Sirpur MLA Palvai Harish Babu | ఆసిఫాబాద్: కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ అటవీ కార్యాలయం ముందు రెండు రోజులుగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. సిర్పూర్ నియోజకవర్గంలో అటవీ శాఖ అధికారుల వేధింపులు అధికమయ్యాయని, ఇష్టారీతిన రైతులు, గ్రామస్తులను కొడుతున్నారని, ఇటివలే ఓ రైతుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆ అటవీ శాఖ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేపట్టారు.
రెండో రోజు నిరాహార దీక్ష శిబిరంలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దీక్ష కు మద్దతుగా ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ సంఘీభావం తెలిపారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు నుండి ఎమ్మెల్యే హరీష్ బాబు కు ఫోన్ రావడంతో వారితో మాట్లాడారు. హైదరాబాద్ నుండి పిసిసిఎఫ్ ఎలుసింగ్ మెరు ఇద్దరు డిఎఫ్ఓ అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి అధికారులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఆ అటవీ అధికారులను త్వరలోనే సస్పెండ్ చేస్తామని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అమరణ నిరాహార దీక్ష విరమిస్తానన్నారు. దీంతో అదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ ఎమ్మెల్యే హరీష్ బాబు కు నిమ్మరసం అందించి దీక్షను విరమింప చేశారు.
ఈ సందర్భంగా అదిలాబాద్ ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారులు అతి ఉత్సాహం ప్రదర్శిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజలు కట్టే పన్నుతో జీతాలు తీసుకుంటున్న ఫారెస్ట్ అధికారులు ప్రజా వ్యతిరేకులుగా మారితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
బాధితులు తిరగబడితే పరిస్థితి చేజారుతుంది..
ఈ సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ.. ఫారెస్ట్ అధికారులపై బాధితులు తిరగబడితే పరిస్థితి చేయిజారి పోతుందని, అటవీ అధికారులు తిరగ లేని పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. సీనియర్ మంత్రి శ్రీధర్ బాబు హామీ మేరకు దీక్ష విరమిస్తున్నామని, ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకొనడమే కాకుండా అటవీ శాఖ అధికారులు చేస్తున్న అక్రమాలపై హైదరాబాదులో సమీక్షా సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు.
గత రెండు రోజులుగా పీసీసీఎఫ్ ఏలుసింగ్ మేరు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం మరియు కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్లో విచారణ జరుపుతున్నారని, అలాగే రేంజ్ లలో విజిలెన్స్ విచారణ ప్రారంభమైందని, అక్రమాలకు పాల్పడిన అధికారులను ఎవర్నీ వదిలేది లేదని హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే కోనప్ప ఆధ్వర్యంలో సిర్పూర్ నియోజకవర్గంలో టేకు స్మగ్లింగ్ మొదలైందని, ఆ టేకు స్మగ్లింగ్ ను ఫారెస్ట్ అధికారులు కొనసాగించడం దారుణం అన్నారు. ఇటిక్యాలపాడు గ్రామస్తుల వద్ద పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసి వారికి న్యాయం చేయలేదని, వారికి ఎంపీ సహాయంతో న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, రాష్ట్ర ఓబీసీ మోర్చ కార్యవర్గ సభ్యులు గోలెం వెంకటేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి ధోని శ్రీశైలం, సిర్పూర్ అసెంబ్లీ కన్వీనర్ గొల్లపల్లి వీరభద్ర చారి, మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు వలుపదాసు శ్రీదేవి, జిల్లా కార్యదర్శి బండి రాజేందర్ గౌడ్, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు చప్పిడి సత్యనారాయణ, మండల అధ్యక్షులు ఎల్ములే శంకర్, వానూ పటేల్, తదితరులు పాల్గొన్నారు.