komaram bheem asifabad District: కాగజ్‌నగర్: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని దరిగాం అటవీ ప్రాంతంలో వరుస పులులు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఆదివారం (జనవరి 7న) k15 అనే పులి మృతి (Tiger Dies) చెందిన మరుసటి రోజే మరో పులి చనిపోయినట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఆవాసం (Shelter For Tiger) కోసం రెండు పులుల మధ్య జరిగిన పోరాటంలో రెండు సంవత్సరాల k15 అనే ఆడపులి చనిపోయినట్లు సోమవారం అధికారులు వెల్లడించారు. దాదాపు అదే ప్రాంతంలో మరో పులి చనిపోయినట్లు అటవీ అధికారులు మంగళవారం తెలిపారు.
చనిపోయిన మరో పులి గాయాల నిర్ధారణ కోసం అధికారులు ట్రాప్ కెమెరాలను పరిశీలించారు. పులి వాగులో మరణించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు పులుల సంరక్షణ ప్రత్యేక అధికారులు, వెటర్నరీ అధికారుల బృందం సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు) రాకేశ్ డోబ్రియల్, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ పరగ్వేన్, సీసీఎఫ్ శాంతారామ్, డీఎఫ్ఓ నీరజ్ టిబ్డేవాల్ పెద్దపులి మృతదేహాన్ని మంగళవారం పర్యవేక్షించారు. పులి మరణించిన స్థలానికి మీడియాను అనుమతించలేదు. వివరాల కోసం దరిగాం అటవి ప్రాంతంలో కొన్ని గంటలపాటు వేచి ఉన్నారు. అధికారులు వివరాలు చెప్పడం లేదు, మరోవైపు అక్కడికి అనుమతించడం లేదని.. ఎలాగైనా సరే వెళ్తామని కదలడంతో అటవీశాఖ అధికారులు మీడియా వద్దకు వచ్చి వివరాలు వెల్లడించారు.
పీసీసీఎఫ్ రాకేశ్ డోబ్రియల్ మీడియాతో మాట్లాడుతూ... మృతి చెందిన పెద్దపులి S9 పులిగా గుర్తించారు. పులి తలకు ఉచ్చు బిగించి ఉందన్నారు. ఈ రెండో పులిపై విష ప్రయోగం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేశారు. మృతి చెందిన పులి, సమీపంలో మృతి చెందిన పశువు అవయవాల శాంపిల్స్ ను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించినట్లు వెల్లడించారు. మృతి చెందిన పులులను, పశువును దహనం చేసినట్టు తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చాక పులుల మరణాలపై త్వరలో పూర్తిస్థాయి సమాచారం వెల్లడిస్తామన్నారు.
జంతు ప్రేమికులు ఆగ్రహం
ఒకట్రెండు రోజుల వ్యవధిలో దరిగాం అటవీ ప్రాంతంలో రెండు పులులు చనిపోవడం ఏంటని జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు పులులు ఆవాసం కోసం కోట్లాడి చనిపోయాయా, విష ప్రయోగం జరిగిందా అని త్వరగా తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. వన్యమృగాలపై అటవీశాఖ అధికారులు ఫోకస్ చేయడం లేదని, వారి నిర్లక్ష్యం కారణంగా పులుల వరుస మరణాలు సంభవిస్తున్నాయని మండిపడుతున్నారు. అడవిలోకి ఎవరూ వస్తారో, వెళ్తారో గుర్తించని స్థితిలో ఉన్నారని అన్నారు. పులుల మరణాల విషయంలో బాధ్యులైన అధికారులపై వేటు పడే అవకాశం ఉందని స్థానికంగా చర్చించుకుంటున్నారు.
భీకర పోరులో ఓ ఆడపులి మృతి
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి మృతిచెందింది. కాగజ్ నగర్ మండలంలోని దరిగాం అటవీ ప్రాంతంలో ఆదివారం ఓ ఆడపులి మృతి చెందినట్లు గుర్తించారు. కాగజ్ నగర్ టైగర్ రిజర్వ్ లో గత రెండు నెలల కిందట పులులు పలు ఆవులపై దాడి చేసి చంపేశాయి. తాజాగా ఆదివారం ఓ పులి దరిగాం అటవి ప్రాంతంలో మృతి చెందినట్లు అధికారులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలాన్ని సీసీఎఫ్ శాంతా రామ్ అటవీశాఖ అధికారులతో కలిసి సందర్శించారు. చనిపోయింది ఆడ పులి అని, తల, మెడ ప్రాంతంలో తీవ్రగాయాలు అయినట్లు వెల్లడించారు