liquor Bottles Caught at Tirumala:

  తిరుమలలో మరోసారి మద్యం సీసాలు కలకలం రేపాయి. శ్రీవారి ఆలయానికి సమీపంలోనే మద్యం సీసాలు లభించడంపై భక్తులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్ధానిక హెచ్.టి కాంప్లెక్స్ లోని షాప్ నెం.78లో టిటిడి‌ విజిలెన్స్ తనిఖీల్లో దాదాపు 5 మద్యం బాటిల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో షాప్ ను టీటీడీ విజిలెన్స్ & రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. ఇదే హెచ్‌టీ కాంప్లెక్స్‌లో వ్యక్తిపై హత్యాయత్నం జరిగిన ఘటన మరువకముందే మరోసారి ఈ ఏరియా వార్తల్లో నిలిచింది. హెచ్ టీ కాంప్లెక్స్ లో మద్యం లభించిన దుకాణదారుడిపై టిటిడి‌ విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకూ కేసు నమోదు‌ చేసిన పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఆలయానికి కూతవేటు దూరంలో హెచ్ టీ కాంప్లెక్స్ లో మద్యం బాటిల్స్ లభించడంతో.. తిరుమలలో నిఘా కరువైందంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆ షాప్ నిర్వహిస్తున్న నిందితుడి భార్య మాట్లాడుతూ.. తన భర్తకు మద్యం సేవించే అలవాటు ఉందని పోలీసులకు చెప్పారు. చెక్ పాయింట్ వద్ద తప్పించుకున్నాను, బ్యాగులో పెట్టుకుని సందులో నుంచి దూరి వచ్చేశానని చెప్పాడు. అయితే విషయం ఎలా తెలిసిందో కానీ అధికారులు వచ్చి తనిఖీ చేయడంతో మద్యం బాటిల్స్ దొరికాయని ఆమె చెప్పారు. ఆర్ రాజశేఖర్ రెడ్డి తన భర్త పేరు కాగా, నాగరాజు అనే వేరే పేరుతో పిలుస్తారని నిందితుడి భార్య వెల్లడించారు. 
చంపితే చంపుకోండి అంటూ సంచలన వ్యాఖ్యలు!
ఇలాంటి పనులు చేయవద్దు అని చెబితే తన భర్త వినడం లేదని బాధితురాలు వాపోయారు. తన భర్తపై ఏ చర్యలు తీసుకున్నా సరేనని, చంపినా సరే కానీ, తమను ఇబ్బందుల నుంచి తప్పించండి సార్ అని పోలీసులను మహిళ కోరారు. అంతకుముందే విజిలెన్స్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది హెచ్ టీ కాంప్లెక్స్ లోని వీరు షాపును సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో మద్యం బాటిల్స్ దొరికినందుకు షాప్ సీజ్ చేస్తున్నట్లు ఆమెకు అధికారులు వివరించారు. కూల్ డ్రింక్స్, ఇతర షాపు వస్తువులు వదిలేస్తామని, మద్యానికి సంబంధించినవి తీసుకెళ్తామని మహిళకు చెప్పారు. అయితే.. తాను మహిళనని, చెప్పినా భర్త వినిపించుకోవడం లేదన్నారు. తనకు ఆరోగ్యం బాగాలేదని, మద్యం వద్దంటే ఇంటి నుంచి వెళ్లిపోతానంటూ బెదిరించే వాడని పోలీసులకు ఆమె చెప్పింది. భర్త వ్యవహారం కారణంగా చుట్టుపక్కల వారితో తనకు చాలా అవమానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసింది.