గత కొన్ని రోజులుగా కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఇద్దరు నేతల మధ్య వర్గ పోరు సస్పెన్షన్ దాకా వచ్చింది. అసలే కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం కోసం పాకులాడుతుంటే నేతల ఆధిపత్య పోరు పార్టీని మరింత కుంగదీస్తోంది. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మదన్మోహన్ రావు, సుభాష్ రెడ్డిల మధ్య వైరం నడుస్తోంది. పీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొన్న రైతు సభ నుంచి మదన్మోహన్ రావు, సుభాష్ రెడ్డి మధ్య వర్గ పోరు బహిరంగమైంది. మదన్మోహన్ రావు జహిరాబాద్ నుంచి గత ఎన్నికల కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు స్వల్ప తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థిపై ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జాజుల సురేంధర్ పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థీపై గెలిచారు. అనంతరం సురేంధర్ టీఆర్ఎస్ పార్టీలో చేరిపోయారు. ఇక అప్పటి నుంచి మదన్మోహన్ రావు ఎల్లారెడ్డి నియోజకవర్గంపై కన్నేశారు. దీంతో సుభాష్ రెడ్డి, మదన్మోహన్ రావు మధ్య వర్గ పోరు నెలకొంది. ఈ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
తారాస్థాయికి నేతల అధిపత్య పోరు
అధిష్టానానికి రెండు, మూడు సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని... కామారెడ్డి డీసీసీ మదన్మోహన్ పై వేటు వేసింది. అసలే నేతల వలసలతో ఇబ్బంది పడుతున్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతను సస్పెండ్ చేయటంపై జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. ఇలా చేయటం పార్టీకి నష్టమే అయినా కామారెడ్డి డీసీసీ ఈ నిర్ణయానికి వచ్చింది. గత కొన్ని నెలలుగా మదన్మోహన్ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. రేవంత్ రైతుసభతో మదన్మోహన్, సుభాష్‌రెడ్డి మధ్య వార్ మొదలైంది. బాహాబాహీకి దిగారు. ఇరువర్గాల మధ్య దూషణల పర్వం కొనసాగింది. దీనిపై అధిష్టానం సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చిందని సమాచారం.
అయితే మదన్మోహన్ రావు కొద్ది కాలంగా పార్టీలో డీసీసీకి సమాచారం ఇవ్వకుండానే కార్యక్రమాలు చేస్తున్నారని, నియోజకవర్గ ఇంఛార్జ్ లతో సమన్వయం చేసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని భావించింది డీసీసీ. అయితే రాష్ట్ర స్థాయి నేత, పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మధన్మోహన్ పై డీసీసీకి వేటు వేసే అధికారం ఉందా అన్న ప్రశ్న కూడా తలెత్తింది.
కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గాల ఇంఛార్జ్ లు కూడా మదన్మోహన్ రావు వ్యహరశైలిపై అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. అటు పీసీసీలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి షబ్బీర్ అలీకి కూడా మదన్మోహన్ రావు అంటే గిట్టదన్న ప్రచారం కూడా జరుగుతోంది. గతంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా షబ్బీర్ అలీ కొడుకు ఇలీయాస్ పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో మదన్మోహన్ రావు ఇలియాస్ కు వ్యతిరేకంగా పనిచేశారన్న వాదనా కూడా ఉంది. డీసీసీ, జిల్లాలోని నియోజకవర్గ ఇంఛార్జ్ లకు కనీస సమాచారం లేకుండా మదన్మోహన్ రావు వ్యవహరిస్తున్నారన్న దానిపైనా డీసీసీ సీరియస్ గా ఉందని అందుకే సస్పెన్షన్ వేటు వేసిందన్న వార్తలు వినిపిస్తున్నాయ్.
ఇప్పటికే పీసీసీ మదన్మోహన్ రావు వేటుపై పీసీసీ వివరణ కోరింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మదన్మోహన్ రావు కాంగ్రెస్ పార్టీలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. జహిరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు. మరి మదన్మోహన్ రావు పై వేటు కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు నష్టం చేకూరుస్తుందన్న దానిపై కూడా చర్చ జరుగుతోంది.