కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాందీ చేపట్టిన జోడో పాదయాత్ర నేడు కర్టాటక లో నుంచి ఆంద్రప్రదేశ్ లోకి ప్రవేశించింది. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజక వర్గంలోని డీ హీరేహాల్ మండలం కనుగొప్ప గ్రామంలోని మారెమ్మ దేవాలయం వద్ద నుంచి ఉదయం 7-30 నిమిషాలకు ప్రారంభమైంది. మాదన హళ్లి మీదుగా డీ హిరేహాల్ లో మారెమ్మ దేవాలయం వద్ద 11-30 లకు పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు. అనంతరం డీహిరేహాల్ లో కాంగ్రెస్ పార్టీ నాయకులతో రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమై ఓబుళాపురం గ్రామం మీదుగా సాయంత్రం 7 గంటలకు బళ్లారి జిల్లాలో కర్ణాటకలోకి రాహుల్ గాందీ జోడో పాదయాత్ర ఎంటర్ కానుంది.
18న మళ్లీ ఏపీలోకి ఎంట్రీ
ఇవాళ 12 కి.మీ పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగనుంది. ఈ నెల 18వ తేదీ నుండి రాహుల్ గాంధీ యాత్ర మళ్లీ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగనుంది. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో శ్రీ సత్యసాయి జిల్లాలోని ఓబులాపురం నుండి రాహుల్ పాదయాత్ర ఏపీలోకి ప్రవేశించి, మళ్లీ ఇదే రోజు సాయంత్రానికి కర్ణాటకలోకి ప్రవేశిస్తుంది.
ఏపీపీసీసీ చీఫ్ శైలజానాథ్, కాంగ్రెస్ నేతలు కేవీపీ రామచంద్రరావు, తులసీరెడ్డి వంటి నేతలు రాహుల్ యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. మాజీ పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డికూడా ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. రాజకీయాలకు మూడేళ్లుగా రఘువీరారెడ్డి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన స్వగ్రామం నీలకంఠాపురంలో వ్యవసాయ పనులు చేసుకుంటూ ఆయన ఉన్నారు.
23న తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర
భారత్ జోడో యాత్ర అతి త్వరలో తెలంగాణలోకి ప్రవేశించనుంది. ఈ నెల 23 వ తేదీన భారత్ జోడో యాత్ర తెలంగాణలో అడుగు పెట్టనుంది. నారాయణపేట జిల్లా శివారులోని కృష్ణ మండలం గూడవల్లూరు గ్రామంలోకి యాత్ర తొలుత ప్రవేశిస్తుంది. ఆ రోజు సాయంత్రానికి మక్తల్ చేరుకొని దీపావళి సందర్భంగా 24, 25 తేదీల్లో పాద యాత్రకు రాహుల్ గాంధీ రెండు రోజుల పాటు విరామం తీసుకోనున్నారు. ఆయన బస కూడా అక్కడే ఉండనుంది.
మళ్లీ ఈ నెల 26 నుంచి మక్తల్‌లో తిరిగి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. అయితే, రాహుల్ గాంధీ తెలంగాణలోకి ప్రవేశించాక, యాత్ర కొనసాగాల్సిన రూట్ మ్యాప్‌పై కూడా సమీక్ష జరిగింది. టీపీసీసీ కీలక నేతలు శనివారం గాంధీ భవన్‌లో ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, ఏఐసీసీ పర్యవేక్షకులు బైజు, సుశాంత్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు.
ఆలయాల సందర్శన
తెలంగాణలో ప్రముఖ దేవాలయాలు, చర్చిలు, మసీదులను రాహుల్ గాంధీ సందర్శించనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్ నగర శివారులో ఉన్న చిలుకూరి బాలాజీ దేవాలయాన్ని దర్శించుకొని స్వామి ఆశీస్సులు రాహుల్ పొందనున్నట్లు తెలుతస్తోంది. తర్వాత ఆసియా ఖండంలోనే అతి పెద్ద మెదక్ చర్చికి వెళ్తారు. హైదరాబాద్ నగరానికి 44 కిలోమీటర్ల పరిధిలో ఉన్న జహంగీర్ దర్గాను కూడా సందర్శిస్తారని భారత్ జోడో యాత్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వీటిని సందర్శించడం ద్వారా మత విభజన రాజకీయాలకు గట్టి సమాధానం ఇచ్చినట్టువుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.