Asifabad Tiger Reserve Issue | సిర్పూర్: టైగర్ కన్జర్వేషన్ రిజర్వు జీవో నం.49ను శాశ్వతంగా రద్దు చేయాలని సోమవారం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ తదితరులు మహాధర్నాకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధి కోసం తాత్కాలికంగా జీవో 49 రద్దు చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని బీఆర్ఎస్, బీజేపీ విమర్శిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ టైగర్ జోన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 49 శాశ్వతంగా రద్దు చేస్తూ ప్రకటన చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆందోళన వ్యక్తమవుతోది. ఇటీవల ఉమ్మడి జిల్లా బంద్‌కు సైతం తుడుందెబ్బ ఇచ్చిన పిలుపు మేరకు చాలా వర్గాలు సహకరించాయి.

మహాధర్నాకు బీజేపీ ఎమ్మెల్యే మద్దతు

తాజాగా సోమవారం నాడు ఆసిఫాబాద్ కలెక్టరేట్ ఎదుట మహాధర్నాకు ఆదివాసీ సంఘాలు, తుడుందెబ్బ ఇచ్చిన పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ (BJP) పూర్తి మద్దతు తెలిపింది. ఈ మహాధర్నాకు సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు (Palvai Harish Babu) ఒక ప్రకటనలో మద్దతు తెలిపారు. సోమవారం ఉదయం 10 గంటలకు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ ముందు జరిగే మహాధర్నాలో తనతో పాటు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులందరూ పాల్గొంటారని తెలిపారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ మరియు సిర్పూర్ నియోజక వర్గాల నుండి ప్రజలు పార్టీలకు అతీతంగా ఈ మహాధర్నాకు తరలి రావాలని పిలుపునిచ్చారు.

జీవో 49 రద్దు చేసే వరకు పోరాటం

కేవలం ఆదివాసులకే కాకుండా గిరిజనేతరులకు కూడా ఈ టైగర్ కంజర్వేషన్ రిజర్వు వలన పెను ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు. అందువల్ల జీవో నం.49ను తెలంగాణ ప్రభుత్వం శాశ్వతంగా రద్దు చేసే వరకు పోరాటాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు. మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్ తో ముడిపడి ఉన్న ఈ సమస్యపై కలెక్టరేట్ ముందు జరిగే మహాధర్నాకు ప్రజలందరూ హాజరై విజయవంతం చేయాలని పాల్వాయి హరీష్ బాబు కోరారు.