ఎద్దులు రైతుల కష్టసుఖాల్లో భాగం పంచుకుంటు ఏడాదిపాటు పొలం పనుల్లో అనేకవిధాలుగా ఉపయోగపడతాయి. అయితే ఎద్దులకు మనుషుల్లా గౌరవంతో పాటు వాటికంటూ ఓ గుర్తింపు ఉండేలా పూర్వకాలం నుండి పెద్దలు ఎద్దుల పండుగను ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు. దీన్నే పోలాల పండుగ అని అంటారు. ఇంతకీ పోలాల పండుగ విశిష్టత ఎంటి? పోలాల పండుగ సందర్భంగా పురన్ పోలీ వంటకాలు ఎలా చేస్తారంటే
శ్రావణ మాసం ముగింపులో వచ్చే అమావాస్య రోజున పోలాల పండుగ (ఎద్దుల పండుగ) ను ఘనంగా జరుపుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులతో పాటు సమీపంలో ఉన్న మహరాష్ట్ర వాసులు మరాఠ సాంప్రదాయాలతో పూర్వికుల నుండి ఈ పండుగను జరుపుకుంటున్నారు. తరతరాలుగా రైతులు తమ కష్టంలో సగభాగం పంచుకుంటూ శ్రమిస్తున్న కష్టజీవులైన ఈ ఎద్దులని కుటుంబంలో భాగంగా భావిస్తారు. వేసవి చివరలో భూమిని దుక్కి దున్నే క్రమం నుండి మొదలకుని చివరకు పంట చేతికి వచ్చి, ఆ పంటలను బండిలో మోసుకుంటు ఇంటికి, మార్కెట్ కు చేరవేసే ఈ జీవులను నందిగా భావిస్తుంటారు.
అందుకే ఈ అమావాస్య రోజున పోలాల పండుగ అని పూర్వికులు పెట్టిన సాంప్రదాయం ప్రకారం పోలాల పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు ప్రతి రైతు తమ ఎద్దులు అన్నింటికి శభ్రంగా స్నానాలు చేయించి వాటి కొమ్ములకు రంగులను వేసి రంగురంగుల దుస్తులను అలంకరించి అందంగా తీర్చి దిద్ది ముస్తాబు చేస్తారు. గ్రామంలో ఉన్న పెద్ద తమ జత ఎడ్లతో పాటు ఊర్లో ఉన్న అందరు రైతుల జత ఎడ్లను ఆలయానికి తీసుకొని వెళ్తారు.
హనుమంతుడి ఆలయానికి ఎద్దులు
సాయంత్రం పూట హనుమంతుడి ఆలయం వద్దకు తీసుకొచ్చి హారతులు ఇచ్చి ప్రత్యేక పూజల నడుమ వేద మంత్రాలతో ముచ్చటగా పెళ్ళిళ్ళు జరిపిస్తారు. అచ్చం మన పెళ్ళిళ్ళు చేసిన తరహాలోనే మండపంలో వాటికి ఆలయం వద్ద నిర్వహించి అలయం చుట్టూ ఐదుసార్లు ప్రదక్షిణలు చేయిస్తారు. తర్వాత ఆలయ ఆవరణలో ఓ మామిడి తోరణం కట్టిన చోటున నిలుపుతారు. అక్కడ అందరికన్న భిన్నంగా అందంగా అలంకరించిన ఎడ్ల జతలను పెద్దల సమక్షంలో గుర్తించి వారికి బహుమతులు అందిస్తారు.
వారితో పాటు ఎడ్లజతలను తీసుకొచ్చిన ప్రతి రైతుకు ఓ తువ్వాలు లేదా కొంత నగదు రూపంలో ఇనామ్ గా అందిస్తారు. ఊరూరంతా సంబరంగా ఈ పోలాల వేడుకలను తీలకించడానికి తండోపతండాలుగా వచ్చి తిలకిస్తారు. ఆలయ ప్రాంగణంలో స్థలం లేకపోతే చుట్టుపక్కల ఇళ్లపైకి ఎక్కి ఈ వేడుకలను తిలకిస్తారు.
