వెంకటాపూర్: మంచిర్యాల జిల్లా వెంకటాపూర్ అటవీ ప్రాంతంలో మరోసారి పెద్దపులి సంచారం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అటవీ ప్రాంతంలో ఆవుల మందపై పెద్దపులి పంజా విసిరింది. వెంకటాపూర్ గ్రామానికి చెందిన రాజలింగు ఆవులను సమీపంలోని అటవీ ప్రాంతానికి మేతకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం పులి లేగదూడపై దాడి చేసి చంపేసిందని స్థానికులు తెలిపారు. రాజలింగు ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.

సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించి పులి పాదముద్రలను సేకరించారు. ఆపై పంచనామా నిర్వహించి, పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివేదిక అందించినట్లు అటవీశాఖ అధికారులు, సిబ్బంది తెలిపారు. ఈ విషయంపై బెల్లంపల్లి అటవీ రేంజ్ అధికారి పూర్ణ చందర్ ని abp దేశం ఫోన్ ద్వారా వివరణ కోరగా.. బెల్లంపల్లి రేంజ్ పరిధిలో పులి సంచరిస్తున్నట్లు ఆయన నిర్ధారించారు. పులి గత కొద్ది రోజులుగా తిర్యానీ ప్రాంతం నుండి బెల్లంపల్లి సరిహద్దు ప్రాంతంలో తీరుగుతోందని, వెంకటాపూర్ అటవీ ప్రాంతంలో ఓ లేగదూడపై దాడి చేసిన విషయం వాస్తవమేనని, పులి దాడి చేసిన ప్రదేశం నుండి పరిసర ప్రాంతాల్లో పులి పాదముద్రలను సేకరించామన్నారు. పరిసర ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

బాధిత రైతుకు అటవీశాఖ తరఫున పరిహారం అందజేయనున్నట్లు తెలిపారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లోని సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవిలోకి ఎవరూ ఒంటరిగా వెళ్లొద్దని గ్రామస్తులను అలర్ట్ చేయడం జరిగిందన్నారు. పులికి ఎవరు హాని చేయొద్దని, పొలాల్లో విద్యుత్తు కంచెలు ఉంటే తొలగించాలని, పులి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని గ్రామస్తులకు అవగాహన కల్పించామన్నారు.