Adilabad News Today | బ్రిటీషు వారిపై పోరాటం జరిపిన తొలి గోండు పోరాట యోధుడు మర్సుకోల రాంజీగోండ్.. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా జంగ్ సైరన్ మోగించాడు. చివరి శ్వాస వరకు తిరుగుబాటు చేసి, చరిత్ర పుటల్లో తొలి ఆదివాసీ అమరవీరుడిగా గుర్తింపు పొందాడు. నేడు రాంజీగోండ్ వర్ధంతి సందర్భంగా abp దేశం ప్రత్యేక కథనం.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ కు చెందిన నిరుపేద ఆదివాసీ కుటుంబంలో జన్మించాడు మర్చుకోల రాంజీగోండ్. చిన్నప్పటి నుంచే ధైర్యసాహసాలు కనబరిచేవాడు. పదహారేళ్లు కూడా పూర్తికాక ముందే తమ జాతిపై పాలకులు చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తాడు. తమ అస్థిత్వాన్ని కాపాడుకోవడానికి కలిసి రావాలని ఇచ్చిన పిలుపుతో ఆదివాసీలు ఏకమయ్యారు. సంఘటిత పోరాటంతో శత్రువులపైకి దూసుకెళ్లాడు. క్రమంగా పట్టుసాధించారు. 1836–60 కాలంలో మధ్య భారతదేశంలో గోండ్వానా ప్రాంతంలో భాగమైన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఆదివాసీలకు మర్సుకోల రాంజీగోండ్ నాయకత్వం వహించేవాడు. మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్, అప్పటి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో నివసించే అనేకమంది గిరిజన తెగల సమూహాలతో గోండ్వానా రాజ్యం ఉండేది. ఇది బ్రిటిష్‌ పాలకులు రాక పూర్వమే ఏర్పడింది. గోండుల పాలన సా.శ. 1240–1750 వరకు సుమారు 5శతాబ్దాలపాటు కొనసాగింది.

బ్రిటిష్, నైజాం పాలకులను ముప్పతిప్పలు పెట్టి..

9మంది గోండురాజులలో చివరివాడైన నీల్‌కంఠ్‌షా (సా.శ. 1735– 49) ని మరాఠీలు బంధించి చంద్రాపూర్‌ను ఆక్రమించుకున్నారు. దీంతో గోండ్వానా ప్రాంతం మరాఠీల ఆధీనమైంది. అనంతర కాలంలో ఈ ప్రాంతాన్ని ఆంగ్లేయులు దక్కించుకున్నారు. అప్పటి నుంచి గోండులపాలన అంతమై, ఆంగ్లేయులు, హైదరాబాద్‌ నైజాం పాలన ఆరంభమైంది. వీరి దౌర్జన్యాలు ఊర్లను దాటి రాంజీగోండ్ నాయకత్వంలో వెయ్యిమంది రోహిల్లాలు, గోండులు కలిసి నిర్మల్‌ సమీపంలోని అడవులు, కొండలు, చెరువులను ఆధారంగా చేసుకుని బ్రిటిష్, నైజాం పాలకులను ముప్పతిప్పలు పెట్టి, గొలుసుకట్టు చెరువుల నీళ్లు తాగించారు. నిర్మల్‌ కలెక్టర్‌ హైదరాబాద్‌లోని రెసిడెంట్‌కు సమాచారం ఇచ్చాడు. అతను ఆదేశాల మేరకు కర్ణాటక ప్రాంతంలోని బల్లారిలో గల స్వదేశీదళం కల్నల్‌ రాబర్ట్‌ ఆధ్వర్యంలో నిర్మల్‌ ప్రాంతానికి చేరుకుంది. వారు ఆధునిక ఆయుధాలతో వచ్చినా రెండుసార్లు ఆదివాసీ వీరులు ఇక్కడి భౌగోళిక పరిస్థితులను ఆసరాగా చేసుకుని ఓడించారు.

మహా మర్రిచెట్టుకు 1000 మంది ఉరి

ఈ ప్రాంతంలో వీరిని ఓడించడం కష్టమని ఆనాటి పాలకులు దొంగదెబ్బతీసి, గోదావరినది సమీపంలోని సోన్‌ ప్రాంతంలో రాంజీగోండుతో సహా వెయ్యిమందిని పట్టుకున్నారు. వారందరినీ ఈడ్చుకుంటూ తీసుకువచ్చి, నిర్మల్‌ శివారులో ఉన్న ఊడలుదిగిన మహా మర్రిచెట్టుకు ఉరితీశారు. ఈఘటన 1860 ఏప్రిల్‌ 9న జరిగినట్లు చరిత్రకారులు చెబుతారు. అలా.. వెయ్యిమందిని ఉరితీసినందునే ఆ మర్రిచెట్టు వెయ్యిఉరుల మర్రిగా పేరొందింది. ఆచెట్టు 1995లో గాలివానకు నేలకొరిగింది. గత కొన్ని శతాబ్దాలుగా రాంజీగోండ్‌ పోరాటాన్ని, వెయ్యిమంది అమరుల త్యాగాల్ని ఏ పాలకులు గుర్తించలేదు. తెలంగాణ ఉద్యమం సమయంలో పలు సంఘాల నాయకులు కలిసి నిర్మల్‌ పట్టణంలో చైన్‌గేట్‌ వద్ద రాంజీగోండు విగ్రహం, వెయ్యిఉరుల మర్రి సమీపంలో ఓ అమరవీరుల స్థూపాన్ని నిర్మించారు. గతంలో నిర్మల్‌లో రాంజీగోండు పేరిట మ్యూజియం, అమరుల స్మారకార్థం ఓ అమరధామం నిర్మిస్తామని చెప్పినా.. అమలుకు నోచుకోలేదు. 

దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చర్చ

2021 సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా నిర్మల్‌ కు వచ్చారు. ఇక్కడి రాంజీగోండు సహా వెయ్యిమంది అమరులకు నివాళులర్పించారు. దీంతో రాంజీ సహా వెయ్యిమంది అమరుల ప్రాణత్యాగాల చరిత్ర ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అలాగే 2024 ఫిబ్రవరి 21న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. రాంజీగోండ్ స్మృతి కేంద్రం ఏర్పాటు కోసం శంకుస్థాపన చేశారు. ఆ తరువాత అక్కడ ఇప్పటికీ వారి స్మారకార్థం ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. చరిత్ర పుటల్లో, పాఠ్యపుస్తకాల్లో ఎక్కడా.. వారికి చోటివ్వకపోవడం శోచనీయమని, బ్రిటీషు సైన్యానికి వ్యతిరేకంగా మర్సుకోల రాంజీగోండ్ సాగించిన పోరాటం అమోఘం.

ఆయన చరిత్రను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందనీ రాంజీగోండ్ ఆశయ సాధన సమితి చైర్మన్ మర్సుకోల తిరుపతి డిమాండ్ చేస్తున్నారు. మర్సుకోల రాంజీగోండ్ పోరాటాన్ని భావితరాలకు అందించాలనే సదాశయంతో 2004 సంవత్సరంలో ఉట్నూరు మండలంలోని లక్కారం పంచాయతీలో రాంజీగోండ్ నగర్ ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ రాంజీ గోండ్ భవన్ ను నిర్మించారు. ఆయన పేరుతో రాంజీగోండ్ చౌక్ గా నామకరణం చేశారు. అలాగే పాఠ్యపుస్తకాల్లోను ఆయన చరిత్రకు స్థానం కల్పించాలని, ట్యాంక్ బండ్ పై మర్సుకోల రాంజీ గోండ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.