Telangana Elections 2024: నిజామాబాద్ లో ఎంపీ అభ్యర్థిగా ఉన్న జీవన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. నిజామాబాద్ లో పెండింగ్ లో ఉన్న పనులన్నీ చేసే పూచీ తనదే అని హామీ ఇచ్చారు. బోధన్ షుగర్ ఫ్యాక్టరీని కూడా త్వరలో తెరిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. వీలైతే సెప్టెంబరు 17లోపు చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పారు. నిజామాబాద్ లో జరిగిన జనజాతర ఎన్నికల ప్రచార సభలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.


గతంలో 2014 ఎన్నికల సమయంలో కవిత ఎంపీగా ఎన్నికకాక ముందు వంద రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి చేయలేదని అన్నారు. అందుకే చైతన్యవంతం గల నిజామాబాద్ రైతులు కవితను, ఆమె జెండాను 100 మీటర్ల లోతులో పాతిపెట్టి.. 2024 ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా భయపడే పరిస్థితికి తెచ్చారని అన్నారు. 


వెనకటికి ఎవడో తాతకు దగ్గు నేర్పినట్లుగా రైతులను మభ్యపెట్టేటట్లుగా స్పైసెస్ బోర్డును పసుపు బోర్డుగా నమ్మబలుకుతున్నారని అన్నారు. నిజామాబాద్ రైతులకు అండగా వారి గళాన్ని పార్లమెంటులో వినిపించడం కోసం జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. రాబోయే రోజుల్లో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రభుత్వం ఏర్పడుతుందని.. ఆ ప్రభుత్వంలో జీవన్ రెడ్డి వ్యవసాయ మంత్రి అవుతారని రేవంత్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ అధిష్ఠానాన్ని ఒప్పించి మరీ జీవన్ రెడ్డిని వ్యవసాయ మంత్రిని చేసే బాధ్యత నాదే అని అన్నారు. చక్కెర కర్మాగారాన్ని, పసుపు బోర్డును తెచ్చే సత్తా జీవన్ రెడ్డికి ఉందని అన్నారు.


ఆదిలాబాద్ లోనూ..
అంతకుముందు ఆదిలాబాద్ జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ‘‘త్వరలో రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాం. కొమురం భీం ఆశయ సాధనకు కృషి చేస్తాం. ఇంద్రవెళ్లి ప్రాంతంలో స్మృతి వనం నిర్మిస్తాం. కుప్తి ప్రాజెక్టును పూర్తి చేస్తాం.. కడెం ప్రాజెక్టుకు మరమ్మత్తులు చేశాం. తుమ్మడి హట్టి వద్ద ప్రాణహిత నదిపై చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తాం. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. దానికి బాబా సాహెబ్ అంబేడ్కర్ పేరు పెడతాం. కాంగ్రెస్ ను పడగొట్టిన, ఓడ గొడితే పేద ప్రజలకు నష్టం. గల్లీలో ఉన్న కేసీఆర్, ఢిల్లీలో ఉన్న మోదీ మా ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తున్నారు. కేసీఆర్ ను మోదీని వంద అడుగుల లోతులో బొందపెట్టాలి, నడి రోడ్డులో ఉరి తీయాలి అన్నారు. వీళ్లిద్దరూ తోడు దొంగలు. వీళ్ళను బండ కేసి కొట్టాలి.


ఆదిలాబాద్ లో ఇక్కడి విద్యార్థుల కోసం యూనివర్సిటీ ఏర్పాటు చేస్తాం. ఆదిలాబాద్ లో సీసీఐ సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేస్తాం. ఆర్టీసీ బస్సులో మహిళకు ఉచిత ప్రయాణం అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ది. ఇప్పటిదాకా రూ.1300 కోట్ల రూపాయలను ఆర్టీసీకి చెల్లించాం. రాజీవ్ ఆరోగ్య శ్రీని కేసీఆర్ రిమ్మ మత్తులో నిర్లక్ష్యం చేశారు. మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మోదీ కూలగొట్టాలని చూస్తున్నాడు. 40 లక్షల కుటుంబాలకు గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్నాం. ప్రతి పేద కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత పథకాన్ని చూసి కేసీఆర్, మోదీ కండ్లు మండుతున్నాయి. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోతే ఈ పథకాలు అమలు అవుతాయా ఆలోచించండి’’ అని రేవంత్ రెడ్డి మాట్లాడారు.