Telangana Latest News:కాంగ్రెస్‌లో చేరిన పది మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపాలని స్పీకర్ కార్యాలయం నిర్ణయించింది. దీంతో తెలంగాణలో రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ పరిణామం బీఆర్‌ఎస్-కాంగ్రెస్ పార్టీల మధ్య మరోదఫా రాజకీయ యుద్ధానికి తెరలేపే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో, ఫిరాయింపుల నిరోధక చట్టం అమలు అవుతుందా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, స్పీకర్ పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేస్తే, ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

స్పీకర్‌కు కాలపరిమితి నిర్ణయించిన సుప్రీంకోర్టు

కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని, ఈ విషయంలో స్పీకర్ కార్యాలయం జాప్యం చేస్తుందని బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం కీలకమైన తీర్పునిచ్చింది. రాజకీయ ఫిరాయింపు కేసులపై స్పీకర్ జాప్యం చేయడం తగదని, అలా చేస్తే న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని స్పష్టం చేసింది.

ఒక పార్టీ ఎమ్మెల్యే మరో పార్టీలో చేరితే, అతని అనర్హతపై స్పీకర్ సహేతుకమైన కాలపరిమితిలోగా నిర్ణయం తీసుకోవాలని, అది మూడు నెలలకు మించకుండా ఉండాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ తీర్పుపై తెలంగాణ స్పీకర్ కార్యాలయం స్పందించింది. ఒకవేళ ఇంకా ఆలస్యం జరిగితే, బీఆర్‌ఎస్ నేరుగా సుప్రీంకోర్టు తలుపులు మరోసారి తట్టే అవకాశం కలుగుతుంది. అప్పుడు నిర్ణయం అత్యున్నత న్యాయస్థానం చేతుల్లోకి వెళుతుంది. ఈ కారణంగానే స్పీకర్ కార్యాలయం బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయాలని నిర్ణయించింది. ఇవాళో రేపో ఈ మేరకు స్పీకర్ నుంచి పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు అందనున్నాయి.

స్పీకర్ నోటీసుల తర్వాత ఏం జరుగుతుంది?

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు అందిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ నోటీసులను అందుకున్న తర్వాత, ఎమ్మెల్యేలు లిఖితపూర్వకంగా స్పీకర్ ప్రశ్నలకు సమాధానాలు పంపాల్సి ఉంటుంది. పార్టీ మారడానికి గల కారణాలను వివరించాల్సి ఉంటుంది. ఫిరాయింపుల చట్టంలోని లొసుగులను ఆధారంగా చూపించే అవకాశాలు ఉన్నాయి. అంటే, తమ పార్టీ చీలిందని, చీలిక వర్గమైన తమకే మెజారిటీ ఉందని, తమ సభ్యత్వం చెల్లుబాటు అవుతుందని వాదించే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ఈ అంశంపై స్పీకర్ ఎమ్మెల్యేల వాదనలను ఒక్కొక్కరిగా పిలిచి వినవచ్చు. వారి వాదనల అనంతరం, చట్టపరమైన అంశాలను పరిశీలించిన తర్వాత స్పీకర్ అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టవచ్చు. ఇక సుప్రీంకోర్టు మార్గదర్శకాలను బట్టి త్వరలోనే దీనిపై స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

మరికొంతమంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఆకర్షిస్తుందా?

అయితే, ఎమ్మెల్యేల వాదనలను వినేందుకు తగినంత సమయం స్పీకర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ లోగా రాజకీయ పరిణామాలు ఎలాగైనా మారవచ్చు. అంటే, మరికొంతమంది ఎమ్మెల్యేలను అధికార పార్టీ తన వైపు ఆకర్షించే అవకాశం ఉంది. అదే జరిగితే, అసెంబ్లీలో చీలిక వర్గం మెజారిటీ తమదేనని, బీఆర్‌ఎస్ పార్టీ తమదేనని చీలిక వర్గం చెప్పుకునే అవకాశం ఉంది. సరిగ్గా మహారాష్ట్ర అసెంబ్లీలో శివసేన పార్టీని చీల్చినట్లు బీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్ పార్టీ చీల్చే అవకాశాలు ఉన్నాయి. అయితే, బీఆర్‌ఎస్ గతంలో ఇలా చేసినందుకే పలుమార్లు ఆ పార్టీని కాంగ్రెస్ నేతలు తప్పుబట్టారు. మళ్ళీ అదే పనిని కాంగ్రెస్ చేస్తే నైతికంగా ప్రజల్లో పలుచన అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ స్పీకర్ కఠిన నిర్ణయం తీసుకుంటే, పది మంది ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు అవుతుంది. దీంతో, పది నియోజకవర్గాల్లో తిరిగి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుంది.

స్పీకర్ నిర్ణయంతో మారనున్న తెలంగాణ రాజకీయం

స్పీకర్ పది మంది ఎమ్మెల్యేలపై విచారణ తర్వాత వేటు వేయకపోతే అది కాంగ్రెస్‌కు లాభిస్తుంది. అధికార పార్టీ ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతుంది. ఇదే అదునుగా మరికొంతమంది ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీ లాక్కునే అవకాశాలు ఉన్నాయి. స్పీకర్ సభ్యత్వం రద్దు చేయకుండా మరికొంత కాలం జాప్యం చేసినా కాంగ్రెస్‌కు అది లాభమే. అయితే, ఎక్కువ కాలం నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఉండలేని పరిస్థితి ఉంది. అదే చేస్తే, మళ్ళీ సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకునే అవకాశం ఉంది.

ఇక, బీఆర్‌ఎస్ విషయానికి వస్తే, స్పీకర్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయకపోతే అది పెద్ద ఎదురుదెబ్బే. తిరిగి న్యాయస్థానం మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వస్తుంది. దీనిపై న్యాయస్థానం నిర్ణయం తీసుకునేలోగా పుణ్య కాలం గడిచిపోవచ్చు. మరికొంతమంది ఎమ్మెల్యేలు చేజారిపోవచ్చు. పార్టీ మనుగడ ప్రశ్నార్థకం కావచ్చు. కార్యకర్తల మనోధైర్యం దెబ్బతింటుంది. పార్టీ నాయకత్వంపై విశ్వాసం సన్నగిల్లుతుంది. ఇక, సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని స్పీకర్ నిర్ణయానికి వ్యతిరేకంగా ఒకవేళ పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తే, అప్పుడు మాత్రం బీఆర్‌ఎస్‌కు నైతిక బలం చేకూరుతుంది. పది నియోజకవర్గాల్లో ఎన్నికల్లో సానుభూతితో పోటీ దిగే అవకాశం ఉంటుంది.

స్పీకర్ పది మంది ఎమ్మెల్యేల అనర్హతపై తీసుకునే నిర్ణయం కేవలం చట్టపరమైన నిర్ణయం మాత్రమే కాకుండా, తెలంగాణ రాజకీయాలను మార్చివేసే ప్రక్రియగా చూడాల్సిన అవసరం ఉంది. అధికార, ప్రతిపక్షాల రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఓ ప్రక్రియగా దీన్ని చెప్పవచ్చు.