశం నిర్మలంగా ఉంది. అయితే కొన్ని చోట్ల వర్షం కురుస్తోంది. మణికొండ, కూకట్ పల్లి, గచ్చిబౌలి, కొంపల్లి, సుచిత్ర మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులలంబ గద్వాల జిల్లాలలో అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉత్తర తెలంగాణలో గరిష్టంగా 44 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదు కాన్నాయి. హైదరాబాద్, జీహెచ్ఎంసీ, రంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో సగటున 40 డిగ్రీల మేర గరిష్ట ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.