Kodang Festival In Adilabad | ఆదివాసి గ్రామాల్లో వెదురు కర్రలపై నడిచే ఆచారం, జామడ అమావాస్య నుంచి పోలాల అమావాస్య వరకు కొనసాగించే సాంప్రదాయం. పోలాల అమావాస్య రోజు పశువులకు పూజలు నిర్వహించి, తెల్లవారు జామున వెదురు కర్రలతో గ్రామ పొలిమేరల్లో జాగేయ్ మాతరి అంటూ వెళ్ళి ఇప్పచెట్టు వద్ద వెదురు కర్రలు పెట్టీ నైవేద్యం సమర్పంచి, సహపంక్తి భోజనాలు చేసే ఆచారం. ఇంతకీ ఈ కోడంగ్ అంటే ఏమిటి.? జాగేయ్ మాతరీ అంటే ఏమిటి? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీలు నిర్వహించే కోడంగ్, జాగేయ్ మాతరి సాంప్రదాయంపై abp దేశం స్పెషల్ స్టోరీ.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీలు ప్రతి ఏటా చుక్కల అమావాస్య నుండి పొలాల అమావాస్య వరకు తమ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా నిర్వహించే ఆచారాల్లో ఒకటి కొడంగ్, జాగేయ్ మాతరి సాంప్రదాయం. ఆదివాసీలు తమ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా ప్రతి ఏటా జామడ అమావాస్య అనగా చుక్కల అమావాస్య నుండి పోలాల అమావాస్య వరకు ఈ వేడుకలు నిర్వహిస్తారు.
చుక్కల అమావాస్య రోజున ఆదివాసీలు అడవిలోకి వెళ్లి వెదురు కర్రలు తీసుకొని వస్తారు. ఈ వెదురు కర్రలను గుర్రాలుగా అంటే వారి సాంప్రదాయంలో కొడంగ్ లుగా తయారు చేస్తారు. ఈ వెదురు కార్రలపై నెలరోజులపాటు నడుస్తూ ఆటలు ఆడుతూ సందడి చేస్తారు. పూర్వం తమ పెద్దలు వర్షాకాలంలో బురదలో నడుచుకుంటూ రావాలంటే ఈ వెదురు కర్రలను సహాయంగా వినియోగించేవారు అంటువ్యాధులు రాకుండా వీటిపై నడుస్తుండేవారు. అలా కాలక్రమైన నేటి వరకు ఈ ఆచారాన్ని అలాగే కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆదివాసి గ్రామాల్లో చిన్నారులు వెదురు కర్రలపై నడుస్తు ఆటలు ఆడుతూ తమ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ వెదురు కర్రలపై నడిచే సాంప్రదాయాన్ని ఆదివాసీలు తమ భాషలో కొడంగ్ అని అంటారు. పోలాల అమావాస్య వరకు ఈ వెదురు కర్రలపై (కట్టే గుర్రాలపై) నడుస్తూ ఉంటారు. చిన్నారులు ఈ కర్రలపై నడుస్తు ఎంతో ఎంజాయ్ చేస్తారు.
పోలాల అమావాస్య రోజున ఆదివాసీలు తమ పాడి పశువులకు ప్రత్యేకంగా పూజలు నిర్వహించి పశువులకు నైవేద్యం సమర్పించి మోక్కుతారు. తమ కష్టసుఖాలు పాలుపంచుకునే రైతు దేవుళ్ళని భావించి వాటి కోసం అంటూ ఒకరోజు ఈ పూజలు చేస్తారు. పశువుల కోసం ప్రత్యేకంగా నైవేద్యాన్ని తయారు చేస్తారు. గారెలు, బూరెలు, తీపి తదితర నైవేద్యాలను తయారుచేసి వాటికి పూజలు నిర్వహించి హారతులు ఇచ్చి ఈ నైవేద్యాన్ని వాటికి సమర్పిస్తారు. అనంతరం మరుసటి రోజు ఉదయం వేకువ జామున ఈ వెదురు కర్రలను, రాత్రి తయారు చేసిన నైవేద్యాన్ని ప్రతి ఇంటి నుంచి ఒకరు మగవాళ్లు చిన్నలు పెద్దలు అందరూ కలిసి గ్రామ పటేల్ ఆధ్వర్యంలో ఒకరి వెనుక ఒకరు అందరూ కలిసి జాగేయ్ మాతరి జాగేయ్ అంటూ కేకలు వేస్తూ ఊరి పొలిమేరలోని ఇప్ప చెట్టు వద్దకు చేరుకుంటారు. వీరు దిన్ని శివ్వా అని అంటారు.
ఈ ఇప్ప చెట్టు వద్ద తమతో తీసుకొచ్చిన నైవేద్యంతో ముందుగా గ్రామ పటేల్ దేవరీలు పూజలు చేసి మొక్కుతారు. అనంతరం తీపి పదార్థాలు, నైవేద్యాన్ని శివ్వకు సమర్పించి మోక్కుతారు. ఆపై మిగతా అందరూ నైవేద్యం సమర్పించి మొక్కుతారు. అందరి మొక్కులు అయ్యాక తమ చేతిలో తీసుకొచ్చిన కొడంగ్ వెదురు కర్రలను విరిచి ఇప్ప చెట్టు వద్ద వేస్తారు.
అనంతరం అక్కడి ఆవరణలో తమ వెంట తీసుకొచ్చిన నైవేద్యం తీపి పదార్థాలు గారేలు, బూరెలు, ఇతర అన్నిటిని ఒకే చోటా కలిపి సమకూర్చుతారు. తరువాత అందరూ ఒక వరుస క్రమంలో కూర్చుంటారు. ఆపై అందరికి టేకు ఆకులను ఇచ్చి ఆ తరువాత ప్రతి ఒక్కరికి ఈ ఒకే చోట సమకూర్చిన నైవేద్యం గారెలు బూరెలు అన్నం ఇతర అన్నిటిని అందరికి పంచుతారు. అందరికి పంచాకా ఇక అందరు కలిసి సహపంక్తిగా భోజనం చేస్తారు. ఈ నైవేద్యాల్లో ఏదైనా పాచిపోతే ఏదైనా కీడు జరుగుతుందని, బాగుంటే ఏమి కాదని విశ్వసిస్తారు.
ఇక భోజనాలు చేసాక ఆపై అందరూ కలిసి ఒక చోట కూర్చొని చర్చించుకొని, మరోసారి ఇప్ప చెట్టు వద్దకు వెళతారు. ఇప్పచెట్టు శివ్వ కు మోక్కుకొని, అక్కడి పరిసర ప్రాంతాల్లో అడవిలో లభించే వివిధ రకాల మొక్కలు, ఆకులు, తీగలు, వన మూలికలను సేకరిస్తారు. ఈ వన మూలికలను తీసుకొని అందరూ ఒక వరుస క్రమంలో నడుస్తూ తమ తమ ఇళ్ళకు చేరుకుంటారు.
ఈ వన మూలికలను తమకు ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు వీటితో పొగ బెట్టడం లేదా ఇతర ఔషధ గుణాలు కలిగిన మొక్కల ఆకుల రసాన్ని వినియోగిస్తారు. దీంతో ఈ సాంప్రదాయం కార్యక్రమం పూర్తవుతుంది. ఇలా తమ పూర్వ కాలం నుంచి తమ పెద్దలు పాటిస్తున్న ఆచారాన్ని ప్రతియేటా నిర్వహిస్తున్నామని ఆదివాసీలు చెబుతున్నారు.