గ్రామ పటేల్ ఈ మామిడి తోరణాన్ని తన చేతిలో ఉన్న కర్రతో తెంచి హరహర మహాదేవ్ అని పోలాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతారు. ఈ తోరణం తెంచాకే అందరు పోలాల పండుగను జరుపుకుంటారు. తోరణం తెంచిన కర్రను గ్రామ పటేల్.. గ్రామ కొత్వాల్ కు అందించి అధికారం ఇస్తారు. అప్పటి నుండి కొత్వాల్ గ్రామంలో ఏ పని ఉన్నా ఈ అధికార కర్రను చేత పట్టుకొని గ్రామ పటేల్ కు విషయాలను చేరవేస్తుంటాడు. గ్రామ సేవకుడిగా నియమితుడైనందుకు కొత్వాల్ కు కొంత నగదు లేదా పొలంలో పంట వచ్చాక కొంత పంటను కొత్వాల్ కుటుంబానికి అందిస్తారు. ఇలా పూర్వకాలం నాటి పటేల్ - కొత్వాల్ సాంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
తోరణం తెంచిన క్రమంలో అందరు రైతులు తమ ఎడ్ల జతలను పట్టుకొని ఊరేగుతూ తమ తమ ఇళ్ళలోకి పరుగులు తీస్తు వెళ్ళి తమ ఎద్దుల జతలకు పూజలు చేస్తారు. తమ ఇళ్ళలో పోలాల సందర్భంగా చేసిన ప్రత్యేక వంటకం "పురన్ పోలీ"ని నైవేద్యంగా ఈ జత ఎడ్లకు తినిపించి వాటికి తీలకం దిద్ది.. వాటి కాళ్ళను కడిగి మొక్కుతారు. తమ కష్టాలు పంచుకుంటూ తమకు తోడు నీడగా తమ పంట కోసం కష్టపడి పనిచేస్తు అండగా నిలుస్తున్నావని ఆరోగ్యంగా ఉండి రాబోవు పంటలకు తోడుగా ఉండాలని వేడుకుంటారు. ఆపై అందరు ఒకరికొకరు కలుసుకుంటూ పోలాల పండుగ శుభాకాంక్షలు చెప్పకుంటారు. తర్వాత ఆనందంగా "పురన్ పోలీ" విందును ఆరగిస్తారు.
పురన్ పొలీ తయారీ విధానం
పురన్ పోలీ అనేది మరాఠి పదం. దీన్ని తెలుగు ప్రజలు బూరేలు అని అంటారు. ఆదిలాబాద్ జిల్లా వాసులు సమీప మహరాష్ట్ర వాసులు పూర్వకాలం నుండి ఈ సాంప్రదాయం పాటిస్తూ వస్తున్నారు. పోలాల పండుగ రోజు ఎద్దుల జతలను శివుడి నందిగా భావించి నైవేద్యంగా బూరెలను పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఈ బూరెలను మరాఠ పదంలో పురన్ పోలీ అని అంటారు.
ఇంతకీ పురన్ పోలీ ఎలా తయారు చేస్తున్నారో చూద్దాం. మహిళలు ఈ పురన్ పోలీ వంటలను ఘుమఘుమ లాడే వాసనలతో ఎంతో రుచికరంగా తయారు చేస్తున్నారు. పురన్ పోలీ తయారీకీ ముందుగా శనగ పప్పు ఉడకబెట్టి రుబ్బి అందులో చక్కెర, ఇలాచి పౌడర్ వేసి పూర్ణం తయారు చేస్తారు. గోధుమ పిండిని బాగా పిసికి వుండలా తయారు చేసి అందులో కొంత పూర్ణాన్ని వేసి రొట్టెలా తిప్పుతూ.. ఆపైన రొట్టెల పీటపై పెట్టి చపాతీలా తయారు చేస్తారు. ఆపైన కట్టెల పొయ్యిపైన పెంకుపై ఈ పూర్ణం రొట్టెను వేసి బాగా కాల్చుతారు. ఈ కాల్చిన రొట్టెను మలిచి ఓ వరుస క్రమంలో నిలబెడతారు. అంతే పురన్ పోలీ రెడీ.
ఈ పురన్ పోలీలకు తోడుగా కొంచెం పాలు వేడి చేసి అందులో కొంత నెయ్యి వేసి వడ్డిస్తారు. పురన్ పొలీతో పాటు కొంత తీపితో పాటు కొంత కారం.. పప్పుచారులా మిరియాలు వేసి ఓ రకమైన సాంబారులా తయారు చేస్తారు. దీంతో లేదా సాదారణ కూరగాయలు ఆలుగడ్డ, వంకాయ కర్రీ చేసి అన్నంతోను ఈ విందును ఆరగిస్తారు. ఇలా ఏటా పొలాల పండుగ సందర్భంగా ఎద్దులను పూజించడంతో పాటు పురన్ పోలీ వంటకాలని ఖచ్చితంగా తయారు చేస్తారు.