కామారెడ్డి జిల్లా జక్కల్ నియోజకవర్గంలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయ్. మూడు ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల పోటీ పెరిగిపోయింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌లో వర్గపోరు కూడా అదే స్థాయిలో పెరిగింది.
జుక్కల్ నియోజకవర్గంలో అధికార పార్టీ టీఅర్ఎస్ నుంచి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించే వారిలో ప్రధానంగా ఇద్దరు నేతలు ఉన్నారు. తమకు టికెట్ ఇవ్వాలంటూ అధిష్ఠానానికి డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి జుక్కల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా హన్మంత్ షిండే ఉన్నారు. అయితే ఇటీవల సర్వేల్లో ఆయనకు వ్యతిరేకంగా జనం ఉన్నట్టు తేలింది. నియోజకవర్గంలో షిండే చేసిన అభివృద్ధి ఏమీ లేదన్న విషయాన్ని ప్రజలు కూడా గ్రహిస్తున్నారని పార్టీ శ్రేణులు చెప్పుకుంటున్నాయ్.
జుక్కల్ ఎస్సీ రిజర్వేషన్. దీంతో అధికార టీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్సీ రాజీశ్వర్ కూడా ఈసారి జుక్కల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నట్లు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్సీ రాజేశ్వర్ నియోజకవర్గంలో తన పని తాను చేసుకుపోతున్నారు. దీంతో ఎమ్మెల్యే హన్మంత్ షిండే, రాజేశ్వర్ వ్యవహరారం పార్టీకి తలనొప్పిగా మారింది. సర్వేల్లో షిండే ప్రభావం తగ్గిందన్న ప్రచారంతో ఎమ్మెల్సీ రాజేశ్వర్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీ నుంచి టికెట్ పొందేందుకు ప్లాన్‌తో ముందుకెళ్తున్నారని సమాచారం. దీంతో వీరి మధ్యం వైరం ముదురుతోంది.
బీజేపీలో పరిస్థితి మరోలా ఉంది. జుక్కల్ నుంచి బీజేపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో బరిలో దిగేందుకు మాాజీ ఎమ్మెల్యే అరుణ తార ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అరుణ తార బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు. బీజేపీ సీనియర్ నేత నాయుడు ప్రకాష్ సైతం బీజేపీ టికెట్ ఆశిస్తున్నవారిలో ఉన్నారు. గత ఎన్నికల్లో నాయడు ప్రకాష్ బాన్సువాడ నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈసారి బాన్సువాడ నుంచి మల్యాద్రి రెడ్డి ఉండటంతో ... నాయుడు ప్రకాశ్ జుక్కల్ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. బీజేపీ టికెట్ రేసులో నాయుడు ప్రకాశ్ కూడా ఉన్నారు. అరుణ తార, నాయుడు ప్రకాష్ మధ్య టికెట్ లొల్లి నడుస్తోంది. దీంతో క్యాడర్ లో కన్య్ఫుజన్ క్రియేట్ అవుతోంది. ఎవరికి వారే పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. టికెట్ తమకమంటే తమకే వస్తుందన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో వీరిద్దరి మధ్య వర్గ పోరు నెలకొందని చెప్పుకుంటోంది జుక్కల్ నియోజకవర్గ బీజేపీ క్యాడర్.
కాంగ్రెస్‌లో పరిస్థితి కూడా టీఆర్ఎస్, బీజేపీలో ఉన్న మాదిరిగానే ఉంది. కాంగ్రెస్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సౌదాగర్ గంగారాం... ఈసారి కూడా జుక్కల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఉన్నారు. పార్టీలో గంగారాం సీనియర్ నాయకుడు. గతంలో టికెట్ తనకు కాకుండా వేరే వాళ్లకు ఇస్తారని తెలియటంతో నాటి పీసీసీ చీఫ్ డీఎస్ ను సైతం లెక్కచేయలేదు గంగారాం. అయితే కాంగ్రెస్ నుంచే మరో నాయకుడు గడుగు గంగాధర్ జుక్కల్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నారు. గడుగు గంగాధర్ రెండు సార్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పోటీ చేశారు. ఈసారి అధిష్టానం అండదండలు తనకే ఉన్నాయని... నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేయాలని ఆదేశాలు వచ్చాయని.... అందుకే జుక్కల్ నియోజకవర్గంలో ఆయన యాక్టివిటీస్ పెంచారని తెలుస్తోంది. జుక్కల్ నియోజకవర్గంలో సౌదాగర్ గంగారాం, గడుగు గంగాధర్ ఎవరికి వారే పార్డీ కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో గంగాధర్, గంగారాం మధ్య వర్గపోరు నెలకొంది. మరికొన్ని రోజుల్లో రాహుల్ భారత్ జోడో యాత్ర కూడా జుక్కల్ నియోజకవర్గంలో జరగబోతోంది. దీనికి ఈ ఇద్దరు నేతలు పోటాపోటీగా జనసమీకరణ చేసేందుకు రాహుల్ యాత్రను సక్సెస్ చేసేందుకు పోటీ పడుతున్నారు. అయితే ఇద్దరి మధ్య వైరం మాత్రం మరింత ముదిరిందని పార్టీ నేతలు చెప్పుకుంటున్నారు.
ఇది జుక్కల్ నియోజకవర్గంలో మూడు ప్రధాన పార్టీల పరిస్థితి. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఆశించే సభ్యుల సంఖ్య పెరుగుతుండటంతో వారి మధ్య వైరం కూడా ముదురుతోందని చెప్పవచ్చు. అయితే వీరి మధ్య వర్గ పోరు వల్ల క్యాడర్ మాత్రం గందరగోళంలో పడుతోంది. ఇది ఏ పార్టీకైనా ఇబ్బందికర పరిస్థితిగా మారవచ్చంటున్నారు రాజకీయా విశ్లేషకులు.