నిజామాబాద్(Nizamabad) జిల్లా అమ్రాబాద్(Amrabad)లో దారుణం జరిగింది. మంచిప్ప(Manchippa) రిజర్వాయర్ రీ డిజైన్ ఓ ప్రాణాన్ని బలి తీసుకుంది. భూములు ఎక్కడ పోతాయో అన్న బెంగతో ఓ వృద్దురాలు ఆత్మహత్య చేసుకుంది.
మంచిప్ప రిజర్వాయర్ రీ డిజైన్‌పై చాలా రోజులుగా అమ్రాబాద్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఈ నిరసనలను మరింత తీవ్రతరం చేశారు. 10 ముంపు గ్రామాల ప్రజలు ఈ డిజైన్‌కు వ్యతిరేకంగా స్వరం వినిపిస్తున్నారు.
22వ ప్యాకేజి కింద చేపడుతున్న మంచిప్ప రిజర్వాయర్ పంప్ హౌస్ పనులను అమ్రాబాద్ గ్రామస్థులు వారం రోజుల కింద అడ్డుకున్నారు. అయినా అధికారులు మళ్లీ పనులు చేపట్టేందుకు ప్రయత్నాలు తీవ్రం చేశారు. ఈసారి పోలీసు బందోబస్తుతో వచ్చి పనులు చేయడానికి యత్నించారు.
పోలీసుల సమక్షంలో పనులు ప్రారంభిస్తున్నారన్న విషయం తెలుసుకున్న ప్రజల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఓ వృద్ధురాలు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రాజెక్ట్ పూర్తయితే భూములు, ఇల్లు తమకు దక్కకుండా పోతాయిని వాటినే నమ్ముకొని జీవిస్తున్న తమకు ఇక బతుకే ఉండని భయాందోళనకు గురై బలవన్మరణానికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు.
అమ్రాబాద్‌లోని మంచిప్ప గ్రామానికి చెందిన గజ్జి భాయి ఆనే మహిళ ఉరి వేసుకుని చనిపోయిన ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. మృతదేహాంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళన చేపట్టారు. పంప్ హౌస్ వద్ద నిరసనకు దిగారు. తమకు అంగీకారం కాని రీ డిజైన్ వెనక్కి తీసుకొవాల్సిందేనంటూ పట్టుబట్టారు.
ఇప్పటి వరకు ప్రాజెక్ట్ డిపిఆర్(DPR) కూడా చూపలేదని ఇష్టారాజ్యంగా ప్రాజెక్ట్ పనులు చేస్తున్నారని మంచిప్ప గ్రామ సర్పంచ్ సిద్దార్ధ ఆరోపించారు. ప్రాజెక్ట్ వల్ల 10 గ్రామాల ప్రజలు పూర్తిగా అన్యాయానికి గురవుతారని వెంటనే ప్రాజెక్ట్ పనులు నిలిపి వేయాలని డిమాండ్ చేశారు.
మల్లన్న సాగర్ నిర్వాసితుల పరిస్థితిని చూసి అమ్రాబాద్ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విలువైన భూములు కోల్పోవటమే కాకుండా... గిరిజనులకు ఉపాధి కల్పించే అటవీ సంపద కూడా కోల్పోతామని ఆవేదన చెందుతున్నారు. మొదట 1.5 టీఎంసీ(TMC)లు నిర్మిస్తామని చెప్పి టీఆర్‌ఎస్(TRS) ప్రభుత్వం వచ్చాక 3.5 సామర్థ్యంతో రిజర్వాయర్ రీ డిజైన్ చేశారని ఆరోపించారు. ఈ రీడిజైన్ కారణంగా 10 గ్రామాలకు ముంపు పొంచి ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఇప్పుడైనా ప్రజల ఆందోళన అర్థం చేసుకొని అధికారులు పునరాలోచించాలని వేడుకుంటున్నారు అమ్రాబాద్ ప్రజలు. లేకుంటే మరిన్ని ఆత్మహత్యలు చూస్తారని హెచ్చిస్తున్నారు.