Kumram Bheem Asifabad District:కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గంలో బీజేపీకి షాక్ తగిలింది. బిజెపిలోని ముఖ్య నాయకులు ఎమ్మెల్యే హరీష్ బాబు వ్యవహార శైలి నచ్చక పార్టీకి రాజీనామా చేశారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో జరిగిన సిర్పూర్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో భాగంగా, రాష్ట్ర బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సమక్షంలో సిర్పూర్ నియోజకవర్గానికి చెందిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొంగ సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు బోలెం వెంకటేష్ ఇతర బిజెపి నాయకులు బిఆర్ఎస్‌లో చేరారు. బిఆర్ఎస్ పార్టీ హయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వలేదని, కాంగ్రెస్ హయాంలో రైతులు యూరియా కోసం అధికారుల కాళ్లు మొక్కే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
సిర్పూర్ బిజెపి ఎమ్మెల్యే సిర్పూర్ నియోజకవర్గాన్ని మహారాష్ట్రలో కలపాలని మాట్లాడడం విడ్డూరంగా ఉందని,అలాంటి నాయకుల వల్ల ఏం లాభం జరగదని ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కచ్చితంగా అధికారంలోకి రానుందని, స్థానిక సంస్థల్లో గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇంతకాలం ఆంధ్ర దోపిడి దారుల చేతిలో సిర్పూర్ ఆగమైందని,అభివృద్ధికి నోచుకోలేదన్నారు.కానీ రాబోయే రోజుల్లో కేసిఆర్,కెటిఆర్ సూచనల మేరకు సిర్పూర్‌లో గులాబీ జెండా ఎగురవేసి సిర్పూర్‌ను అభివృద్ధి చేసుకుందామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్,బిజెపిని చిత్తుగా ఓడించాలన్నారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గం బిఆర్ఎస్ నాయకులు డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నాయకత్వంలోనే సిర్పూర్ అభివృద్ధి చెందుతుందని నమ్ముతుననామని కొంగ సత్యనారాయణ తెలిపారు. బిజెపి,కాంగ్రెస్ నాయకత్వంలో రైతులు,విద్యార్థులు,మహిళలకు తగిన న్యాయం జరగడం లేదన్నారు. త్వరలోనే నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలను కూడా బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు చేస్తామని, రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా బిఆర్ఎస్ అభ్యర్థిగా డా.ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని గెలిపించుకుంటామని తెలిపారు.