Khanapur MLA Vedma Bhojju Patel | కడెం: కాంగ్రెస్ నేత, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అటవీశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారంటూ, పోలీసులు అటవీశాఖ అధికారులతో వెళ్లకూడదని సూచించారు. ఒకవేళ వారి వెంట పోలీసులు వెళ్తే పోడు రైతులు ఆగ్రహంతో ఉన్నారని.. ఇప్పటికే అటవీ అధికారుల వేధింపులతో ఎప్పటికైనా వారు తిరగబడతారన్నారు. అటవీశాఖ అధికారుల కన్నా ముందు పోలీసులే దెబ్బలు తింటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అటవీ అధికారులకు పోలీసులు సహకరించవద్దు..
నిర్మల్ జిల్లా కడెం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్, నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్,అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి హరి కిరణ్ ఐఏఎస్ లతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఖనాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. పోడు భూముల విషయంలో అటవీ శాఖ అధికారులకు పోలీసులు సహకరించవద్దన్నారు. అటవీ అధికారులతో వెళితే ముందుగా పోడు రైతులతో దెబ్బలు తినేది పోలీసులేనన్నారు. ఉన్నతాధికారుల అనుమతులతోనే అటవీశాఖ అధికారుల వద్దకు వెళ్లాలనీ కోరారు.
రైతులను ఇబ్బంది పెడితే సహించేది లేదు
తాను మాత్రం రైతుల పక్షాన ఉంటానని ఎమ్మెల్యే తేల్చి చెప్పారు. అటవీ ప్రాంతాల్లో అనేక గ్రామాలున్నాయనీ, ఆదివాసీలతో పాటు గిరిజనేతరులు సైతం ఉన్నారని, గొర్రెలు, ఆవులు, మేపే వారికి, కావచ్చు...ఇతరులకు, పోడు రైతులకు అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తే సహించనన్నారు. ఇప్పటికైనా అటవీశాఖ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దని కోరారు.
టైగర్ జోన్ పరిధిలో వాహనాల రాకపోకలకు, ప్రయాణికులకు ఇబ్బందులు పెట్టొద్దన్నారు. మొన్న సిరిచెల్మ రేంజ్ పరిధిలో ముల్తానీలు అటవీ అధికారులను తరిమికొట్టారని, పోడు రైతుల జోలికెళ్తే ఈ ప్రాంతంలో సైతం వారు ఆగ్రహంతో ఉన్నారని తప్పకుండా వారు తిరుగుబాటు చేస్తారన్నారు. నిన్న జన్నారంలో ఇదే సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా నేడు శనివారం సైతం కడెం మండలంలో అటవీ శాఖ అధికారులపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొలుసులు అటవీ శాఖ అధికారులకు సహకరించవద్దన్నారు.