3 రోజుల పాటు 64 కిలోమీటర్లు పాదయాత్ర
ఏఐసీసీ నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రూట్ మ్యాప్ ఖరారైంది. జిల్లాలో 3 రోజుల పాటు రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది. సంగారెడ్డి జిల్లా శంకరంపేట మీదుగా నిజాంసాగర్ మండలంలోని నర్సింగరావు పల్లి చౌరస్తాకు నవంబరు 6 లేదా 7న చేరుకునే అవకాశముందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో 15 రోజుల పాటు 375 కి.మీ. కొనసాగనుండగా.. జిల్లాలో మూడు రోజుల్లో 64 కి.మీ. మేర ఉండనుంది.


యాత్ర సక్సెస్ చేసేందుకు జిల్లా నేతల కసరత్తు..
భారత్ జోడో యాత్ర సక్సెస్ చేసేందుకు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 16న పిట్లం మండల కేంద్రంలో ముఖ్యనేతల సమావేశం నిర్వహిస్తున్నారు. ఏఐసీసీ, టీపీసీసీ ముఖ్య నేతలు హాజరవుతారని జిల్లాలోని నర్సింగరావుపల్లి చౌరస్తాలోకి రాహుల్ యాత్ర ప్రవేశిస్తుంది. పిట్లం మండంలోని చిన్నకొడపగల్ పెద్దకొడపగల్.. జుక్కల్ క్రాస్ రోడ్డు, బిచ్కుంద మండలంలోని మేనూర్, మద్నూర్ మీదుగా మహారాష్ట్రలోకి వెలుతుంది. 
జోడో యాత్రను విజయవంతం చేయడంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ నాయకులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 3 రోజుల పాటు యాత్ర కొనసాగనున్న నేపథ్యంలో 3 ప్రాంతాల్లో బహిరంగ సమావేశాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు జిల్లా నాయకులు. పిట్లం, మేనూర్, బిచ్కుందలో నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.


ఈ నెల 16న జరిగే ముఖ్యనేతల సమావేశంలో ఏ రోజు ఏ నియోజకవర్గం నేతలు పాల్గొనాలనేది చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో పాటు సిరిసిల్ల, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన కార్యకర్తలు, ప్రజలు పెద్దఎత్తున పాల్గొనేలా చూడాలని నిర్ణయించారు. ఇందుకు నియోజకవర్గానికి నేతకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి జిల్లాలో పూర్వ వైభవం తెచ్చేందుకు, కార్యకర్తల్లో జోష్ నింపేందుకు పార్టీ నాయకులు కసరత్తు మొదలు పెట్టారు. రాహుల్ యాత్రకు భారీ ఏర్పాట్లు చేసే దిశగా ముందుకు వెళ్తున్నారు జిల్లా నేతలు.


ఉదయం ఏపీలోకి, సాయంత్రం మళ్లీ కర్ణాటకకు 
కాంగ్రెస్ నేత రాహుల్ గాందీ చేపట్టిన జోడో పాదయాత్ర నిన్న (అక్టోబర్ 14న) కర్టాటక లో నుంచి ఆంద్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గంలోని డీ హీరేహాల్ మండలం కనుగొప్ప గ్రామంలోని మారెమ్మ దేవాలయం  వద్ద నుంచి ఉదయం 7-30 నిమిషాలకు ప్రారంభమైంది. మాదన హళ్లి మీదుగా డీ హిరేహాల్ లో మారెమ్మ దేవాలయం వద్ద 11-30 లకు పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. అనంతరం డీహిరేహాల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమై ఓబుళాపురం గ్రామం మీదుగా సాయంత్రం 7 గంటలకు బళ్లారి జిల్లాలో కర్ణాటకలోకి రాహుల్ గాందీ జోడో పాదయాత్ర ఎంటర్ కానుంది.


23న తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర 
భారత్‌ జోడో యాత్ర అతి త్వరలో తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఈ నెల 23 వ తేదీన భారత్ జోడో యాత్ర తెలంగాణలో అడుగు పెట్టనుంది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి యాత్ర తొలుత ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రానికి మక్తల్‌ చేరుకొని దీపావళి సందర్భంగా 24, 25 తేదీల్లో పాద యాత్రకు రాహుల్‌ గాంధీ రెండు రోజుల పాటు విరామం తీసుకోనున్నారు. ఆయన బస కూడా అక్కడే ఉండనుంది.


Also Read: ఏపీలోకి ప్రవేశించిన రాహుల్ గాందీ జోడో యాత్ర, మళ్లీ సాయంత్రం కర్ణాటకలోకి